తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Chhattisgarh Assembly Election 2023 Prediction : ఛత్తీస్​గఢ్​లో హోరాహోరీ.. బఘేల్​పై కాంగ్రెస్ నమ్మకం..​ మోదీపైనే బీజేపీ ఆశలు.. గెలుపెవరిది?

Chhattisgarh Assembly Election 2023 Prediction : వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గడ్‌లో.. అసెంబ్లీ ఎన్నికలకు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు . రెండు దశల్లో పోలింగ్‌ జరగనున్న ఛత్తీస్‌గడ్‌లో.. కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోరు జరగనుంది. అంతర్గత పోరు ఉన్నప్పటికీ సీఎం భూపేశ్​ బఘేల్‌ నాయకత్వంపైనే నమ్మకం ఉంచింది హస్తం పార్టీ. ప్రధాని మోదీ కరిష్మాతోనే గెలవాలని కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. అవినీతిరహిత పాలనే ధ్యేయమంటూ ఆమ్‌ ఆద్మీ సైతం అభ్యర్థులను పోటీకి నిలిపింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గడ్‌ పోరు రసవత్తరంగా మారింది.

Chhattisgarh Assembly Election 2023 Prediction
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 10:30 AM IST

Chhattisgarh Assembly Election 2023 Prediction :లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ 5 రాష్ట్రాల ఫలితాలు సార్వత్రిక సమరంపైనా పడతాయని భావిస్తున్న ఇరు పార్టీలు.. వ్యూహాత్మంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఛత్తీస్‌గడ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలుపుకోవడం కోసం.. సంక్షేమ పథకాలను, సీనియర్ నాయకులనే నమ్ముకుంది కాంగ్రెస్​. రైతులు, గిరిజనులు, పేదలకు ప్రకటించిన హామీలు, పథకాలతో మరోసారి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. సీఎం భూపేశ్‌ బఘేల్‌కు ఉన్న కరిష్మా కలిసి వస్తుందని అంచనా వేస్తోంది.

ఓబీసీ, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భూపేశ్‌ బఘేల్‌కు మంచి పట్టుంది. వీటితోపాటు ఆయన ప్రవేశపెట్టిన.. రాజీవ్‌ గాంధీ కిసాన్‌ న్యాయ్‌, గోదాన్‌ న్యాయ్‌ యోజన, నిరుద్యోగ భృతి వంటి కార్యక్రమాలు తిరిగి అధికారం కట్టబెడతాయని ధీమాతో హస్తం పార్టీ ఉంది. గిరిజనులు, ఓబీసీలు ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గడ్‌లో.. కులగణన నిర్వహిస్తామని చెప్పడం కూడా కలిసి వస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది.

రైతులకు రుణమాఫీ చేస్తామని, వరి ధాన్యం కొంటామని, 17.5లక్షల మందికి నివాస గృహాలను అందిస్తామని.. బఘేల్‌ ఇచ్చిన హామీలు తమ గెలుపునకు దోహదం చేస్తాయని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతుల రుణాలు మాఫీపై 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్నే మరోసారి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2023లో కూడా అధికారంలో వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సోమవారం ప్రకటించారు. రైతులను ఆదుకుంటామని.. కాంగ్రెస్​ను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

సొంతపార్టీలోనే బఘేల్‌పై అసమ్మతి..
అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకంటే సొంత పార్టీలోనే.. ముఖ్యమంత్రి బఘేల్‌పై అసమ్మతి ఎక్కువగా ఉంది. సీనియర్‌ నేత టీఎస్‌ సింగ్‌ దేవ్‌ పలుమార్లు తిరుగుబావుటా ఎగరవేశారు. దీంతో ఆయన్ను బుజ్జగించిన అధిష్ఠానం.. సింగ్​ దేవ్​కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ఈయనకు సర్గుజ గిరిజన ప్రాంతంలో మంచి పట్టుంది. హోంమంత్రి తామ్రధ్వజ్‌ సాహు సైతం సీనియర్ నాయకుడు. ఓబీసీల్లో అతిపెద్ద సామాజికవర్గమైన సాహుకు.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

మరో సీనియర్‌ నేత మోహన్‌ మక్రాంకు.. బఘేల్‌తో విభేదాలు ఉన్నాయి. కొన్ని నెలల కిందటే ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుని.. అసమ్మతిలేకుండా అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుంది. అయితే బొగ్గు రవాణాలో అవినీతి, మద్యం అమ్మకాలు, జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ నిధులు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో అవకతవకలు వంటి ఆరోపణలు కాంగ్రెస్‌ను ఇబ్బందిపెడుతున్నాయి. వాటిన్నిటినీ తాము అధిగమిస్తామని హస్తం పార్టీ చెబుతోంది.

అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న బీజేపీ..
2003 నుంచి 2018 వరకూ వరసగా మూడు పర్యాయాలు ఛత్తీస్‌గడ్‌ను పాలించిన బీజేపీ మళ్లీ అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా.. పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిపై విస్తృత ప్రచారం చేస్తోంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంగానీ, ముందుండి నడిపించే నాయకుడికి బాధ్యతలు అప్పగించడంగానీ చేయలేదు.

2018లో ఓటమి తర్వాత భాజపా.. ఛత్తీస్‌గఢ్‌ అధ్యక్షుడిని మూడుసార్లు మార్చింది. అసెంబ్లీలో విపక్ష నేతను కూడా ఇటీవల మార్చింది. మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ను సైతం పక్కన పెట్టింది. పార్టీని నడిపించే బలమైన నాయకుడు లేకపోవడం లోటే అయినప్పటికీ... ఏకపక్ష నాయకత్వం, కుటుంబ రాజకీయాలు ఉండరాదని ప్రధాని మోదీ భావిస్తున్నారు. అందుకే మోదీ కరిష్మాతోనే.. ఛత్తీస్‌గఢ్‌లోనూ పోరాడాలని భాజపా నిర్ణయించింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నినాదంతో కమలదళం ప్రజల్లోకి వెళుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా.. ప్రధాని మోదీ, అమిత్‌ షా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి దఫా పోలింగ్‌ కోసం 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతోన్న బీజేపీ.. రెండో దఫా కూడా వీరినే ప్రధాన ప్రచారకర్తలుగా నియమిస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థుల్లో ప్రముఖ నటులు, మాజీ ఐఏఎస్‌ అధికారులకు ప్రాధాన్యం ఇచ్చింది. అధికారపక్షంపై ప్రజల్లో ఉన్నవ్యతిరేకత కూడా తమకు కలిసి వస్తుందని కమలదళం భావిస్తోంది.

పోటీకి సై అంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ..
అవినీతి రహిత పాలనే ధ్యేయమంటూ ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం పోటీకి నిలిచింది. తొలివిడత పోటీకి అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, భాజపాల పాలనతో ఛత్తీస్‌గడ్‌కు ఒరిగింది ఏమీలేదని విమర్శిస్తోంది. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబరు 7న 20 స్థానాల్లో, నవంబరు 17న మిగిలిన 70 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపడతారు.

22 Crucial Seats In MP : తాడోపేడో తేల్చే ఆ 22 సీట్లు.. ముస్లిం ఓటు బ్యాంక్​పై కాంగ్రెస్ ఆశలు!.. అధికారం కైవసం చేసుకుంటుందా?

Young Voters Impact : 5 రాష్ట్రాల్లో 75లక్షల కొత్త ఓటర్లు.. తెలంగాణలో 7లక్షల మంది.. వారి చూపు ఎటువైపో?

ABOUT THE AUTHOR

...view details