తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కొవిడ్‌ వేళ.. భగ్గుమంటున్న ధరలు

కరోనా వేళ నిత్యావసర సరకుల ధరలు మండిపోతున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కరోనా దెబ్బకు విలవిల్లాడుతూ మూత పడుతుండగా.. కొన్ని కార్మికులకు పనిదినాలు తగ్గిస్తూ.. వేతనాల కోతపెడుతున్నాయి. మరికొన్ని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో నిరుద్యోగం ప్రబలుతోంది.

Rates
నిత్యావసర సరకుల ధరలు

By

Published : May 25, 2021, 9:12 AM IST

Updated : May 25, 2021, 9:35 AM IST

కొవిడ్‌ సంక్షోభంతో తల్లడిల్లుతున్న పేద, మధ్య తరగతి వర్గాలకు నిత్యావసర సరకుల ధరలు పిడుగుపాటుగా పరిణమిస్తున్నాయి. ఒకపక్క పలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కరోనా దెబ్బకు విలవిల్లాడుతూ మూత పడుతుండగా, మరికొన్ని కార్మికులకు పనిదినాలు తగ్గిస్తూ తొలగిస్తున్నాయి. దీంతో నిరుద్యోగిత ప్రబలుతోంది. ఈ పరిస్థితుల్లో మండుతున్న నిత్యావసర సరకుల ధరలు- ఉపాధి, ఆదాయాలు కోల్పోయినవారి జీవన స్థితిగతుల్ని దెబ్బతీస్తున్నాయి.

కాక పుట్టిస్తున్న కూరగాయల ధరలు

దేశంలో గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినా, దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నా పెరుగుతున్న ధరలు పేదల పౌష్టికాహారంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం నెలకొంది. నిత్యావసర నిల్వలు సరిపడినంతగా ఉన్నాయని ప్రభుత్వాలు భరోసా ఇస్తుండగా, వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ల వల్ల సరకు రవాణా సక్రమంగా సాగక ధరలు జోరందుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా, వంటనూనెలు, పప్పులు వంటి నిత్యావసరాలతోపాటు కూరగాయల ధరలు సైతం కాక పుట్టిస్తున్నాయి.

దయనీయంగా పప్పుల ఉత్పత్తి
వంట నూనెల ధరలు మొదటి దశ కరోనా వ్యాప్తి నుంచి అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో వివిధ రకాల వంటనూనెల సగటు ధరలు కిలో రూ.90 నుంచి రూ.100 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.180కి పైగా పెరిగాయి. ఇంత గరిష్ఠ స్థాయిలో ఎన్నడూ పెరిగిన దాఖలాలు లేవు. పప్పుల ధరలు సైతం గత ఆరు నెలల్లో 30 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. భారత్‌లో తలసరి వంట నూనెల వినియోగం ఏటా 12 కిలోలు; ప్రపంచ సగటు 19 కిలోల మేరకు ఉంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న సరకును మించి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత ముఫ్పై ఏళ్లుగా దిగుబడుల విషయంలో పెద్దగా మార్పు రాకపోవడంతో ఏటా దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో పప్పుల ఉత్పత్తి పరిస్థితీ దాదాపు ఇలాగే ఉంది.

భారత్ కంటే కెనడా మిన్న

ప్రపంచ సగటు దిగుబడులకంటే తక్కువగా ఉండటం, పంట విస్తీర్ణం ఆశించినంతగా పెరగక పోవడంతో వాటి ధరలు ఎగబాకుతున్నాయి. దేశంలో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ముందున్నాయి. ప్రపంచ సగటు దిగుబడి హెక్టారుకు 820 కిలోలు ఉండగా మనవద్ద 760 కిలోలు మాత్రమే. కెనడా 1,900 కిలోల సగటు దిగుబడితో భారత్‌ కంటే దాదాపు రెండున్నర రెట్లు సాధిస్తోంది.

ప్రపంచ ఉత్పత్తిలో 25 శాతం మనదేశంలో పండుతుండగా, వినియోగం అంతకుమించి ఉంది. దీంతో ప్రపంచంలో పండే పప్పు గింజల్లో 14 శాతం మేర దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దాదాపు ఏటా 40లక్షల టన్నుల మేరకు దిగుమతి చేసుకుంటున్నాం. కెనడా మొత్తం ఎగుమతుల్లో 27 శాతం మన దేశం వాటాగా ఉంటోంది. మొత్తం పప్పుధాన్యాల సేద్యంలో 15 శాతం పంటకు మాత్రమే నీటి సౌకర్యం ఉంది. మిగతా 85శాతం వర్షాధారంపైనే పండిస్తున్నారు.

నాణ్యమైన విత్తనాలు వేయకపోవడం, తెగుళ్లు, సకాలంలో తగిన పెట్టుబడులు పెట్టకపోవడం తదితర పరిస్థితులు సైతం దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా ఉత్పత్తుల్లో నిలకడ లేకపోవడం, కొన్నిసార్లు దిగుమతుల్లో జాప్యం చోటుచేసుకోవడం, కొందరు వ్యాపారులు అక్రమంగా భారీ మొత్తంలో నిల్వ చేయడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

గరిష్ఠ స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ నెలలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరింది. ఆహార, తయారీ వస్తువులతో పాటు ముడిచమురు ధరల పెరుగుదలతో 10.49శాతంగా నమోదైంది. ఒక నెల వ్యవధిలోనే గుడ్లు, మాంసం, చేపల ధరలు 10.88 శాతం, పప్పు ధాన్యాలు 11శాతం, పళ్లు 27శాతం పెరగడంతో ద్రవ్యోల్బణం రెచ్చిపోతోంది. దీంతో చిల్లర విపణిలోనూ ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

కొన్ని నెలల పాటు రేషన్‌ కార్డులతో సంబంధం లేకుండా నిత్యావసరాలను అందించాలంటున్న ఆర్థిక నిపుణుల సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలి. నిత్యావసర సరకుల నిల్వలపై నియంత్రణ విధించడంతో పాటు, నల్లబజారుకు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. వంట నూనెలు, పప్పుల దిగుమతులపై ముందుగానే దృష్టి పెట్టి ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలి. నిత్యావసరాల ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్న చమురు ధరలకు కళ్ళెం వేయాలి.

- ఎం.ఎస్‌.వి.త్రిమూర్తులు

ఇదీ చదవండి:ప్రతి 8 నిమిషాలకు ఓ చిన్నారి అదృశ్యం!

Last Updated : May 25, 2021, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details