సోవియట్ యూనియన్ పతనం తరవాత అమెరికా- ప్రపంచంలో తిరుగులేని అగ్రరాజ్యంగా అవతరించింది. ఆ విజయ గర్వంతో సోవియట్ వారసురాలు రష్యాను మరింత బలహీనపరచడానికి చేయవలసినదంతా చేస్తూ వచ్చింది. జార్జియా, ఉక్రెయిన్, క్రిమియాలను తమకు శాశ్వతంగా దూరం చేయడానికి వాషింగ్టన్ పన్నాగాలు పన్నిందని ఆగ్రహించిన మాస్కో అక్కడ సైనిక చర్యలకు దిగింది. దీంతో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. ప్రధానంగా చమురు ఎగుమతులపై ఆధారపడిన రష్యన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి వాషింగ్టన్ సౌదీ అరేబియాతో కలిసి చమురు ధరలు పడగొట్టిందని రష్యన్లు ఆగ్రహించారు. ఇది చాలదన్నట్లు జర్మనీ తదితర ఐరోపా దేశాలకూ రష్యా సహజవాయు ఎగుమతులు నిలిచిపోయాయి. ఆదాయం కోసుకుపోయిన పరిస్థితిలో తన సహజ వాయువును చైనాకు ఎగుమతి చేయడానికి మాస్కో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. తాను ఎగుమతి చేస్తున్న ఆయుధాలను చైనా కాపీ కొడుతోందని తెలిసినా ఏమీ చేయలేని అశక్తతలోకి జారిపోయింది. అక్కడికి అమెరికా నాయకత్వంలోని ఐరోపా దేశాల కూటమికి చేరువ కావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదట్లో గట్టిగానే ప్రయత్నించారు.
సంపన్న దేశాల కూటమి అయిన జి-7లో రష్యాకూ సభ్యత్వం లభించడంతో అది జి-8గా మారింది. కానీ.. రష్యా సైన్యం క్రిమియాను ఆక్రమించినప్పటి నుంచి అమెరికా కూటమి రష్యాను దూరం పెట్టడంతో జి-8 మళ్లీ జి-7గా మిగిలింది. 2014లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో సంభవించిన పరిణామమిది. డొనాల్డ్ ట్రంప్ చైనాపై కారాలు మిరియాలు నూరి రష్యాను అక్కున చేర్చుకోవాలని చూసినా, ఆయన హయాములో అది సాధ్యపడలేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ రష్యాతో సయోధ్యకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చైనాపై ఆయన చేపట్టిన ముప్పేట వ్యూహంలో అంతర్భాగమే ఈ సమావేశం.
ముప్పు ఉందంటూనే..
చైనా వల్ల తమ భద్రతకు ముప్పు ఉందంటూనే నాటో దేశాలు తమ రేవుల్లో, టెలికమ్యూనికేషన్ సౌకర్యాల నిర్మాణంలో భారీ పెట్టుబడులను స్వీకరించాయి. అదే సమయంలో ఐరోపాలో బాల్టిక్ దేశాల నుంచి ఆఫ్రికా వరకు చైనా సైనికంగా పట్టు పెంచుకోవడాన్ని గమనిస్తున్నాయి. 2020లో చైనా-జర్మనీల మధ్య 25,700 కోట్ల డాలర్ల వ్యాపారం జరగ్గా అమెరికా-చైనాల మధ్య 55,900 కోట్ల డాలర్ల వ్యాపారం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చైనా విషయంలో అతిగా స్పందించకూడదని, ఆచితూచి వ్యవహరించాలని జర్మనీ భావిస్తోంది. ఫ్రాన్స్ భావన కూడా అదే. చైనాతో కొత్త ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభించాలనుకోవడం లేదని బ్రిటన్ వివరించింది. తైవాన్, హాంకాంగ్‌ల విషయంలో చైనా విధానాలను, షింజియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను నాటో దేశాలు ఖండించాయి. ఆర్థికంగా, సైనికంగా అగ్రరాజ్యంగా ఎదగడానికి చైనా ప్రదర్శిస్తున్న దూకుడు నియమబద్ధ అంతర్జాతీయ వ్యవస్థకు, కొన్ని అంశాల్లో తమ భద్రతకు సవాలుగా పరిణమిస్తోందని నాటో పేర్కొంది.
ఇదీ చదవండి:డ్రాగన్ దూకుడుకు అమెరికా ముకుతాడు
అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లతోపాటు మొత్తం 30 ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలు నాటో సభ్యులుగా ఉన్నాయి. నాటో దేశాల మధ్య చీలికలు తీసుకురావడానికి చైనా, రష్యాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్న అమెరికా- తన వంతుగా చైనా, రష్యాల మధ్య దూరం పెంచేందుకు ప్రయత్నిస్తోంది. బైడెన్-పుతిన్ సమావేశాన్ని ఈ కోణం నుంచి చూడాలి. ఆర్థికంగా చైనా గుప్పిట్లో నలిగిపోతున్న రష్యా ప్రధాన రాజ్యంగా తన హోదాను నిలబెట్టుకోవాలని చూస్తోందని బైడెన్ పేర్కొనగా, చైనా తీవ్రంగా స్పందించింది. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి అమెరికా ఆంక్షలు విధించి, సైనికంగా చక్రబంధంలో ఇరికించిందని ఆరోపించింది. అమెరికా, నాటోలు 2014లో జి-8 నుంచి రష్యాను సస్పెండ్ చేసినప్పుడు చైనా.. మాస్కోతో సహజవాయువుపై ఒప్పందం కుదుర్చుకుని ఆదుకుంది. తాజాగా బైడెన్ నార్డ్ స్ట్రీమ్-2 ప్రాజెక్టుపై ఆంక్షలు ఎత్తివేసి పుతిన్‌కు సౌహార్ద సందేశం పంపారు.
భారత్.. ఆచితూచి అడుగులు!