దక్షిణ చైనా సముద్రంలో దుందుడుకు చర్యలతో పొరుగునున్న చిన్న దేశాలపై డ్రాగన్ ఇప్పటికే ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇటీవల తన దూకుడును, కుటిల దౌత్య నీతిని సుదూర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. ఈ క్రమంలో చైనా తనకు దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సాలమన్ దీవులతో గత నెలలో రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకొంది. తద్వారా అమెరికా, ఆస్ట్రేలియాలకు సరికొత్త సవాలు విసిరింది. ఈ ఒప్పందంపై అగ్రరాజ్యం తీవ్రంగా మండిపడుతుండగా, చైనా ఉద్దేశపూర్వకంగా తన ప్రయోజనాలను దెబ్బతీసేందుకే పొరుగు దేశాన్ని మచ్చిక చేసుకుంటోందని ఆస్ట్రేలియా భయపడుతోంది. సాలమన్ దీవుల్లో సాయుధ తిరుగుబాటుదారులపై పోరులో అక్కడి ప్రభుత్వానికి ఆస్ట్రేలియా ఎప్పటినుంచో సహాయం అందిస్తోంది. తాజా ఒప్పందంతో ఆ బాధ్యతను ఒడిసిపట్టి స్వప్రయోజనాలను సాధించే అవకాశం చైనాకు దక్కింది. పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని ఢీకొట్టేందుకు ఒక వేదికా దొరికినట్లయింది.
ఆస్ట్రేలియాపై దృష్టి:సాలమన్ దీవుల్లోని ప్రజల భద్రత, ప్రకృతి విపత్తుల సమయంలో పరస్పర మానవీయ సాయంపై ఒప్పందం కుదిరినట్లు చైనా వెల్లడించింది. ఆ దీవులు స్వీయరక్షణ సామర్థ్యం పెంచుకొనేలా సహకరిస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ఒప్పందం పేరిట సాలమన్ దీవుల్లో చైనా తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తే, ఇప్పటిదాకా దక్షిణ చైనా సముద్రంలోనే నెలకొన్న సైనిక ఆధిపత్య జగడం పసిఫిక్ మహాసముద్రానికీ విస్తరిస్తుంది. తాజా ఒప్పందంలో భాగంగా చైనా తన యుద్ధ నౌకలను సాలమన్ దీవులకు పంపే వీలుంది. చైనాతో కుదుర్చుకున్న ఒప్పందంలో సైనిక స్థావరం ఏర్పాటు అంశం లేదని సాలమన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ ఒప్పందాన్ని అమెరికా మిత్రదేశాలైన న్యూజిలాండ్, జపాన్ సైతం ఖండించాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణను నిలువరించేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌లతో ఏర్పాటైన 'క్వాడ్' కూటమిని సవాలు చేయడమే చైనా ప్రస్తుత లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో క్వాడ్ దేశాల ప్రయోజనాలను భంగపరచే ఏ చిన్న అవకాశాన్నీ డ్రాగన్ వదులుకోవడం లేదు. ఇప్పటికే భారత్‌కు అన్నివైపులా తన నిఘా వ్యవస్థను చైనా ఏర్పాటు చేసుకుంటోంది. హిందూ మహాసముద్రంలో తన నౌకల రక్షణ పేరిట ఆఫ్రికాలోని జిబూటీలో ప్రజా విమోచన సైన్యం స్థావరాన్ని నిర్వహిస్తోంది. మయన్మార్‌లోని గ్రేట్ కోకో దీవుల్లో నౌకా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పుడు డ్రాగన్ దృష్టి ఆస్ట్రేలియాపై పడింది. టోక్యోలో ఈనెల 24న క్వాడ్ దేశాధినేతల సమావేశం జరగనుంది. అంతకుముందే 21న ఆస్ట్రేలియాలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. సాలమన్ దీవుల అంశమూ ఈ ఎన్నికల్లో ప్రచారాంశంగా మారింది. చైనా సైనిక స్థావరం ఏర్పాటుకు సాలమన్ ఐలాండ్స్ అనుమతిస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ హెచ్చరిస్తున్నారు. మరో దేశ అంతర్గత వ్యవహారాలను నిర్దేశించే అధికారం ఆస్ట్రేలియాకు లేదని డ్రాగన్ సైతం వాదిస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ నెలాఖరులో సాలమన్ దీవుల పర్యటనకు వెళ్తున్నారన్న కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో క్వాడ్ సమావేశంలో చైనా-సాలమన్ దీవుల ఒప్పందాన్ని ఖండించేలా ఆస్ట్రేలియా ఒత్తిడి చేయవచ్చు.