బాల్యం(childhood) ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. ప్రస్తుత కాలం చిన్నారులు ఆధునిక సాంకేతికత(New Technology) విషపు కోరల్లో చిక్కుకొని చిన్ననాటి ఆనంద క్షణాలకు దూరమవుతూ వారికే తెలియకుండా ఏకాంత జీవితాలు గడుపుతున్నారు. కరోనా సంక్షోభంతో(Corona crisis) ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆన్‌లైన్ పాఠాలు(Online classes), స్మార్ట్ ఫోన్లే వారికి కాలక్షేపంగా మారాయి. ఒకప్పుడు ప్రేమానురాగాల మధ్య గడిచిన బాల్యం, నేడు సాంకేతిక ఉపకరణాల మధ్య చిక్కుకున్నట్లయింది. కొవిడ్ సంక్షోభంలో ఆప్యాయతలను కోల్పోతోంది. ఉద్యోగ వ్యాపారాలు, ఇతర బాధ్యతలతో తల్లిదండ్రులు తీరికలేకుండా గడుపుతూ పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్న సంస్కృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి ధోరణులకు సాధ్యమైనంత త్వరగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
వ్యసనంగా మారుతున్న వైనం
ఆధునిక సాంకేతికతతో లాభాలు ఎన్ని ఉన్నా, లెక్కకు మించిన దుష్ఫలితాలూ ఉన్నాయన్నది వాస్తవం. కొవిడ్(Covid-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా విద్యారంగం ఆన్‌లైన్ తరగతుల బాటపట్టింది. క్రమంగా, ఆన్‌లైన్ తరగతులు ఉన్నా లేకపోయినా చాలామంది పిల్లలు డిజిటల్ ఉపకరణాలకు అతుక్కుపోవడం సర్వసాధారణమైంది. ఇప్పుడది ఆందోళనకరమైన వ్యసనంగా మారింది. చదువుల పేరిట సామాజిక మాధ్యమాలతో(Social media) గడపడం పరిపాటి అయింది. ఇలా గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడంవల్ల చిన్నారుల మానసిక స్థితిగతులపై పెను ప్రభావం పడుతోంది.
ఆన్‌లైన్ క్రీడలకు బానిసలుగా మారడం, అశ్లీల వెబ్‌సైట్లు, భయానక దృశ్యాలు చూడటం వల్ల వారిలో శారీరక, మానసిక రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయి. అదేపనిగా నీలి చిత్రాల్ని చూసే వారిలో విపరీతమైన లైంగిక ప్రవర్తనలు ఉంటాయి. చిన్నారుల్ని, మహిళల్ని తమ కోరికలు తీర్చే లైంగిక వస్తువులుగా చూసే ఆలోచనలు పెరుగుతాయి. ఇవే అత్యాచారాలకు దారితీస్తాయి. అబద్ధాలు చెప్పడం, మోసం చేసే ధోరణి పెరిగి, కోపానికి కుంగుబాటుకు గురై, మాదక ద్రవ్యాలకూ అలవాటు పడటం, నేరాల బాట పట్టడం వంటి ప్రమాదాలు ఉంటాయి.
తల్లిదండ్రులు 35 సంవత్సరాల క్రితం తమ పిల్లలతో వారానికి కనీసం ముప్పై గంటల సమయాన్ని వెచ్చించేవారు. ప్రస్తుతం అది వారానికి పద్దెనిమిది నిమిషాలకు పడిపోయిందని అధ్యయనాలు చాటుతున్నాయి. పిల్లలకు తగినంత సమయాన్ని కేటాయించలేని తల్లిదండ్రుల వైఖరి మారకుంటే బాధ్యతగల పౌరులను జాతికి అందివ్వకపోగా, భావి తరాలకు అన్యాయం చేసినట్లే అవుతుంది. ఒకప్పుడు ఉద్యోగం, వ్యాపారరీత్యా తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వెళితే సాయంత్రానికి పిల్లల కోసం ఇంటికి వచ్చేవారు. ప్రస్తుతం ఎటువెళ్ళినా చరవాణిలో వీడియోకాల్‌తో మాట్లాడి సరిపెడుతున్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నా, దానివల్ల అనర్థాలూ ఎక్కువే!
కరోనా కారణంగా అంతా ఇంటికే పరిమితమైన ప్రస్తుత తరుణంలో చిన్నారులను ఒంటరిగా వదిలేయకుండా- స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు అతిగా అలవాటు పడకుండా చూడాలి. సెల్‌ఫోన్ వాడకానికి బానిసలుగా మారడం వల్ల స్వీయ నియంత్రణ కోల్పోయి, కుటుంబంతో స్నేహితులతో సహజంగా గడపాల్సిన సమయం, కలివిడితనం తగ్గుతాయి. ఎక్కువ సమయం తెరకేసి చూడటం వల్ల కళ్ల మంట, పొడిబారడం, నీరు కారడం, తలనొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కనురెప్పల వద్ద ఉండే కండరాలపై ఒత్తిడి పెరిగి దగ్గరి చూపుపై దుష్ప్రభావం పడుతుంది. పిల్లలు టీవీలు, సెల్‌ఫోన్లకు అంకితమై ఆరుబయట ఆటలకు దూరమవుతుండటంతో దూరపు చూపు సన్నగిల్లుతోంది. చిన్నతనంలోనే కళ్లద్దాలు వాడాల్సి వస్తోంది. తల్లిదండ్రులు ఇలాంటి వాటిని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే- పిల్లల కంటిచూపు, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.