చైనా బరితెగించి ఇరుగుపొరుగుపై వరుణాస్త్ర ప్రయోగానికి ఒడిగడుతోంది. ఇప్పటికే భారీ నీటిపారుదల ప్రాజెక్టులతో ఆగ్నేయాసియా దేశాలకు నీటి కరవు తెచ్చిపెడుతున్న బీజింగ్ దుష్టనేత్రం తాజాగా భారత్‌పై పడింది. బ్రహ్మపుత్ర నదిపై చైనా చేపట్టనున్న బృహత్తర జల విద్యుత్తు ప్రాజెక్టు భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌కూ శాపంగా మారనున్నది. చైనా ఆనకట్ట తలపెట్టే నష్టాన్ని అధిగమించేందుకు భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్రహ్మపుత్రపై తానూ బహుళార్థక సాధక జలాశయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించింది.
టిబెట్‌లో ఉద్భవించే బ్రహ్మపుత్ర భారత్‌లో అరుణాచల్, అసోంల ద్వారా ప్రవహించి బంగ్లాదేశ్ చేరుతుంది. భారత్‌కు నష్టం కలగని రీతిలో ప్రాజెక్టులు కట్టుకోవలసిందిగా చైనాకు దిల్లీ సూచించగా బీజింగ్ సరేనంది. కానీ చైనా మాటలు నీటి మూటలేనని ఎప్పటికప్పుడు తేలిపోతోంది. లద్దాఖ్‌లో గల్వాన్ నదిపై చైనా సైన్యం అడ్డుకట్ట నిర్మించి ఘర్షణ పడిన సమయంలో అకస్మాత్తుగా నీటిని విడుదల చేసి భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉదంతమే దీనికి సాక్ష్యం. నదులపై కట్టే జలవిద్యుత్తు, నీటి పారుదల ప్రాజెక్టులు, కాలువలను రాజకీయ ఒత్తిడి అస్త్రంగా, యుద్ధాల్లో ప్రత్యర్థిపై ప్రయోగించే ఆయుధంగా ఉపయోగించాలన్నది చైనా పన్నాగం. భారత్, బంగ్లా, ఆగ్నేయాసియా దేశాలకు మాటమాత్రం చెప్పకుండా టిబెట్ నదులపై ఏకంగా 11 ఆనకట్టలు, మెకాంగ్ నదిపై ఎనిమిది ఆనకట్టలు నిర్మించి, మరో మూడింటి నిర్మాణానికి సన్నాహాలు చేయడం చైనా దుష్టబుద్ధికి నిదర్శనం. ఇప్పుడు భారత సరిహద్దుకు కేవలం 30 కి.మీ. దూరంలో భారీ ప్రాజెక్టు నిర్మిస్తానంటోంది. ఈ ఏడాది మొదట్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్-బల్టిస్థాన్‌లో సింధు నదిపై దియామెర్-బాషా ఆనకట్ట నిర్మాణం ప్రారంభించింది. ఇదే ప్రాంతంలోని బుంజి వద్ద సింధుపై మరో ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది.
