తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సమాచార హక్కు- ప్రజాస్వామ్యానికి సంజీవని - సమాచార హక్కు చట్టం 2005

రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రస్తావించిన భావ ప్రకటన స్వేచ్ఛే పౌరులకు సమాచార హక్కును ప్రసాదిస్తోందని 1986లోనే సుప్రీంకోర్టు స్పష్టీకరించినా- పిమ్మట 19 ఏళ్లకుగాని ఆ విప్లవాత్మక చట్టం చేసే తీరిక ప్రభుత్వాలకు చిక్కలేదు. అధికార స్థానాల్లో అవినీతి చీకట్లను పోకార్చే ఉషాకిరణంలా, ప్రజల చేతి పాశుపతంగా సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి నిన్నటికి పదిహేనేళ్లు! పౌరులకుగల తెలుసుకొనే హక్కు- ప్రజాస్వామ్యానికి సంజీవని. పౌర హక్కుగా దాన్ని కాపాడుకోవడం అందరి విధి!

rti act
సమాచార హక్కు చట్టం

By

Published : Oct 13, 2020, 6:55 AM IST

ఏ రాజ్య వ్యవస్థలోనైనా జవాబుదారీతనం, పారదర్శకతలు సుపరిపాలనకు రెండు కళ్లు. వలస పాలకుల కాలం నాటి అధికార రహస్యాల చట్టాన్ని అడ్డుపెట్టుకొని గుట్టుగా ప్రజాధనం లూటీకి లాకులెత్తిన పార్టీల పుణ్యమా అని, దేశంలో అధికారం అవినీతికి పర్యాయపదంగా మారిపోయిందని చెప్పక తప్పదు. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రస్తావించిన భావ ప్రకటన స్వేచ్ఛే పౌరులకు సమాచార హక్కును ప్రసాదిస్తోందని 1986లోనే సుప్రీంకోర్టు స్పష్టీకరించినా- పిమ్మట 19 ఏళ్లకుగాని ఆ విప్లవాత్మక చట్టం చేసే తీరిక ప్రభుత్వాలకు చిక్కలేదు. అధికార స్థానాల్లో అవినీతి చీకట్లను పోకార్చే ఉషాకిరణంలా, ప్రజల చేతి పాశుపతంగా సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి నిన్నటికి పదిహేనేళ్లు!

మూడు శాతమే..

జవాబుదారీతనం పునాదులపై పారదర్శక వ్యవస్థల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపరంగా జరిగిన కృషి ఏమిటో ఆరా తీస్తే నిర్వేదం కలుగుతుంది. సమాచార హక్కు స్ఫూర్తికి గొడుగు పట్టడం మాట అటుంచి, ఎక్కడికక్కడ దానికి గండి కొట్టడానికి జరిగిన యత్నాల్లోనే భిన్న పార్టీ ప్రభుత్వాల మధ్య పోటాపోటీ! పదిహేనేళ్లలో మూడు కోట్ల పైచిలుకు సమాచార అభ్యర్థనలు ఆర్‌టీఐ ప్రయోజకత్వాన్ని చాటుతున్నా- సమాచారాన్ని కోరుతున్నది పట్టుమని మూడు శాతమే! కేంద్ర రాష్ట్ర స్థాయి సమాచార కమిషన్లలో 2.2 లక్షల కేసులు పెండింగులో ఉండటం, కేంద్ర సంఘంలోనే ఫిర్యాదుల పరిష్కారానికి రెండేళ్లకుపైగా సమయం పట్టడం- పకడ్బందీగా వ్యవస్థ రూపుదిద్దుకోలేదనడానికి ఆనవాళ్లే. 29 సమాచార కమిషన్లలో తొమ్మిదింటికి సారథులే లేకపోవడం, కమిషనర్ల నియామక ప్రక్రియ సజావుగా సాగాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకూ మన్నన కొరవడటం- వ్యవస్థను కుంగదీస్తోంది. ఏటా 40-60 లక్షల ఆర్‌టీఐ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నా ఎకాయెకి 55 శాతానికి సమాచారం అందట్లేదని, పదిశాతంలోపే అప్పీళ్లకు వెళుతున్నారన్న సమాచారం- సర్కారీ విభాగాల్లో పాత వాసనలు పోలేదని రుజువు చేస్తోంది!

కుటిల రాజకీయ మెలికలతో..

'చూడబోతే వెండి గిన్నె'లాంటి చట్టాన్ని 'తాగబోతే వెలితి గిన్నె'లా మార్చేయడంలో ప్రభుత్వాల కళాకౌశలం విస్మయపరుస్తుంది. సమున్నత ఆదర్శాల్ని మేళవించి ప్రపంచంలోనే మేటి చట్టాన్ని తీర్చిదిద్దిన కొన్నాళ్లకే- దస్త్రాలపై అధికారులు రాసే అభిప్రాయాలు చట్టం పరిధిలోకి రావంటూ కుటిల రాజకీయ మెలికలతో యూపీఏ సర్కారు పిల్లిమొగ్గలేసింది. దాని వెన్నంటే, సమాచార కమిషన్లను తమ అంతేవాసులతో నింపేసే జాడ్యం పెచ్చరిల్లింది. ఆర్‌టీఐ చట్టం వచ్చినప్పటినుంచి సమాచార కమిషనర్లుగా కుదురుకొన్న వారిలో దాదాపు 60శాతం ప్రభుత్వ మాజీ అధికారులే. సమాచార సంఘాల సారథులుగా చక్రం తిప్పినవారిలో 83శాతం సర్కారీ సేవకులే! పాతికశాతం పైగా ఖాళీలతో పడుతూ లేస్తున్న వ్యవస్థకు శరాఘాతం లాంటి చట్ట సవరణలకు నిరుడు ఎన్‌డీఏ సర్కారు సమకట్టింది. ఎన్నికల సంఘానికి సమాన ఫాయాలో సమాచార కమిషన్‌ సభ్యుల హోదాలు ఉండటం సరికాదంటూ చేసిన సవరణలతో- వారి పదవీకాలం, జీతనాతాలు కేంద్ర సర్కారు అభీష్టానికి లోబడటంతో సమాచార స్వేచ్ఛను ప్రభుత్వ పంజరంలో బంధించినట్లయింది. కొన్ని షరతులతో 'సుప్రీం' సహా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయమూ ఆర్‌టీఐ పరిధిలోకి వస్తాయంటూ నిరుడు నవంబరులో చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన న్యాయపాలిక ఆయా సందర్భాల్లో 'సమాచార హక్కు'కు గొప్ప దన్నుగా నిలుస్తోంది. అదే సమయంలో ఆర్‌టీఐ బ్లాక్‌ మెయిల్‌ సాధనంగా భ్రష్టుపడుతోందన్న భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్య- ఏ కొందరో చేసే తప్పును అందరికీ అన్వయిస్తోంది. పౌరులకుగల తెలుసుకొనే హక్కు- ప్రజాస్వామ్యానికి సంజీవని. పౌర హక్కుగా దాన్ని కాపాడుకోవడం అందరి విధి!

ఇదీ చూడండి: సాధికార చట్టం వెలుగునీడలు- స.హా.కు 15 ఏళ్లు

ABOUT THE AUTHOR

...view details