'గత వందేళ్ల కాలంలో మానవ చర్యల వల్ల ప్రకృతికి పూడ్చలేని నష్టం జరిగింది. ప్రపంచ దేశాలు, పర్యావరణ సంస్థలు అంచనా వేసినదానికంటే ఎక్కువగా పర్యావరణం దెబ్బతింది. భూతాపం(Global Warming), వాతావరణ మార్పుల(Climate change) నియంత్రణకు ఇప్పటికైనా పటిష్ఠమైన చర్యలు తీసుకోకపోతే మొత్తం మానవాళి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వచ్చే శతాబ్దాల్లో మనిషితో పాటు మరెన్నో జీవులు ఒక్కపెట్టున అంతరించే పరిస్థితులు సైతం దాపురించవచ్చు'- వాతావరణ మార్పులపై(Climate change) ఐక్యరాజ్య సమితి నియమించిన అంతర ప్రభుత్వాల కమిటీ(ఐపీసీసీ) చేసిన హెచ్చరిక ఇది. ఇటీవల విడుదలైన ఐపీసీసీ ఆరో మదింపు నివేదిక(Un Ipcc Report 2021) భూగోళానికి జరుగుతున్న నష్టాన్ని కూలంకషంగా వివరించింది. యూకేలోని గ్లాస్గోలో కాప్-26 సదస్సు కొనసాగుతున్న తరుణంలో, ఆ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆరో మదింపు నివేదికలో..
ఐపీసీసీలో మూడు బృందాలు ఆరో మదింపు నివేదికను(Un Ipcc Report 2021) తయారు చేస్తున్నాయి. ఒక బృందం నివేదిక విడుదలయ్యింది. వచ్చే ఏడాది మిగిలిన రెండింటి పరిశీలనలతో కలిపి పూర్తి నివేదిక రానుంది. ఐపీసీసీలోని 195 సభ్య దేశాలు ఆరో నివేదికను ఆమోదించాయి. ఇందులో తొలిసారిగా ప్రాంతీయ పర్యావరణ వ్యవస్థలపై లోతైన విశ్లేషణలు చేశారు. వాతావరణ మార్పులు(Climate change), కర్బన ఉద్గారాలు(Carbon emissions), కరవులు, తుపానులు, వేడిగాలులు, మంచు కొండలు కరిగిపోవడం, సముద్ర మట్టాల పెరుగుదల, ఎడారీకరణ వంటి అంశాలను క్షుణ్నంగా వివరించారు. ఏటికేడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఇప్పటిదాకా అంచనా వేసిన గణాంకాలను ఈ నివేదిక పునస్సమీక్షించింది. ఐపీసీసీ అయిదో నివేదిక కాలంతో(2014) పోలిస్తే- ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 0.3 డిగ్రీలు పెరిగినట్లు ఆరో నివేదిక స్పష్టంచేసింది.
వచ్చే రెండు దశాబ్దాల్లోనే..
భూతాపాన్ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు 2015లో పారిస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చూడాలని, సాధ్యమైనంత వరకు వాటిని 1.5 డిగ్రీలకే పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2030-52 మధ్య ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల దాకా పెరగవచ్చని ఐపీసీసీ భూతాప ప్రత్యేక నివేదిక నాలుగేళ్ల క్రితం అంచనా వేసింది. వచ్చే రెండు దశాబ్దాల్లోనే ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలకు మించిపోయే ప్రమాదం ఉందని తాజా నివేదిక హెచ్చరించింది. నిర్దిష్ట చర్యలు తీసుకోకపోతే ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు సైతం దాటే అవకాశం కనిపిస్తోంది. ఉష్ణ తీవ్రత 1.5 డిగ్రీలకు పెరిగితే వేడి గాలులు అధికమవుతాయి. ఎండాకాలం పెరిగి, శీతాకాలం తగ్గుతుంది. ఇక రెండు డిగ్రీలు దాటితే, వేడిగాలులు పరిమితులు మించిపోతాయి. వ్యవసాయానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది.
భారత్‌పై ప్రభావం
శీతోష్ణస్థితుల్లో మార్పులు, భూతాపం(Global Warming) ప్రభావం దక్షిణాసియా దేశాల్లో అధికంగా ఉంటుందని ఐపీసీసీ నివేదిక పేర్కొంది. భారత ఉపఖండంలో అధిక కరవులు, వర్షాలు సంభవించే ప్రమాదం ఉంది. అనూహ్య భారీ వర్షపాతాలు ఇరవై శాతందాకా పెరుగుతాయి. 7500 కి.మీ. పైబడిన తీర ప్రాంతం కలిగిన భారత్‌లో సముద్ర మట్టాలు పెరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. సముద్ర మట్టాలు 50 సెంటీమీటర్లు పెరిగితే ఆరు తీర నగరాలు తీవ్ర ముంపు సమస్యను ఎదుర్కొంటాయి. చెన్నై, కొచ్చి, కోల్‌కతా, ముంబయి, సూరత్, విశాఖపట్నం నగరాల్లో నివసించే 2.86 కోట్ల మంది ప్రభావితులవుతారు. వాతావరణంలో అసాధారణ మార్పుల వల్ల పట్టణాలు, నగరాల్లోని పేదల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారతాయి. ఆహారం, నిరుద్యోగ సమస్యలు ముప్పిరిగొంటాయి.