విస్తరణవాదాన్ని ఒంటబట్టించుకున్న చైనా తన ప్రాదేశిక భూభాగాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతోంది. భారత్‌తోనే కాక సరిహద్దు దేశాలన్నింటితో కయ్యానికి సై అంటోంది. తనది కాని భూభాగాన్ని దక్కించుకునేందుకు అనేక వ్యూహాలు రచిస్తోంది. తను లక్ష్యంగా చేసుకున్న దేశాల అవకాశాలను పరిమితం చేసి కోలుకోలేకుండా చేస్తోంది. ప్రతిఘటించే అవకాశం లేకుండా సంకుచిత ప్రణాళికలు అమలు చేస్తోంది. కవ్వించి పక్కకు తప్పుకునే వైఖరి అవలంబిస్తోంది. సైన్యంపై ఆధారపడి ప్రాంతాలను కబ్జా చేస్తోంది.
ఇదీ చదవండి:చైనా వెన్నుపోటు- నేపాల్ భూభాగం దురాక్రమణ
ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి, బెదిరించి భూభాగాలను లాక్కోవడానికి, పొత్తులను విభజించడానికి క్రమక్రమంగా వ్యూహాలు అమలు చేస్తోంది చైనా. ఈ విధాన్నే సైనిక పరిభాషలో 'సలామీ స్లైసింగ్'గా వ్యవహరిస్తున్నారు.
సలామీ స్లైసింగ్!
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పొరుగుదేశాలను కవ్విస్తూ ప్రాదేశిక భూభాగాన్ని విస్తరించుకుంటున్న ఏకైక దేశం చైనా. భూభాగంతో పాటు సముద్ర జలాల్లోనూ దురాక్రమణ సాగిస్తోంది. టిబెట్‌ను స్వాధీనం చేసుకోవడం, అక్సాయ్‌చిన్‌ను ఆక్రమించుకోవడం, పారాసెల్ దీవులను కలుపుకోవడం వంటివి చైనా విస్తరణవాద విధానానికి కొన్ని ఉదాహరణలు.
పక్కా ప్రణాళికతో
పొరుగుదేశాల భూభాగాన్ని ఆక్రమించడానికి చైనా ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తుంది.
- ఆక్రమించాలనుకున్న భూభాగంపై హక్కు తమకే ఉందని తొలుత ఓ బూటకపు ప్రకటన చేస్తుంది.
- అవకాశం దొరికిన ప్రతీసారి అదే విషయాన్ని మళ్లీమళ్లీ ఉద్ఘాటిస్తుంది.
- పొరుగుదేశాల వాదనను వివాదంగా మారుస్తుంది.
- తర్వాత అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఆ ప్రాంతాన్ని వివాదాస్పద స్థలంగా మార్చుతుంది.
- వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సైనిక, దౌత్యపరమైన శక్తిని ప్రదర్శిస్తుంది.
ఇలాంటి వ్యూహాన్ని అనుసరించి భూభాగాన్ని పెంచుకునే విధానాన్నే 'సలామీ స్లైసింగ్' అని చెబుతారు.
ఇదీ చదవండి:దేశం ఏదైనా... దౌర్జన్యమే డ్రాగన్ విధానం
ఈ వ్యూహాన్ని 1940లో హంగేరియన్ కమ్యూనిస్ట్ రాజకీయ నేత మాటియస్ రాకోసి రూపొందించారు. కమ్యూనిస్టేతర పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి 'సలామీని ముక్కలు చేయడం' అనే ప్రణాళిక రచించారు. సైనిక పరిభాషలో దీన్ని 'క్యాబేజ్ స్ట్రాటజీ' అని కూడా పిలుస్తారు.
ఎప్పట్నుంచో మొదలు
1948లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) కుమింటాంగ్ పాలనకు ముగింపు పలికిన సమయంలో.. టిబెట్ స్వతంత్ర దేశంగా ఉంది. కొంతమంది బౌద్ధ సన్యాసులు కలిసి టిబెట్‌ను పరిపాలించేవారు.
ఆ సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టిబెట్‌పై దండెత్తి సైనిక చర్య ద్వారా మొత్తం రాజ్యాన్ని తన అధీనంలోకి తీసుకుంది. ప్రాచీన కాలం నుంచి టిబెట్ చైనాలో అంతర్భాగం అని పేర్కొంది. టిబెట్‌తో పాటు లద్దాఖ్‌కు తూర్పున ఉన్న షింజియాంగ్నూ స్వాధీనం చేసుకుంది. ఈ రెండు భాగాలు కలవడం వల్ల చైనా భూభాగం రెట్టింపైంది.
ఈ సలామీ స్లైసింగ్ వ్యూహం అమలు చేసిన తర్వాత 1954-62 మధ్య దశలవారీగా అక్సాయ్‌చిన్‌ను తన హస్తగతం చేసుకుంది. స్విట్జర్లాండ్ పరిమాణమంత ఉండే ఈ పీఠభూమి నిజానికి జమ్ము కశ్మీర్ సంస్థానంలో భాగం.
భారత్‌లో ఇంకా ఎక్కడెక్కడ?
అక్సాయ్చిన్తో పాటు భారత్‌లోని మరికొన్ని ప్రాంతాలపైనా చైనా కన్నేసింది. ఏకంగా 90 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని చైనాలో అంతర్భాగమని వాదిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌కు చెందిన భూభాగంగా పరిగణిస్తోంది.
- జమ్ము కశ్మీర్‌లోని కారకోరం శ్రేణికి ఉత్తరాన ఉన్న 6 వేల చదరపు కి.మీ ప్రాంతాన్ని పాకిస్థాన్ నుంచి స్వాధీనం చేసుకుంది.
- ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్లో అక్కడక్కడా ఉన్న చిన్న ప్రదేశాలపై ఆధిపత్యం తమదేనని చెప్పుకుంటోంది.
- మొత్తం గల్వాన్ లోయపై ప్రాదేశిక హక్కు చైనాదేనని తాజాగా ప్రకటించుకుంది.