ప్రపంచీకరణ అమెరికాను తీవ్రంగా నష్టపరచిందనే ఆగ్రహారోపణతో డొనాల్డ్ ట్రంప్ 2016 ఎన్నికల్లో గద్దెనెక్కారు. అమెరికా కంపెనీలు ప్రపంచీకరణ పేరిట తమ ఉత్పత్తి యూనిట్లను చైనాకు తరలించేయడంతో అమెరికాలో భారీగా ఉద్యోగ నష్టం సంభవించిందనీ, చైనానుంచి వచ్చిపడుతున్న కారు చవక వస్తువులు అమెరికన్ పరిశ్రమలను తిరిగి లేవకుండా దెబ్బకొట్టాయంటూ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇంతలో కొవిడ్ విరుచుకుపడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఇంతటి సంక్షోభంలోనూ చైనా ఆర్థికాభివృద్ధి నమోదు చేయడం చూసి, ప్రపంచీకరణవల్ల చైనా మాత్రమే లబ్ధి పొంది, ఇతర దేశాలు నష్టపోయాయనే భావన బలపడింది. ఇలాంటి భయాలు, సంకోచాలను అధిగమించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే తాజాగా కుదిరిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం(ఆర్సెప్). దీనిపై ఆగ్నేయాసియా దేశాల సంఘాని(ఆసియాన్)కి చెందిన 10 సభ్యదేశాలతోపాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంతకాలు చేశాయి.
అందుకే భారత్ దూరం..
భారత్ కూడా ఒప్పందంలో చేరవలసింది కానీ- దానివల్ల చైనా, ఆస్ట్రేలియా తదితర ఆర్సెప్ దేశాలనుంచి చౌక దిగుమతులు వచ్చిపడి స్వదేశీ పరిశ్రమలు, వ్యవసాయం, పాడి పరిశ్రమ దెబ్బతింటాయనే ఆందోళనతో ఆర్సెప్‌కు దూరం జరిగింది. ఆర్సెప్ ఒప్పందం కుదిరిన మరునాడే భారతదేశం ఎటువంటి వాణిజ్య ఒప్పందాల్లోనూ చేరబోదని విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ తెగేసి చెప్పారు. ప్రపంచీకరణ పేరుతో గతంలో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలవల్ల భారత్‌లో కొన్ని రంగాల్లో పరిశ్రమలు అంతరించిపోయాయని గుర్తుచేశారు. చైనా కంపెనీలు ప్రపంచమంతటా వ్యాపారం చేస్తున్నా విదేశీ కంపెనీల ప్రవేశానికి మాత్రం ఆ దేశం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుందని జైశంకర్ గతంలోనూ విమర్శించారు. అమెరికా ఆగ్రహమూ ఇదే.
తలుపులు తెరుస్తున్న 'డ్రాగన్'!
ఇలాంటి అనుమానాలను తొలగించడానికి రానున్న పదేళ్లలో విదేశాల నుంచి 22లక్షల కోట్ల డాలర్ల వస్తుసేవలను దిగుమతి చేసుకుంటామని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఇటీవల ప్రకటించారు. అదేపనిగా ఎగుమతులు చేస్తూ లక్షల కోట్ల డాలర్ల వాణిజ్య మిగులును కూడబెట్టుకున్న చైనా ఇక నుంచి ఎగుమతులు, దిగుమతుల మధ్య సమతుల్యత సాధించడానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అయితే, ఇది కూడా చైనా ఆర్థిక ఆధిపత్యానికి దోహదపడవచ్ఛు దిగుమతులు ఇనుమడించే కొద్దీ అంతర్జాతీయ లావాదేవీలలో చైనా కరెన్సీ యువాన్ వాడకం పెరుగుతుంది. అది క్రమంగా అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా పరిణామం చెంది, డాలర్‌కు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. హానికరమైన వాణిజ్య విధానాలను అనుసరించడంతోపాటు కరోనా మహమ్మారి గురించి ముందుగా హెచ్చరించకుండా దాచిందనే ఆగ్రహంతో బహుళజాతి సంస్థలు తమ సరఫరా గొలుసులను చైనా నుంచి తరలిస్తున్నాయి.
చైనాయే ప్రపంచ ఆర్థిక ఇంజిన్‌గా..
ఈ తరలింపు ఒక క్రమ పద్ధతిలో జరిగేట్లు చూడటానికి ఆర్సెప్ తోడ్పడుతుంది. నేడు చైనాలో ఉత్పత్తి అయ్యే అనేక సరకులు రేపు వియత్నాం వంటి ఆర్సెప్ దేశాల్లో తయారై, అక్కడి నుంచి అమెరికా, భారత్‌లకు ఎగుమతి కావచ్చు. ఇది చివరకు చైనాకు లాభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నాణేనికి రెండో వైపు చూస్తే, ప్రపంచ జీడీపీలో మూడో వంతు(26.2 లక్షల కోట్ల డాలర్లను) ఉత్పత్తికి కారణమైన దేశాలతో ఏర్పాటైన ఆర్సెప్, కరోనాతో కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడానికి తోడ్పడే మాట నిజం. 2008 ఆర్థిక సంక్షోభం తరవాత చైనాయే ప్రపంచానికి ఆర్థిక ఇంజిన్‌గా పనిచేసింది. ఈసారి 220 కోట్ల జనాభా గల ఆర్సెప్ దేశాలు ఆ పాత్ర పోషించవచ్చు. ఆర్సెప్ భాగస్వామ్య దేశాలు పరస్పరం వాణిజ్య సుంకాలను భారీగా తగ్గించుకోవడం, సరఫరా గొలుసులను సమతుల్యంగా పంచుకోవడం, ఇ-కామర్స్ నిబంధనల చట్రాన్ని రూపొందించుకోవడం ద్వారా ఉమ్మడిగా లబ్ధిపొందుతాయి.
ట్రంప్ రాకతో..