చైనా వరుణాస్త్రం
టిబెట్ పీఠభూమిలో ఇంతవరకు 55 జలాశయాలను నిర్మించిన చైనా తన జల జగడాలను ఇకపైనా కొనసాగించనున్నది. బ్రహ్మపుత్రపై ప్రాజెక్టులు భారత్, బంగ్లాదేశ్‌లకు నష్టం కలిగిస్తే, మెకాంగ్ ప్రాజెక్టులు మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కాంబోడియా, వియత్నాంలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. తన అవసరాలను తీర్చుకోవడానికి పొరుగు దేశాల నోట మట్టి కొట్టడం చైనా విధానంగా మారింది. ఇప్పటికే చైనాలో అత్యధిక రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. తాగునీరు, సాగునీటికే కాకుండా పరిశ్రమలకూ నీటి అవసరాలు పెరిగిపోతున్నాయి. నీరు, విద్యుత్తు గిరాకీని తీర్చడానికి యార్లంగ్ జాంగ్బో నదిపై (బ్రహ్మపుత్ర నదికి టిబెటన్ పేరు) బృహత్తర ప్రాజెక్టు నిర్మించాలని చైనా నిశ్చయించిందని అక్కడి సమాచార సాధనాలు తెలిపాయి. భారత్‌కూ నీటి అవసరాలు పెరుగుతున్నాయి. ప్రపంచ జనాభాలో మూడోవంతుకు పైగా చైనా, భారత్‌లలో నివసిస్తున్నా ప్రపంచ నీటి వనరుల్లో చైనా వాటా ఏడు శాతమైతే, భారత్ వాటా కేవలం నాలుగు శాతం. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో, టిబెట్‌లో సింధు, బ్రహ్మపుత్ర నదులపై నిర్మించిన ప్రాజెక్టులు ఎండా కాలంలో భారత్‌కు నీరు రాకుండా అడ్డుకోగలవు. వర్షాకాలంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే అపార జలరాశి అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లను ముంచెత్తుతుంది. దీన్ని నివారించడానికి చైనా ఏటా జూన్-అక్టోబరు మధ్య కాలంలో నీటి విడుదలకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని అందిస్తానని భారత్‌కు మాట ఇచ్చినా, 2017 డోక్లాం ఘర్షణల తరవాత సమాచార మార్పిడిని ఆపేసింది. 2018లో మళ్లీ సమాచారం ఇవ్వనారంభించినా, భవిష్యత్తులో వరుణాస్త్రాన్ని ప్రయోగించదనే భరోసా లేదు. అందుకే బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని తట్టుకోవడానికి అరుణాచల్‌లో 10,000 మెగావాట్ల భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టును నిర్మించాలని భారత్ తలపెట్టింది.
ఆనకట్టల నిర్మాణం
టిబెట్‌ను ఆక్రమించినప్పటి నుంచి తనకు సంక్రమించిన జలాధిపత్యాన్ని చైనా దుర్వినియోగం చేస్తోంది. ఉత్తర చైనాలోని నీటి ఎద్దడి ప్రాంతాలకు టిబెటన్ నదుల ప్రవాహాన్ని మళ్లించడానికి భారీ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. బ్రహ్మపుత్ర నీటిని వెయ్యి కి.మీ. సొరంగం ద్వారా షింజియాంగ్ రాష్ట్రానికి తరలించాలని యోచిస్తోంది. 2016నాటికే నదులపై 87,000 ఆనకట్టలు నిర్మించినట్లు అంచనా. బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకొని సౌర, జల విద్యుత్తుల మీద అధికంగా ఆధారపడాలని బీజింగ్ ఆశిస్తున్నందున ఆనకట్టల నిర్మాణం మరింత జోరందుకోనున్నది. దీనంతటికీ పొరుగు దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. గతేడాది మెకాంగ్ నదిలో నీటి ప్రవాహం హరించుకుపోయినప్పుడు, వర్షాభావమే కారణమని చైనా బుకాయించింది. కానీ, ఆ సమయంలో చైనాలో మెకాంగ్‌పై నిర్మించిన జలాశయాలు నీటితో నిండుగా ఉన్నాయి. ఆ నీటిని దిగువకు విడుదల చేయకపోవడంతో, మెకాంగ్‌పై ఆధారపడిన థాయ్‌లాండ్‌లో చెరకు సాగు దెబ్బతిని చక్కెర ఉత్పత్తి తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. వియత్నాంలో వరి దిగుబడి దారుణంగా తగ్గిపోయింది. లావోస్, కాంబోడియాలలో నీటి మట్టాలు తగ్గిపోయాయి. రేపు బ్రహ్మపుత్రపై చైనా నిర్మించే ప్రాజెక్టు వల్ల అసోం, అరుణాచల్‌లకూ ఇలాంటి పరిస్థితి దాపురించకుండా భారత్ జాగ్రత్త పడుతోంది. చైనా ఆనకట్టలతో దెబ్బతింటున్న దేశాలనూ కూడగట్టి భారత్ జలభద్రత సాధనకు కృషిచేయాలి.