తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చిన్నారులపై 'ఆన్‌లైన్‌' ఒత్తిడి- విపరీత ప్రవర్తన

కరోనా మహమ్మారి కారణంగా ఆన్​లైన్​ విద్యకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ విధానంలో అనేక సమస్యలు వస్తున్నా.. విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా.. పాఠశాల యాజమాన్యాలు, విద్యా శాఖ యంత్రాంగం భావిస్తున్నాయి. ఈ పద్ధతితో విద్యనందించడం వల్ల పిల్లల్లో ఒత్తిడి పెరిగిపోతోంది. ఫలితంగా విపరీత ప్రవర్తను కనబరుస్తారు. అయితే.. ఈ సమయంలోనే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ.. వాాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. స్కూల్​కు వెళ్తున్నప్పుడు వారికి చేసిన సూచనలను ఆన్‌లైన్‌ తరగతుల సమయంలోనూ పాటించేలా చూడాలి. భవిష్యత్తులో పాఠశాలలు ప్రారంభమవగానే ఆ వాతావరణానికి పిల్లలు సులభంగా అలవాటు పడేందుకు ఇది ఉపకరిస్తుంది.

CHILDREN ARE EXTRAVAGANT BEHAVIOUR WITH ONLINE EDUCATION SYSTEM
చిన్నారులపై 'ఆన్‌లైన్‌' ఒత్తిడి

By

Published : Jan 4, 2021, 6:29 AM IST

కరోనా సంక్షోభంవల్ల విద్యాసంస్థల మూసివేతతో ఆన్‌లైన్‌ తరగతులు అమలులోకి వచ్చాయి. ఈ ప్రక్రియలో రకరకాల సమస్యలు తలెత్తుతున్నా, విద్యాసంవత్సరాన్ని పూర్తి చేయడమే ధ్యేయంగా యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారవర్గాలు దీన్ని కొనసాగిస్తున్నాయి. అయిదు నుంచి పదేళ్లలోపు పిల్లలు ఏదైనా నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వస్తువులను చూసి, తాకి, కొన్నిసార్లు కదిపి- కొన్ని శబ్దాలు విని విషయాలను వీరు సులభంగా గ్రహించగలుగుతారు. ఇతరులతో కలిసి ఉన్నప్పుడు ఎదుటివారి హావభావాలను, ముఖ కవళికలను, స్వరంలోని భేదాలను బట్టి ఆయా విషయాల తీవ్రతను గుర్తిస్తారు. పాఠశాలలో పిల్లలు బడిలో తమ ఈడువారితో మాట్లాడేటప్పుడు, ఆడుకునేటప్పుడు- ఉపాధ్యాయులతో సంభాషించేటప్పుడు జ్ఞానేంద్రియాల ప్రభావం వారి మానసిక వికాసంపై ఎంతగానో ఉంటుంది. ప్రవర్తన రూపుదిద్దుకునేందుకు, వ్యక్తిత్వ నిర్మాణానికి ఇవి అవసరం.

ఉపాధ్యాయులకూ ఇబ్బందే..

ల్యాప్‌టాప్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ తెరపై ఉపాధ్యాయుల బోధనలు వింటూ పాఠాలు నేర్చుకోవడం- పిల్లల మెదడు, ప్రవర్తన, భావవ్యక్తీకరణలపై దుష్ప్రభావం చూపే అవకాశం ఎక్కువ. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీరిలో తార్కికజ్ఞానం, ఆలోచనాశక్తి తగ్గుముఖం పడతాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏకాగ్రత లోపిస్తుంది. చెబుతున్న పాఠం అర్థంకాదు. క్రమేపీ చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఇలాంటి పిల్లల తీరుపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన పెరుగుతుంది. ఆ ఆందోళన అంతిమంగా పిల్లలపైనే మరింత ఒత్తిడి పెంచేలా చేస్తుంది. పిన్న వయస్కులైన విద్యార్థులు తమ అనాసక్తతను ప్రవర్తనలో ప్రదర్శిస్తారు. రకరకాల కారణాలు చెప్పి ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావడం మానేస్తారు. కాస్త పెద్దపిల్లలైతే మంకుపట్టు పెరుగుతుంది. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ఆచరణాత్మకంగా చేయించే అభ్యాసం ఆసక్తి రేకెత్తించేలా ఉంటుంది. ఆన్‌లైన్‌ తరగతుల వల్ల విద్యార్థులకు తమ తోటివారితో, ఉపాధ్యాయులతో బంధం కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. ఆన్‌లైన్‌ బోధన ఉపాధ్యాయులనూ ఇబ్బంది పెడుతోంది. గతంలో తమ ఎదురుగా ఉన్న పిల్లలను బుజ్జగించో, మందలించో సరైన మార్గంలో నడిపించేవారు.

