తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కల్తీ ఆహారంతో ఆరోగ్య భద్రతకు సవాలు - health security in india

రోగ నిరోధక శక్తి పెంపునకు విరివిగా ఆహార పదార్థాల కోనుగోలును అక్రమార్కులు కల్తీ వ్యాపారానికి అదనుగా మార్చేస్తున్నారు. నాసిరకం వస్తువులను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పౌష్టికాహార భద్రత కోసం మార్గదర్శకాలున్నా వాటి అమలులో నిర్లక్ష్యం కల్తీకి రెక్కలు తొడుగుతోంది.

adulterated food in india
కల్తీ ఆహారం

By

Published : Jun 11, 2021, 8:13 AM IST

'పౌష్టికాహారం తినండి - కొవిడ్‌ను ఎదుర్కోండి' అనే నినాదంతో రోగనిరోధక శక్తి పెంపొందించే మార్గదర్శకాల్ని ఏడాది క్రితమే భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఏఐ) విడుదల చేసింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య, ఆరోగ్యరంగ నిపుణులు సైతం కరోనా కట్టడికి రోగ నిరోధకశక్తి పెంపుదలే అత్యుత్తమ మార్గమని సూచిస్తున్నారు. దీంతో ప్రజలు కూరగాయలు, పండ్లు, పప్పుదినుసులు, మాంసం, పాలు, తేనె లాంటి ఆహార పదార్థాలను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా కల్తీ వ్యాపారులు అక్రమాలకు తెరతీశారు. అధిక గిరాకీ ఉన్న ఆహార పదార్థాల కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలు పెంచుతున్నారు. మరోవైపు కల్తీ, నాసిరకం వస్తువుల జోరు పెరుగుతూ ప్రజారోగ్యం కునారిల్లుతోంది. ఆహార, వ్యవసాయ సంస్థ-2020 నివేదిక ప్రకారం దేశంలో సుమారు 19 కోట్ల జనావళిని పోషకాహార లోపాలు పీడిస్తున్నాయి. పౌష్టికాహార భద్రత కల్పించాలని జాతీయ ఆహార భద్రత చట్టం సమున్నత లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఆచరణలో అది విఫలమయింది. భారత్‌లో ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ- ఆహార నాణ్యతను పర్యవేక్షిస్తుంది. దేశవ్యాప్తంగా 28.5శాతం ఆహార పదార్థాలు, 39శాతం పాలు ప్రమాణాలకు తగినట్లు లేవని ఎన్‌ఎస్‌ఎస్‌ఏఐ అధ్యయనంలో వెలుగుచూసింది.

ఏది కల్తీయో తెలియడం లేదు..

దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న వస్తువుల్లో నాణ్యతా ప్రమాణాలు కొరవడటం వల్ల వ్యక్తిగతంగానే కాదు, దేశార్థికానికీ నష్టం వాటిల్లుతోంది. కలుషిత ఆహార పదార్థాలతో సంభవించే వ్యాధుల వల్ల దేశంపై ఏటా రూ.1.09 లక్షల కోట్లు నష్టపోతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు అశనిపాతంలా మారడమే కాకుండా, ప్రజల మరణాలకు కారణమవుతోంది. కల్తీని నివారించకపోతే 2025 నాటికి క్యాన్సర్‌ లాంటి వ్యాధులు ముమ్మరిస్తాయన్న ప్రపంచబ్యాంకు హెచ్చరికలు ఆందోళనకరం. వంట నూనెలు, వనస్పతి వంటి వాటిలో ఉండే సాచురేటెడ్‌ కొవ్వు పదార్థాలు (టీఎఫ్‌ఏ) ప్రాణాంతకంగా మారి ఏటా ప్రపంచవ్యాప్తంగా 5.4లక్షల మంది మృత్యువు పాలవుతున్నారు. అందులో భారత్‌లోనే ఏటా 77 వేల మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. టీఎఫ్‌ఏ వల్ల గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వంటి రోగాలు విజృంభిస్తున్నాయి. ప్రజలకు ఏది కల్తీయో తెలియడం లేదని, విధి లేని పరిస్థితుల్లో విషాహారం తీసుకొంటున్నారని గతంలోనే తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. కలుషితాహార నియంత్రణ చట్టం-1954ను సంస్కరించి, సమర్థంగా అమలు చేయాలి.

