తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కొవిడ్​ యుద్ధం: పౌరులే సైన్యం- విజయమే లక్ష్యం - india covid situvation

దేశంపై కరోనా మహమ్మారి ఉరుముతోంది. రోజు రోజుకు నమోదవుతోన్న కొత్త కేసులతో జనంలో కలవరం మరింతగా పెరుగుతోంది. మొదటి లక్ష కేసులు రావటానికి 110 రోజులు పట్టిందని తెలిపిన కేంద్రం.. అదనపు 4 లక్షల కేసులకు కేవలం 40 రోజులు సమయమే పట్టిందని వెల్లడించింది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహమ్మరి పుంజుకుంటుంటే.. మరో పక్క మరి కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వ కృషితో పాటు స్వీయ రక్షణకు ప్రజలు సమాయత్తం కావాలని నిపుణులు చెబుతున్నారు.

CITIZENS ARE WARRIORS IN COVID BATTLE
కొవిడ్‌పై పోరులో పౌరులే సైన్యం

By

Published : Jun 29, 2020, 8:05 AM IST

ప్రాణాంతక కరోనా కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కోటి దాటిపోగా, మూడింట రెండొంతుల ఇన్‌ఫెక్షన్లు మే జూన్‌ మాసాల్లోనే నమోదయ్యాయి. ఇండియాలో తొలి లక్ష కేసులు రావడానికి 110 రోజులు పట్టగా, పిమ్మట నలభై రోజుల్లోపే నాలుగు లక్షల అదనపు కేసులు నమోదు కావడం- కొవిడ్‌ మహమ్మారి తీస్తున్న దొంగదెబ్బ తీవ్రతను చాటుతోంది. దేశీయంగా కరోనా మృతుల సంఖ్య 16 వేలు దాటిందని; ఆ మరణాల్లో 87 శాతానికి, మొత్తం కేసుల్లో 86 శాతానికి ఎనిమిది రాష్ట్ర్టాలే నెలవవుతున్నాయన్న కేంద్ర సర్కారు- రోజువారీ కేసుల పెరుగుదలలో 61 శాతం మహారాష్ట్ర దిల్లీ, తమిళనాడు వాటాయేనంటోంది! ఇండియాలో కరోనా విజృంభణ ఇంకా ఉచ్ఛస్థితికి చేరలేదంటున్న అంచనాలు భీతిల్లజేస్తుంటే- భూటాన్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌ సహా 38 దేశాలు కొవిడ్‌ ఉచ్చునుంచి దాదాపు బయటపడ్డాయన్న అధ్యయనాలు ఆశావహంగా ఉన్నాయి.

మురికివాడ విజయం...

ఆసియాలో అతిపెద్ద మురికివాడ అయిన ధారావి జనసాంద్రత చదరపు కిలోమీటరుకు మూడున్నర లక్షల పైమాటే. అక్కడ కోరసాచిన కొవిడ్‌ను కట్టడి చెయ్యడంలో ప్రభుత్వం- ప్రజల ఉమ్మడి పోరు, మరణాల్ని కనిష్ఠ స్థాయికి పరిమితం చేసిన తీరు సంస్తుతిపాత్రమైనవే. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌ల సంయుక్త జనాభా 24 కోట్లు కాగా కరోనా మహమ్మారి ఆయా దేశాల్లో లక్షా 30 వేలమందిని కబళించింది. అంతే జనాభాగల యూపీలో కరోనా మరణాలు 700లోపే ఉండటానికి లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించడమే కారణంగా తెలుస్తోంది. 2018నాటి నిపా వైరస్‌ను సమర్థంగా కాచుకున్న అనుభవం, పంచాయతీల దాకా పటిష్ఠ ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం, అన్ని స్థాయుల్లోనూ సరైన సమన్వయం- కొవిడ్‌పై పోరులో కేరళను అగ్రగామిని చేశాయి. అందరికన్నా ముందే మేలుకొన్న ఒడిశా పరిమిత వనరుల సమర్థ వినియోగంతో కరోనాను నియంత్రిస్తోంది. ప్రభుత్వాల శక్తి సామర్థ్యాలకు గల పరిమితుల్ని గుర్తించి, స్వీయరక్షణకు ప్రజలే ఇక సమాయత్తం కావాలి.

వైద్య రంగం బలోపేతంపై దృష్టి....

ఉరుములేని పిడుగులా ఊడిపడిన కరోనా విశ్వవ్యాప్తంగా అయిదు లక్షల మందికిపైగా అభాగ్యుల ఉసురు తీసేసింది. వైద్య ఆరోగ్య ప్రమాణాలకు పెట్టింది పేరైన పాశ్చాత్య దేశాలెన్నో కరోనా విలయానికి కకావికలమైపోగా, ఆ తరహా ఉద్ధృతిని తట్టుకొనే శక్తి ఇండియాకు ఎక్కడుంది? జనారోగ్యంపై ఏళ్ల తరబడి స్థూలదేశీయోత్పత్తిలో అటూఇటుగా ఒక్కశాతం ఖర్చు చేస్తున్న ఇండియాలో వైద్య సేవారంగం ఎంత బలహీనంగా ఉందో సాధారణ పరిస్థితుల్లోనే వెల్లడవుతోంది. కొవిడ్‌పై పోరాటానికి కాలూచెయ్యీ కూడదీసుకోవడానికే కేంద్రం లాక్‌డౌన్‌ విధించినా, దానివల్ల కేసుల ఉరవడి 40 శాతం తగ్గిందని సర్కారు లెక్కలు చెబుతున్నాయి.

చికిత్సకు ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయా?

రోజుకు మూడు లక్షల కరోనా పరీక్షల సామర్థ్యాన్ని కొద్ది నెలల్లోనే ఇండియా సముపార్జించినా, రేపటి మహా విస్ఫోటాన్ని తట్టుకొనే స్థాయిలో ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్‌ సదుపాయాలు, వెంటిలేటర్లు ఎక్కడున్నాయి? కేసుల ఉద్ధృతి పెరిగే కొద్దీ తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేయాల్సి రావచ్చునని కేంద్రమే చెబుతున్నా- సత్వరం సరైన చికిత్సలతో బాధితులకు సాంత్వన కలిగించే వైద్యుల్ని ఇప్పటికిప్పుడు ఎక్కడినుంచి తీసుకురాగలరు? ప్రతి పదిలక్షల మందికి అమెరికాలో 350, ఐరోపా దేశాల్లో 600 మరణాలు నమోదవుతున్నా ఇండియాలో అవి 12కన్నా తక్కువేనని ప్రధాని మోదీ చెబుతున్నారు. కరోనాపై పోరులో ప్రజలే చోదక శక్తులనీ ఆయన సరిగానే సూత్రీకరించారు. పోనుపోను కేసులు పెరుగుతున్న తరుణంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలతో లాక్‌డౌన్లకు సిద్ధపడుతున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ కరోనాపై పోరులో సుశిక్షిత సైనికుడవ్వాలి. చేతుల పరిశుభ్రత, ముఖానికి మాస్కు, భౌతిక దూరం నిబంధనల్ని నిక్కచ్చిగా పాటిస్తూ కొవిడ్‌ పొడ సోకని విధంగా సామాజికారోగ్యాన్ని పరిరక్షించాలి.

ఇదీ చూడండి:'కశ్మీర్‌లో 2 నెలలకు సరిపడా వంటగ్యాస్‌ నిల్వ చేయండి'

ABOUT THE AUTHOR

...view details