హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో చేపట్టిన చార్‌ధామ్ రైల్వే ప్రాజెక్టుపై స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించిన తరవాత పర్వత ప్రాంతాల్లో చేపట్టిన తొలి అతిపెద్ద రైల్వే ప్రాజెక్టుగా దీన్ని పేర్కొంటున్నారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలుపుతూ గఢ్వాల్ ప్రాంతంలో రైల్వే లైను నిర్మిస్తున్నారు. గఢ్వాల్ ప్రాంతం పర్వతాలతో నిండి ఉంటుంది. హిందువులు ఏటా పెద్ద సంఖ్యలో దర్శించే నాలుగు తీర్థాలను కలుపుతూ రైల్వే లైను నిర్మించాలని 2014లోనే కేంద్రం తలపెట్టింది. 327 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైనులో 61 సొరంగాలు, 59 వంతెనలు, 21 కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. 2024 నాటికి దీన్ని పూర్తి చేసేలా రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ వేగంగా పనులు చేపడుతోంది.
బలహీనంగా కొండలు..
గఢ్వాల్ ప్రాంతంలో రిషీకేశ్- కర్ణప్రయాగ్‌ల మధ్య మీటర్ గేజ్ రైల్వే లైను నిర్మాణానికి 1925లోనే బ్రిటిష్ ప్రభుత్వం సర్వే నిర్వహించింది. గఢ్వాల్ కొండలు చాలా పెళుసైనవని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు భావించినందువల్ల ఈ ప్రాజెక్టును అప్పట్లో తిరస్కరించినట్లు చెబుతారు. అదే సమయంలో ఇతర పర్వత ప్రాంతాలైన డార్జిలింగ్, సిమ్లా, ఊటీల్లో మీటర్ గేజ్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు. చార్‌ధామ్ రైల్వే ప్రాజెక్టు కోసం 2014-15లో రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ గఢ్వాల్ ప్రాంతంలో ప్రాథమిక సర్వే నిర్వహించి, 2015లో నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నాలుగు క్షేత్రాలను తేలిగ్గా దర్శించుకోవడంతో పాటు ఎత్తయిన ప్రాంతాల్లోని అడవులు, లోయలగుండా రైలు ప్రయాణం యాత్రికులకు గొప్ప అనుభూతిని అందిస్తుంది.
కొండచరియలు విరిగిపడి..
వెనకబడిన తమ ప్రాంతంలో ఈ రైల్వే ప్రాజెక్టు వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని ఉత్తరాఖండ్‌లో కొందరు దీన్ని ఆహ్వానిస్తుంటే, మరి కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరంతరం రైళ్ల రాకపోకల వల్ల అసలే పెళుసుగా ఉండే గఢ్వాల్ కొండలు మరింత బలహీనపడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో కుంభవృష్టి వల్ల గఢ్వాల్‌లో కొండ చరియలు తరచూ విరిగిపడుతుంటాయి. ఈ క్రమంలో గతంలో బురద ముంచెత్తి గ్రామాలకు గ్రామాలే నామరూపాలు లేకుండా పోయాయి. ఆకాశానికి చిల్లులు పడినట్లు 2013 జూన్‌లో కురిసిన వర్షానికి చమోలీ జిల్లా కేదార్‌నాథ్‌లో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించగా, వందల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. ఎందరో నిరాశ్రయులుగా మిగిలారు.