మందులు కూడా నకిలీ..

చైనా, సింగపూర్‌, బ్రిటన్‌ వంటి దేశాలు మన్నికైన ఆహారాన్ని ప్రజలకు అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నాయి. భారత్‌లో ఖరీదైన ఔషధాలు, ఇంజక్షన్లు సైతం నకిలీవి ఉత్పత్తి అవుతున్నాయి. భారత వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య (అసోచామ్‌) నివేదిక ప్రకారం, దేశీయ విపణిలో 25శాతం వరకు మందులు నకిలీవే. సుమారు రూ.30 వేల కోట్ల అక్రమదందా ఔషధాల పేరిటే కొనసాగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నకిలీ మందుల బాగోతాన్ని అరికట్టడానికి మషేల్కర్‌ కమిటీ చేసిన సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరించాలి. ఔషధ నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి.

దేశవ్యాప్తంగా 2018లో మాంసం కోసం 271 కోట్ల జంతువులను వధించినట్లు అంచనా. కానీ కొవిడ్‌ సమయంలో ఈ సంఖ్య మరింత పెరగనుంది. విదేశాలకు మాంసం ఎగుమతి చేసే పెద్ద పశు వధశాలల్లో నాణ్యతను ధ్రువీకరిస్తున్నారు. కానీ దేశంలో ఈ మార్గదర్శకాలు అంతగా అమలు కావడం లేదని జాతీయ మాంస పరిశోధన కేంద్రం తన సర్వేలో తేల్చింది. ప్రమాణాల్లేని ఆహార పదార్థాల బెడదను తొలగించడానికి వినియోగదారుల రక్షణ చట్టం-1986ను ప్రభుత్వం సవరించింది. అనైతిక వ్యాపారాలు, నాసిరకం వస్తూత్పత్తులు, మోసకారి ప్రకటనల నుంచి వినియోగదారుల రక్షణకు- వచ్చే నెల నుంచి కొత్త విధి, విధానాలు అమలులోకి రానున్నాయి. మారుతున్న దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా ఇ-కామర్స్‌, ఆన్‌లైన్‌ కొనుగోళ్లను చట్టంలో చేర్చి, వినియోగదారుల పరిరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది.

వినియోగదారుల హక్కుల రక్షణ

వినియోగదారుల సంఘాల స్థితిగతుల్ని తెలుసుకోవడానికి కేంద్రం నియమించిన జస్టిస్‌ అరిజిత్‌ పసాయత్‌ కమిటీ నివేదించిన అంశాలతో వినియోగదారుల హక్కుల రక్షణ ఎంతగా గాడి తప్పిందో బోధపడుతోంది. దేశంలో వినియోగదారుల రక్షణపై తగినంత అవగాహన లేక లక్ష్యం నీరుగారిపోతోంది. ఈ దుస్థితిని రూపుమాపి వినియోగదారుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వాలు శ్రమించి, ప్రజారోగ్యాన్ని కాపాడాలి. పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, నిత్యం తనిఖీలు నిర్వహించాలి. శిక్షలు కఠినంగా అమలైతేనే ఇలాంటి దురాగతాలకు అడ్డుకట్ట పడుతుంది. ప్రజల ఆరోగ్య, జీవన భద్రతలను పరిరక్షించడం సాధ్యమవుతుంది.

- ఎ.శ్యామ్‌కుమార్‌

ఇదీ చూడండి:కొవిడ్​ వేళ.. అన్నార్తులకు అభయంగా

ABOUT THE AUTHOR

...view details