తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా చైనా దుశ్చర్యలు? - china GDP news

ఆహార కొరత నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికే చైనా లద్దాఖ్‌లో భారత్‌తో లడాయికి దిగిందా అనే అనుమానాలు రేగుతున్నాయి. ఇటీవల దేశంలో ఆహార వృథాను అరికట్టాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. మరోవైపు తమ దేశంలో ఆహార కొరతేమీ లేదని చైనా అధికార వాణి గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొవడం గమనార్హం. ఆ పత్రిక పేర్కొన్నదానికి, దేశ అధ్యక్షుడి మాటాలకు ఎక్కడా పొంతన లేకుండా ఉంది. మరి చైనాలో వాస్తవ పరిస్థితి ఏంటి?

China's misdeeds are to divert people's attention due to Food shortages
ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా చైనా దుశ్చర్యలు?

By

Published : Sep 9, 2020, 7:40 AM IST

దేశంలో ఆహార వృథాను అరికట్టాలని చైనా అధ్యక్షుడు షీజిన్‌ పింగ్‌ ఇటీవల ఇచ్చిన పిలుపు పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆహార కొరత నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికే చైనా లద్దాఖ్‌లో భారత్‌తో లడాయికి దిగిందా అనే అనుమానాలు రేగుతున్నాయి. మావో జే డోంగ్‌ హయాములోనూ తీవ్ర ఆహార కొరత, పారిశ్రామిక విచ్ఛిన్నం సంభవించినందునే, 1962లో బీజింగ్‌ భారత్‌ పై దాడికి దిగిందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. మరోవైపు తమ దేశంలో ఆహార కొరతేమీ లేదని చైనా అధికార వాణి గ్లోబల్‌ టైమ్స్‌ ఉద్ఘాటించింది. నిజానికి గుట్టలుగా పేరుకుపోయిన బియ్యం, గోధుమ నిల్వలను రానున్న రెండు మూడేళ్లలో ఖాళీ చేయడమెలా అని చైనా ప్రభుత్వం మధనపడుతోందని, ఈ ఏడాది వేసవిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గతేడాదికన్నా 0.9 శాతం ఎక్కువని ఆ పత్రిక వివరించింది. మరి చైనాలో వాస్తవ పరిస్థితి ఏమిటి?

క్షీణిస్తున్న ఎగుమతులు

నిజానికి కొవిడ్‌ వల్ల కుదేలైన చైనా ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించాలంటే ప్రజల వినియోగ వ్యయాన్ని పెంచాలని ఇటీవలి వరకు బీజింగ్‌ భావించేది. కరోనా వ్యాప్తి, పారిశ్రామిక స్తంభన వల్ల చైనా నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు తగ్గిపోవడంతో అంతర్గత వినియోగాన్ని పెంచడమే శరణ్యమని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. చైనీయుల వినియోగ వ్యయం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 30శాతమే. ఇది అమెరికాలో 68శాతంగా, భారత్‌లో 60 శాతంగా ఉంది. కొవిడ్‌ తెచ్చిపెట్టిన పారిశ్రామిక, వ్యాపార విచ్ఛిత్తి వల్ల చైనా ప్రజల తలసరి వినియోగ వ్యయంలో ఆరు శాతం మేర కోత పడింది. మొత్తం చిల్లర అమ్మకాలు 11.5శాతం మేర కోసుకుపోయాయి. ఎగుమతుల ఆదాయం తగ్గినందున స్వదేశంలో వినియోగ వ్యయాన్ని పెంచి ఆర్థిక రథానికి ఊపు తేవాలని భావించిన చైనా ప్రభుత్వం, మధ్యతరగతి ప్రజలను దేశమంతటా పర్యటనలు జరుపుతూ, హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనాలు చేస్తూ, ఇతర వస్తుసేవలపై విరివిగా ఖర్చు చేయాలని కొన్ని నెలల క్రితం వరకు ప్రోత్సహించింది.

దానికి తగ్గట్టే రెస్టారెంట్లు విందు భోజనాలు, అల్పాహారాలను భారీ తగ్గింపు రేట్లకు అందించేవి. చౌకగా ఆహారం అందించే రెస్టారెంట్ల కోసం జనం గుంపులుగుంపులుగా తిరుగుతూ అన్వేషించేవారు. భౌతిక దూరం పాటించాలనే నిబంధనలను సైతం పక్కనపెట్టి సామూహిక భోజనాలు చేసేవారు. ఏప్రిల్‌ నుంచి చైనాలో కొత్త కరోనా కేసులు నమోదు కాకపోవడం దీనికి దోహదం చేసింది. ఎవరు ఎక్కువ తింటారో తేల్చుకునే పోటీలను అంతర్జాలంలో ప్రత్యక్షంగా ప్రసారం చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఇకపై పోటీల పేరిట ఆహారాన్ని వృథా చేయవద్దంటూ ప్రభుత్వం ఆదేశిస్తోంది. నిర్ణీత మొత్తాన్ని మించి ఆహారాన్ని వృథా చేసే విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే అర్హత ఉండదని ఒక పాఠశాల ప్రకటించింది. ఖాతాదారులు తమ బరువు తూచుకుని మితంగా తినడానికి వీలుగా ఒక రెస్టారెంట్‌ ఎలక్ట్రానిక్‌ బరువు తూచే యంత్రాన్ని ఏర్పాటు చేసింది. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అన్నింటా మితం పాటించాలని అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ పిలుపు ఇచ్చారు. ఇదంతా చైనాలో ఆహార కొరతను సూచిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది.

