సరిహద్దుల్లో తరచూ ఘర్షణలకు దిగడం ద్వారా కంటిమీద కునుకు లేకుండా చేసి, భారత్‌ను అస్థిర పరచాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అధికార దాహంతో తపించిపోతున్న డ్రాగన్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సైనిక రంగాల్లో దుందుడుగ్గా ప్రవర్తిస్తోంది. లద్దాఖ్ సెక్టార్‌లో భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి గొడవపడే విషయంలో చైనాకు కరోనా మహమ్మారి సమస్యా అడ్డంకి కావడం లేదు. చైనా సకాలంలో స్పందించి, విదేశాలకు వెళ్లే విమానాలను గత ఏడాది డిసెంబరు నుంచే నిలిపివేసి ఉంటే, ప్రాణాంతక వైరస్ కార్చిచ్చులా వ్యాపించి ఉండేది కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజారోగ్య వ్యవస్థలు విఫలమయ్యేవీ కావు.
దుందుడుకు దౌత్య వ్యూహం
చైనా ఎందుకు భారత్‌ను అస్థిర పరచాలనుకుంటోందనేది పెద్ద ప్రశ్నే. ఎందుకంటే, ఈసారి భారత్ తన ఆర్థిక, రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించాలని నిర్ణయించుకుంది. ఇటీవల ప్రకటించిన కొత్త విధాన నిర్ణయాల ప్రకారం భారత్ విదేశీ కాలుదువ్వుతున్న చైనా మూలధనాన్ని ఆకర్షించడంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. చైనా నుంచి బయటికి వెళ్లాలని భావిస్తున్న సంస్థల్ని తీసుకురావాలని భావిస్తోంది. అమెరికా కంపెనీలన్నీ చైనాను వీడాలని ఆ దేశధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో- ప్రపంచ సరఫరా గొలుసు వ్యవస్థలన్నింటికీ భారీ హబ్‌లా అవతరించే అవకాశాలపై భారత్ ఆశలు పెట్టుకుంది. అయితే భారత్, చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులు మాత్రం పెట్టుబడిదారుల మెదళ్లలో అపనమ్మకాన్ని సృష్టిస్తున్నాయి. ఇలా భారత్‌ను అస్థిర పరచడం ద్వారా తన విలువైన శక్తిని, వనరుల్ని సరిహద్దుల రక్షణకే వెచ్చించేలా ఒత్తిడి పెంచాలనే వ్యూహాన్ని చైనా అమలు చేస్తోంది. తన ఆర్థిక, సైనిక శక్తిని ఉపయోగిస్తూ ప్రతి ఒక్కరూ తలొగ్గి ఉండేలా చైనా దుందుడుకు దౌత్య వ్యూహాన్ని పాటిస్తోంది.
దేశాలకు బెదిరింపులు
కరోనా వైరస్ పుట్టుక, చైనా వ్యవహారం వంటి అంశాలపై దర్యాప్తు చేపట్టాలని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ఇటీవల పిలుపిచ్చారు. కాన్‌బెరాలోని చైనా రాయబారి వెంటనే స్పందిస్తూ, ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటామని బహిరంగంగానే హెచ్చరికలు చేశారు. అంతకుముందు, వివాదాస్పద హావేయ్ 5జీ ఉపకరణాల్ని భద్రతపరమైన కారణాలతో నిషేధించాలని జర్మనీ భావించగా, ఆ దేశ కార్ల దిగుమతుల్ని నిలిపివేస్తామంటూ అక్కడి చైనా రాయబారి హెచ్చరించారు. ఆ 5జీ ఉపకరణాల్ని అమెరికా అంతకుముందే నిషేధించి, ఇతర దేశాలూ అదేబాటలో నడవాలంటూ ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. చైనాలో మానవ హక్కుల్ని హరిస్తున్నారంటూ స్వీడన్ ఆందోళన వ్యక్తం చేయగా, చైనా రాయబారి స్పందిస్తూ, శత్రువుల కోసం తమవద్ద షాట్‌గన్స్ ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ద్వీపాల విషయంలో పలు దేశాలతో డ్రాగన్ ప్రవర్తన తీరు ప్రపంచానికంతా తెలిసిన సంగతే.