మంచీచెడుల సంగ్రామంలో మంచే నెగ్గుతుందని అందరం నమ్ముతాం. చైనీయుల యిన్ యాంగ్ టావోయిజం మాత్రం మంచీచెడుల సయ్యాటే జీవితమంటోంది. భారతీయ అద్వైతం మంచీచెడు అనే ద్వంద్వాలను అధిగమించాలని ప్రబోధిస్తూ హింస వద్దు- అహింసా పరమోధర్మః అంటుంది. కాగా, చైనీయులు హింస అహింస, యుద్ధమూ శాంతి అనే ద్వంద్వాలతో క్రీడించాలంటారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖపై చైనా చేస్తున్నది ఇదే.
ఎల్‌ఏసీలో సేనల విరమణకు కృషి చేద్దామని అంగీకరించిన కొద్ది రోజులకే- తమ సైన్యాన్ని యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కోరారు. ఏ దేశంతో యుద్ధం రావచ్చునో ఆయన స్పష్టంగా పేర్కొనలేదు కానీ, సరిహద్దుల్లో సయోధ్య చర్చలు జరుపుతూనే యుద్ధానికి పిలుపు ఇవ్వడం చైనా మనస్తత్వానికి మరో నిదర్శనం. అంతకుముందు సెప్టెంబరులో మాస్కోలో భారత్, చైనాలు వెలువరించిన కొత్త పంచశీలపై సంతకాల తడి ఆరకముందే చైనా కొత్త మడత పేచీ పెట్టింది. 1959లో తమ ప్రధాని చౌ ఎన్ లై ప్రతిపాదించిన వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)నే తాము సరిహద్దుగా గుర్తిస్తున్నామనీ, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని భారత్‌లో అంతర్భాగంగా అంగీకరించబోమని చైనా మెలిక పెట్టింది. అక్కడ భారత్ చేపట్టిన రహదారుల నిర్మాణాన్ని నిలిపేయాలని డిమాండ్ చేసింది. రెండు యుద్ధాల మధ్య విరామమే శాంతి అనే సన్ జు సూత్రీకరణ చైనాకే కాదు, భారత్‌కూ తెలుసు. గల్వాన్ ఘర్షణల తరవాత అందివచ్చిన విరామ కాలంలో చైనాలానే భారత్ కూడా అదనపు సేనలను, విమానాలు, ట్యాంకులను ఎల్‌ఏసీ వద్ద మోహరిస్తోంది. చైనా సూచించిన 1959నాటి సరిహద్దు రేఖను అవతల పెట్టి 1993-2005 మధ్య వివిధ ఒప్పందాల్లో ఉభయులూ అంగీకరించిన ఎల్‌ఏసీనే గౌరవించాలని డిమాండ్ చేసింది. ఇక్కడ 1959నాటి ప్రకటన పూర్వాపరాలను పరిశీలించాలి.
మొదటి నుంచీ మోసమే!
బ్రిటిష్ వలస ప్రభుత్వ హయాములో 1914లో కుదిరిన సిమ్లా ఒప్పందం భారత్, టిబెట్‌ల మధ్య సరిహద్దుగా మెక్‌మహాన్ రేఖను గుర్తించింది. లద్దాఖ్‌నుంచి నేపాల్ వరకు ఈ రేఖే తమ సరిహద్దు అని 1950లో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు. 1914లో కానీ, 1950లో కానీ మెక్‌మహాన్ రేఖ గురించి కిమ్మనని చైనా 1959లో కొత్త రాగం ఎత్తుకుంది. ఆ సంవత్సరం జనవరిలో కమ్యూనిస్టు చైనా ప్రధాని చౌ ఎన్ లై భారత ప్రధాని నెహ్రూకు రాసిన లేఖలో మొట్టమొదటిసారిగా మెక్‌మహాన్ రేఖపై అభ్యంతరం లేవనెత్తారు. భారత్, చైనా సేనలు తూర్పు సెక్టార్‌లో 'చట్టవిరుద్ధ' మెక్‌మహాన్ రేఖ నుంచి 20 కి.మీ., పశ్చిమ సెక్టార్ (లద్దాఖ్)లో వాస్తవాధీన రేఖ నుంచి 20 కి.మీ. వెనక్కు తగ్గాలని చౌ ఎన్ లై ఆ లేఖలో సూచించారు. చైనా వాదనను నెహ్రూ అంగీకరించలేదు. 1950-59 మధ్యకాలంలో టిబెట్‌లో తిరుగుబాటు జరిగి దలైలామా భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందారు. ఇది చైనాకు గిట్టలేదు.'హిందీ చీనీ భాయి భాయి' అని స్నేహ మంత్రం జపిస్తూనే 1962లో దురాక్రమణకు దిగింది. స్నేహం అంటూనే వైరం- ఇదే చైనా యిన్‌యాంగ్ తంత్రం!