భారత సర్వోన్నత న్యాయస్థానానికి ఒక నారీమణి నేతృత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని నాలుగు నెలల క్రితం నాటి సీజేఐ బాబ్డే వ్యాఖ్యానించారు. దేశీయంగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య ద్విగుణీకృతమయ్యేలా సుప్రీంకోర్టే చొరవ తీసుకోవాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ లోగడ సూచించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం తాజా నిర్ణయాలు ఈ ఆకాంక్షలకు అద్దంపట్టాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తొమ్మిది మందిని సిఫార్సు చేసిన కొలీజియం- గతానికి భిన్నంగా ఒకేసారి ముగ్గురు మహిళలకు ఆ జాబితాలో చోటు కల్పించింది.
కొత్త చరిత్ర లిఖించే అవకాశం!
అన్నీ అనుకూలిస్తే వారిలోని జస్టిస్ బి.వి.నాగరత్న ఆరేళ్ల తరవాత భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కొత్త చరిత్ర లిఖించే అవకాశం ఉంది. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కోసం కొలీజియం సభ్యులు ఎంచిన ఏడుగురు న్యాయమూర్తుల్లో సైతం నలుగురు మహిళలు కావడమూ హర్షణీయం. గడచిన ఏడు దశాబ్దాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలువుతీరిన వారిలో మహిళలు కేవలం ఎనిమిది మంది! హైకోర్టులు అన్నింటిలోనూ కలిపి 78 మంది మహిళా న్యాయమూర్తులే పనిచేస్తున్నట్లు కేంద్రం నిరుడు సెప్టెంబరులో పార్లమెంటులో ప్రకటించింది. పట్నా, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తీ కనిపించరు!
భారత్‌లో మాత్రం తద్భిన్నంగా..
కెనడా, న్యూజిలాండ్‌లు రెండు దశాబ్దాల క్రితమే అత్యున్నత న్యాయపాలికల్లో స్త్రీమూర్తులకు పట్టంకట్టాయి. ఇథియోపియా, సూడాన్, జాంబియా, యూకే, మలేసియా, కెన్యా తదితర దేశాలు ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకొన్నాయి. 66 కోట్లకు పైగా మహిళలు ఉన్న ఇండియాలో మాత్రం తద్భిన్నమైన పరిస్థితులు రాజ్యంచేస్తున్నాయి. అన్ని స్థాయుల్లో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం ఇనుమడిస్తేనే- భిన్న రంగాల్లో స్త్రీలకు సమాన అవకాశాలు లభించాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి మన్నన దక్కుతుంది. సుప్రీంకోర్టు కొలీజియం చొరవ- ఈ దిశగా గొప్ప ముందడుగు!