కొత్త నైపుణ్యాలు అలవర్చాలి..

కొంచెం పెద్ద వయసు పిల్లల (10-15 ఏళ్లవారి) పాట్లు ఇంకోవిధంగా ఉన్నాయి. వీరికి అన్నీ తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఆన్‌లైన్‌ బోధనకోసం ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు అందుబాటులోకి రావడం కొందరి విషయంలో ప్రమాదకరంగా మారుతోంది. ఆన్‌లైన్‌లో స్నేహితులతో చాటింగ్‌, ఆటలు, సినిమాలు... ఇలా వారు పక్కదారి పట్టడానికి ఎన్నో మార్గాలకు తలుపులు తెరిచినట్లయింది. ఇలాంటి పెడధోరణులు అలవడితే- విద్యపట్ల ఆసక్తి తగ్గడంతో పాటు, విపరీత ప్రవర్తన బారినపడే ప్రమాదమూ ఉంటుంది. పుస్తకం నుంచి చదివి సమాచారాన్ని గ్రహించడం మన విద్యార్థులకు అలవాటు. ల్యాప్‌టాప్‌ తెర మీద చదివి, విని సమాచారాన్ని గ్రహించడానికి భిన్నమైన నైపుణ్యాలు అవసరం. ఈ కొత్త నైపుణ్యాలు అలవడటానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు అది విద్యార్థులకు సమస్యగానే కనిపిస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు- ఆన్‌లైన్‌ క్లాసులవల్ల పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గ్రహించి, అర్థం చేసుకొని వారికి సహకరించాలి. వారికి కొత్త నైపుణ్యాలు నేర్పాలి.

నిబంధనలు విధించాల్సిందే..

కరోనా కలకలం నేపథ్యంలో పాశ్చాత్యదేశాలు తమ విద్యార్థుల భవిష్యత్తుకు కొన్ని పద్ధతులను అవలంభిస్తున్నాయి. పిల్లలు ఆన్‌లైన్‌ తరగతులకు ఇళ్లలో అయినా సరే... స్కూల్‌ యూనిఫారమ్‌లోనే కూర్చోవాలి. మధ్యమధ్యలో వెళ్లకుండా, మంచినీళ్లు, మధ్యాహ్న భోజనం అన్నీ టేబుల్‌పైన పెట్టుకోవాలి. తెరపై చూస్తూ పాఠాలు నేర్చుకునే క్రమంలో పిల్లలపై దుష్ప్రభావాలు పడకుండా తల్లిదండ్రులూ ప్రయత్నించేలా పాఠశాల యాజమాన్యం వారికి సూచనలు చేస్తోంది. ఈ తరహా విధానాలు భారత్‌లోనూ అమలు కావాలి. ఆన్‌లైన్‌ తరగతుల తరవాత వీలున్నంతవరకు ఎలక్ట్రానిక్‌ తెరల నుంచి విద్యార్థులను దూరంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులదే. ఖాళీ సమయంలో పిల్లల విద్యాభ్యాసం కోసం చక్కటి ప్రణాళిక రూపొందించాలి. వారి ఆటపాటలకూ సమయం కేటాయించాలి. పిల్లలకు చిన్నచిన్న పనులు చెబుతూ, వారు ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నమయ్యేలా చూడాలి. స్కూలుకు వెళ్తున్నప్పుడు వారికి చేసిన సూచనలను ఆన్‌లైన్‌ తరగతుల సమయంలోనూ పాటించేలా చూడాలి. భవిష్యత్తులో పాఠశాలలు ప్రారంభం కాగానే ఆ వాతావరణానికి పిల్లలు సులభంగా అలవాటు పడటానికి ఇది దోహదపడుతుంది.

- డాక్టర్‌ అనిత ఆరె, రచయిత - క్లినికల్‌ సైకాలజిస్ట్‌

ఇదీ చదవండి:జాతీయ స్థాయి క్రీడాకారులు- జీవనం కోసం పాట్లు

ABOUT THE AUTHOR

...view details