Chhattisgarh Election 2023 : ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ.. రెండోసారి కూడా సీఎం పీఠం కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. కర్ణాటకలో విజయవంతం అయిన ఉచిత హామీల ఫార్ములాను ఇక్కడ కూడా పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రధాని మోదీ ఛరిష్మా, అవినీతి అంశాల ద్వారా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న కమలం పార్టీ.. ప్రచారంలో కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.
కాంగ్రెస్ హామీల వర్షం
Chhattisgarh Election Congress : ఛత్తీస్‌గఢ్ శాసనసభకు ఈనెల 7న, 17న రెండువిడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరో 6 రోజుల్లో 20స్థానాల్లో తొలివిడత పోలింగ్ జరగనుంది. ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉచిత హామీలు ప్రకటిస్తున్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే మళ్లీ రైతు రుణమాఫీ, కుల గణన, వరి సేకరణ ధర పెంపు, గ్యాస్ సిలిండర్ ధర తగ్గించనున్నట్లు రాహుల్ ప్రకటించారు.
డైలమాలో కమలం నేతలు!
Chhattisgarh Election BJP :హస్తం పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటే కమలం నేతలు డైలామాలో ఉన్నారు. ఏ హామీలు ఇవ్వాలి? ఎలాప్రచారం చేయాలి? అన్న విషయంలో స్పష్టతలేదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. బస్తర్ డివిజన్‌లో ఈనెల 7న తొలి విడత పోలింగ్ జరగనుంది. భారతీయ జనతా పార్టీ తరపున ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు బరిలో ఉన్నా.. ప్రచారంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనందున.. ఏ హామీలు ఇవ్వాలి? ఎలాప్రచారం చేయాలనే విషయంలో దిశానిర్దేశం చేసే నాయకుడు లేక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి అంశాలతోపాటు ప్రధాని మోదీ ప్రచారంపై ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు.
అర డజనుకుపైగా ప్రభుత్వ పథకాల్లో..
ఈనెల 2న తొలిసారి ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. కంకర్ ప్రచారసభలో పాల్గొంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలో విడుదల చేయనున్న ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు.. అన్నివర్గాలను ఆకట్టుకుంటాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో తాము అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటున్న కమలం నేతలు.. అర డజన్‌కుపైగా ప్రభుత్వ పథకాల్లో కుంభకోణం జరిగినట్లు ఆరోపిస్తున్నారు. వరి సేకరణ, ఎక్సైజ్, మైనింగ్‌సహా అనేక కుంభకోణాల్లో బ్యూరోక్రాట్లు, కేబినెట్ మంత్రులకు ప్రమేయం ఉందని విమర్శిస్తున్నారు.