Clothing Industry Pollution : ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తోంది. సుమారు 140 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ కలిగిన ఫ్యాషన్ రంగంలో 7.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు, ఏటా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో 10శాతానికి ఈ పరిశ్రమే కారణమవుతోంది. విమానయానం, నౌకా రవాణాల వల్ల విడుదలయ్యే దానికంటే ఎక్కువగా 120కోట్ల టన్నుల బొగ్గుపులుసు వాయువు వస్త్రపరిశ్రమ నుంచి విడుదల అవుతున్నట్లు గతంలో ఒక అధ్యయనం వెల్లడించింది. 2030నాటికి ఫ్యాషన్ పరిశ్రమ నుంచి వెలువడే హానికర గ్రీన్‌హౌస్ వాయువులు మూడింతలు పెరగవచ్చని అంచనా. వస్త్రాల తయారీలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ముందుంటే, వాటిని ఎక్కువగా ధనిక దేశాలు వినియోగిస్తున్నాయి. భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 14శాతం వాటా వస్త్ర పరిశ్రమదే. ప్రపంచ వస్త్ర ఎగుమతుల్లో ఇండియా రెండో స్థానాన్ని ఆక్రమించింది.
ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్నకొద్దీ..
Textile Industry Pollution : ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్నకొద్దీ భూమికి వస్త్ర భారం అధికమవుతూనే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రపంచ తలసరి వస్త్రోత్పత్తి 1975లో 8.4కిలోలు. 2021నాటికి అది 14 కిలోలకు పెరిగింది. 2030నాటికి ఈ పరిమాణం 17.5 కిలోలకు ఎగబాకుతుందని భావిస్తున్నారు. జనాభా పెరుగుదలతోపాటే వస్త్ర పరిశ్రమా అంతకంతకు విస్తరిస్తోంది. ప్రస్తుతం ఏటా 15వేల కోట్ల టన్నుల వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో నాలుగు కోట్ల టన్నుల మేర వినియోగదారుల చేతికి చేరకుండానే పోగుపడుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్లు వస్తుండటంతో వినియోగదారుల అభిరుచులు మారిపోతున్నాయి. వారు కొనుగోలుచేసిన దుస్తుల్లో 85శాతం ఏడాది తరవాత అసలు వినియోగానికే నోచుకోవడంలేదని అంచనా!
నదుల్లోకి ప్రమాదకర రసాయనాలు..
Water Pollution Of Fashion Industry : వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటోంది. పత్తి ఉత్పత్తి మొదలు... నూలు తయారీ, అద్దకం, ఫినిషింగ్ వంటి దశల్లో నీరు అధికంగా వినియోగమవుతుంది. ఒక జత జీన్స్ ఉత్పత్తికి రెండు వేల గ్యాలన్ల నీరు అవసరం. ఈ ఉత్పత్తి ప్రక్రియ పూర్తయ్యేసరికి భారీగా ఘన, జలవ్యర్థాలు విడుదలవుతాయి. ముఖ్యంగా రంగులు, బ్లీచ్ వంటి ప్రమాదకర రసాయనాలు నదుల్లోకి చేరుతున్నాయి. అందువల్లే ప్రపంచంలో నీటి కాలుష్యం పరంగా వస్త్ర పరిశ్రమ రెండో స్థానంలో నిలుస్తోంది. పాలిస్టర్ ఉత్పత్తివల్లా కర్బన ఉద్గారాలు విపరీతంగా వెలువడుతున్నాయి.