చైనా నిఘంటువులో సౌహార్దానికి అర్థం యుద్ధమా? ఏడేళ్ల క్రితం చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే భారత్‌తో సంబంధాల బలోపేతానికి షిజిన్‌పింగ్ ప్రస్తావించిన 'నయా పంచశీల' పరమార్థం- బలాధిక్య ప్రదర్శనతో సరిహద్దుల్ని మార్చడమా? అని ఆలోచనాపరుల్ని కలచివేస్తున్న ప్రశ్నలివి. ఏ అంశం మీదనైనా వైరుధ్యాలు వివాదాలుగా మారకుండా జాగ్రత్తగా కాచుకోవాలన్న ఆదర్శం అధినేతల ఇష్టాగోష్ఠుల్లో ప్రతిధ్వనించగా... దానికి తూట్లుపొడిచేలా తాజాగా లద్దాఖ్ సరిహద్దులు నెత్తురోడాయి. వాస్తవాధీన రేఖ దాటివచ్చిన చైనా బలగాలు, వారిని నిలువరించడానికి మోహరించిన ఇండియా సైనికుల నడుమ ఆరు వారాలుగా కొనసాగిన ఉద్రిక్తభరిత ప్రతిష్టంభన క్రమేణా సద్దుమణుగుతోందనుకొంటున్న దశలో రేగిన ఘర్షణలో 20మంది భారత వీరజవాన్లు అమరులయ్యారు. నాలుగున్నర దశాబ్దాల తరవాత చైనాతో సరిహద్దులు ఇలా భగ్గుమనడానికి బీజింగ్ దుందుడుకుతనమే కారణమనడంలో సందేహం లేదు.
ఆ వ్యూహంతోనే..
తాను గుప్పిట పట్టిన టిబెట్ అరచేయి అయితే దానికి భూటాన్, లద్దాఖ్, నేపాల్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ అయిదు వేళ్లని చైనా భావిస్తుంటుంది. భూటాన్‌ను భారత్ నుంచి దూరంచేసి క్రమంగా కబళించే ఎత్తుగడలు ఫలించకపోవడం వల్ల 2017లో డోక్‌లామ్ పరగణాలో పాగావేసి యుద్ధ విన్యాసాలతో పది వారాలకు పైగా ఉద్రిక్తతలు పెంచిన చైనా చేసేదిలేక వెనక్కి తగ్గింది. అంతిమ పరిష్కారం లభించేంత వరకు వాస్తవాధీన రేఖను రెండు దేశాలూ కచ్చితంగా గౌరవించాలన్న 1993నాటి ఒప్పందాన్ని కాలదన్ని కీలకమైన పాంగాంగ్ సరస్సు ప్రాంతం, దెమ్‌చోక్, గాల్వాన్ లోయ, దౌలత్‌బేగ్ ఓల్డీలను కబళించాలన్నది డ్రాగన్ వ్యూహం. చైనాకు దీటుగా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మోదీ సర్కారు ప్రకటించడం వంటివి కంటగింపుగా మారి చైనా దొంగదెబ్బ తీస్తోందన్నది వాస్తవం. రెచ్చగొడితే తగువిధంగా బదులిస్తామన్న ప్రధాని మోదీ హెచ్చరికను చైనా ఏ మేరకు చెవిన పెడుతుందో చూడాలి!
గ్లోబల్ టైమ్స్ ఏమంటుంది!