ప్రజల దృష్టిని మరల్చేందుకే ఉద్రిక్తతలు

కరోనా మహమ్మారికి పుట్టిల్లయిన వుహాన్‌ నగరం వెంటనే ఆహార వినియోగంపై ఆంక్షలు విధించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, విందుల్లో ప్రతి పదిమంది అతిథులు తొమ్మిది వంటకాలతో సరిపెట్టుకోవాలని ఆదేశించింది. ఇతర నగరాల్లోని హోటళ్లు బఫె భోజనాల్లో వడ్డనల సైజును తగ్గించాయి. కొన్ని వంటకాలను మెనూల నుంచి తొలగించాయి. ఈనాటి పరిస్థితి- 1960లలో మావో జే డోంగ్‌ హయామునాటి స్థితిగతులను గుర్తుకుతెస్తోంది. పారిశ్రామిక ఉత్పత్తిలో బ్రిటన్‌ ను మించిపోవాలని, చైనాలో ఆహార ధాన్యాలను విరగపండించాలని లక్షించి మావో జేడోంగ్‌ 1958లో గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కింద గ్రామీణులు సమూహాలుగా ఏర్పడి ఆహార ధాన్యాలు పండించి కేంద్ర ధాన్యాగారానికి పంపాలని, ప్రతి చైనీయుడూ తన పెరటిలో ఒక కొలిమిని ఏర్పరచి ఉక్కు తయారు చేయాలని మావో ఆదేశించారు. అప్పట్లో చైనా కమ్యూనిస్టు పార్టీలో తనకు ఎదురవుతున్న వ్యతిరేకతను అణిచివేయడానికే మావో గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌ చేపట్టారని విశ్లేషకులు చెబుతారు. ఈ కార్యక్రమం చైనాలో కరవుకు దారితీసి- అయిదు కోట్ల మంది వరకు చైనీయుల ఆకలి చావులకు కారణమైందని అంచనా.

ఇప్పుడు షీ జిన్‌ పింగ్‌ కూడా అవినీతిపై పోరు పేరిట కమ్యూనిస్టు పార్టీలోని ప్రత్యర్థులపై పరోక్ష పోరు సాగిస్తున్నారు. 1960లలో దేశంలో ఏర్పడిన కరవుకాటకాలు, పారిశ్రామిక విచ్ఛిన్నాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మావో జాతీయవాదాన్ని రెచ్చగొట్టి, భారత్‌పై యుద్ధం ప్రారంభించారు. 1962లో లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా ప్రత్యామ్నాయ మార్గాల నిర్మాణం చేపట్టడం యుద్ధానికి దారితీస్తే, తాజాగా అదే లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద స్థితిగతులను మార్చడానికి జిన్‌ పింగ్‌ ఘర్షణలు రెచ్చగొట్టారు. అసలు గత మే నెలలోనే జిన్‌ పింగ్‌ చైనా సైన్యాన్ని యుద్ధానికి సిద్ధంగా ఉండమని ఆదేశించారు. ఆయన ఎవరితో యుద్ధం చేయదలిచారో వెల్లడించలేదు కానీ, అప్పటికే చైనా దళాలు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖపై అతిక్రమణలకు దిగాయి. 1962లో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని భారత్‌ గ్రహించలేకపోయింది. ఈసారి మాత్రం చైనా దుస్సాహసాన్ని తిప్పికొట్టడానికి సన్నద్ధంగా ఉంది.

ముంచుకొస్తున్న ముప్పు

ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా చైనా దుశ్చర్యలు?

దేశంలో ఇబ్బడిముబ్బడిగా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని బీజింగ్‌ చెప్పుకుంటున్నా, వాస్తవానికి 80శాతం ఆహార అవసరాలను తీర్చే శక్తి మాత్రమే చైనాకు ఉందని బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన ఆర్థికవేత్త హూ షింగ్‌ డౌ ఇటీవల తెలిపారు. ఉద్ధృతంగా వచ్చిపడుతున్న వరదల వల్ల అనేక ప్రాంతాల్లో ఈ ఏడాది పంటలు దెబ్బతిన్నాయి. బియ్యాన్ని భారీఎత్తున పండించే చైనా ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ఆహార దిగుమతిదారు అని మరచిపోకూడదు. వంట నూనెలు, దాణాల కోసం ఏటా 10కోట్ల టన్నుల సోయా బీన్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. కానీ, ఈ ఏడాది బ్రెజిల్‌, కెనడా, రష్యా, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్‌ తమ సొంత నిల్వలను పెంచుకోవడానికి బియ్యం, సోయా, గోధుమల ఎగుమతులను నిలిపేశాయని స్వయంగా చైనా వాణిజ్య శాఖ ప్రకటించింది. చైనాలో మొక్కజొన్న ఉత్పత్తి మూడు కోట్ల టన్నుల మేరకు కోసుకుపోవడంతో ఆ పంట ధరలు పెరిగిపోయాయి. ఇది కోళ్లు, పందుల పెంపకం, పాడి పరిశ్రమలకు ఎంతో నష్టదాయకమైంది. ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ చైనాలో పందుల పెంపకాన్ని దెబ్బతీయడం కూడా ఆహార కొరతకు కారణమవుతోంది. బహుశా ఈ కారణం వల్లనే జిన్‌ పింగ్‌ ఆహార వృథాను అరికట్టాలంటున్నారు.

- వరప్రసాద్‌

ఇదీ చూడండి:సురక్షితమైన వాక్సిన్​కు ఔషధ సంస్థల ప్రతిజ్ఞ

ABOUT THE AUTHOR

...view details