తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Assembly Election 2022: నాయకత్వ మార్పుతో ఎన్నికలకు సన్నద్ధం! - కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ(Assembly Election 2022) ముఖ్యమంత్రులను మార్చుతూ బిజీబిజీగా ఉంది భాజపా అధిష్ఠానం. 15 నెలల్లో శాసనసభ ఎన్నికలు ఉన్న గుజరాత్​లో రూపానీ స్థానంలో(Gujarat BJP news) పాటీదార్‌ వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్‌(Bhupendra Patel MLA) నియామకం తమకు సానుకూలంగా మారుతుందని భాజపా ఎత్తులు వేస్తోంది. దీనితో ఇది కుర్చీలాట కాదని.. కమలనాథుల కదన వ్యూహమని నిశితంగా గమనిస్తే అర్థమవుతుంది.

bjp
bjp

By

Published : Sep 14, 2021, 6:56 AM IST

గుజరాత్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు(Assembly Election 2022) ముందు మరోసారి అక్కడ ముఖ్యమంత్రి మార్పు చోటుచేసుకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) సొంత రాష్ట్రం కావడంతో ప్రస్తుతం అందరి దృష్టీ అటువైపు మళ్ళింది. వచ్చే సంవత్సరం అక్కడి శాసనసభకు ఎన్నికలు(Gujarat Election 2022) జరగనున్నాయి. గుజరాత్‌లో 2017 ఎన్నికలకు 16 నెలల ముందు అప్పటి ముఖ్యమంత్రి ఆనందీ బెన్‌తో రాజీనామా చేయించి జైన బనియా వర్గానికి చెందిన విజయ్‌ రూపానీకి(Vijay Rupani) కుర్చీ కట్టబెట్టారు. ఇప్పుడు మరోసారి శాసనసభ ఎన్నికలు 15 నెలల్లో ఉన్నాయనగా రూపానీని దించి, పాటీదార్‌ వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్‌ను (Bhupendra Patel MLA) తెరపైకి తీసుకొచ్చారు. గుజరాత్‌లో రెండున్నర దశాబ్దాల నుంచి భాజపా అధికారంలో ఉంది. విజయ్‌ రూపానీ సర్కారు కొవిడ్‌ కట్టడి సహా పలు అంశాల్లో ఘోరంగా విఫలమైంది. దీంతో మరోసారి ఆ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయడానికి ఏం చేయాలన్న దానిపై మేధామథనం మొదలైంది. ప్రధానికి సొంత రాష్ట్రంలో పట్టు కీలకం కావడంతో మోదీ-షా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకుండా చూసేందుకే ముఖ్యమంత్రిని మార్చినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గుజరాత్‌లో ప్రభావవంతమైన పాటీదార్‌ వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్‌ గతంలో ఆనందీ బెన్‌ ప్రాతినిధ్యం వహించిన ఘట్లోడియా స్థానానికి 2017లో తొలిసారి ఎన్నికయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఆయనకు దీర్ఘకాల అనుబంధం ఉంది. ముఖ్యమంత్రి పదవి తమవాళ్లకు ఇవ్వాలంటూ పాటీదార్లు చాలాకాలం నుంచి డిమాండు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉండటంతో ఆ అంశాన్ని తమకు సానుకూలంగా మార్చుకోవచ్చన్నది కమలనాథుల వ్యూహంలా కనిపిస్తోంది.

భాజపా ఎన్నికల ప్రణాళికలు

గుజరాత్‌లో రాష్ట్ర భాజపా కార్యవర్గ సమావేశాలను ఇటీవల కేవడియాలో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సహా, ఇతరులంతా ప్రధానిని శ్లాఘించారు. భారతదేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొడుతున్నారని, దేశ ఆత్మగౌరవాన్ని తిరిగి సంపాదించారని ప్రశంసించారు. భారతీయతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారని, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేశారని మోదీని(PM Modi) కొనియాడారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ మరో అడుగు ముందుకేసి- సెప్టెంబర్‌ 17న నరేంద్రమోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్‌లోని 7001 రామ మందిరాల్లో హారతులు ఇవ్వాలని పిలుపిచ్చారు. పాటిల్‌ను రంగంలోకి దించడం కూడా కీలకమైన వ్యూహమే. గత లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ (6.89 లక్షలు) సాధించిన ఆయన గుజరాత్‌లో బూత్‌ మేనేజ్‌మెంట్‌ పితామహుడిగా పేరు గడించారు. పాటిల్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలందరికీ టాబ్లెట్‌ పీసీలు అందజేశారు. వాటిలో కేంద్రం, రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాలు సాధించిన విజయాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వివరాలు, వీడియోలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడానికే వాటిని కార్యకర్తలకు అందిస్తున్నారు. ముమ్మారు తలాఖ్‌ను నిషేధిస్తూ చేసిన చట్టంతో దేశంలో ముస్లిం మహిళలకు మోదీ సాధికారత కల్పించారని చెబుతూ, ఆ వర్గం ఓట్లపైనా దృష్టి సారించారు. ఈ ప్రచార వ్యూహంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం పేరును ప్రస్తావించలేదు.

గతంలో ఎన్నడూ రానంత ఆధిక్యాన్ని ఈసారి గుజరాత్‌లో భాజపాకు (Gujarat BJP news) కట్టబెట్టాలన్నది ఆ పార్టీ నాయకుల లక్ష్యం. గత ఎన్నికల్లో గుజరాత్‌లో భాజపాకు కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర, జాతీయ స్థాయిలో సరైన నాయకత్వం లేని స్థితి కాంగ్రెస్‌ నేతల్లో గుబులు రేపుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ చాపకింద నీరులా చొచ్చుకొస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రమంగా బలాన్ని పెంచుకొంటోంది. ఇప్పటికే వేళ్లూనుకొన్న భాజపా నాయకులను దీటుగా ఎదుర్కొనేందుకు తగిన అంగ, అర్థబలాలున్న నాయకుల లేమి ఆప్‌కు సమస్యగా మారింది. ఇటీవలి కాలంలో గుజరాత్‌లో సంభవించిన ప్రకృతి విపత్తులు, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ గందరగోళం, వీటన్నింటికీ తోడు విజయ్‌ రూపానీ సర్కారు వైఫల్యాలు భాజపాను వేధిస్తున్న ప్రతికూలాంశాలు. కరోనా రెండోదశలో(Corona second wave) గుజరాత్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందనే వార్తలు వచ్చాయి. మహమ్మారి కట్టడిలో(Corona pandemic) ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 26 ఏళ్లపాటు అధికారంలో ఉండటం వల్ల వచ్చే అనుకూలతలు, ప్రతిపక్షాలు బలంగా లేకపోవడం వంటి అంశాలను తమకు సానుకూలంగా మార్చుకోవాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టేస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో ఎలా ప్రచారం నిర్వహించాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో గుజరాత్‌ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో, అది దేశవ్యాప్త రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాల్సిందే.

- రఘురామ్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details