తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చాబహార్‌ ప్రాజెక్టుపై నీలినీడలు- అంతంతమాత్రంగా అభివృద్ధి పనులు ! - chabahar port development status

ఇరాన్‌లోని చాబహార్‌ ఓడరేవు(Chabahar Port) విషయంలో భారత్‌ పరిస్థితి ఎటు కదల్లేకుండా ఉంది. ఈ ఓడరేవు అభివృద్ధి నిమిత్తం 2016లో భారత్‌, ఇరాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే అమెరికా అంతర్జాతీయ రాజనీతి 'వ్యూహాత్మక గందరగోళం'తో చాబహార్ ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.​

Chabahar port development works
చాబహార్​ ఓడరేవు

By

Published : Nov 30, 2021, 9:16 AM IST

ఇరాన్‌లోని చాబహార్‌ ఓడరేవు(chabahar project) విషయంలో భారత్‌ పరిస్థితి ఒకడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. ఈ ఓడరేవు అభివృద్ధి నిమిత్తం 2016లో భారత్‌, ఇరాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. దాదాపు ఆరేళ్లు కావస్తున్నా ఓడరేవు మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో మాత్రం పురోగతి సాధ్యపడలేదు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టడం, ఇరాన్‌ అమెరికా అణు ఒప్పంద పునరుద్ధరణ చర్చలు కొలిక్కి రాకపోవడం, అగ్రరాజ్యం తన ప్రత్యర్థుల్ని నిలువరించేందుకు రూపొందించిన 'కాట్సా' ఆంక్షల భయాలు, విదేశీ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ అలసత్వం వంటివి ఈ ప్రాజెక్టు ఫలాలను భారత్‌కు దక్కనీయకుండా చేస్తున్నాయి.

భారత్‌కు చెందిన ఇండియా పోర్ట్స్‌ గ్లోబల్‌(ఐపీజీ), ఇరాన్‌కు చెందిన అరియా బందర్‌ ఇరానియన్‌ పోర్ట్‌ అండ్‌ మెరైన్‌ సర్వీస్‌ కంపెనీ(ఏబీఐ) మధ్య 2016లో ఓ ఒప్పందం(chabahar port development agreement) కుదిరింది. దాని ప్రకారం చాబహార్‌ ఓడరేవు(chabahar port development status) మొదటి దశలో షహీద్‌ బెహెస్తీ టర్మినళ్లలో సుమారు 8.5 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టడంతో పాటు పదేళ్ల లీజుతో ఏటా నిర్వహణ ఖర్చుల కింద సుమారు 2.2 కోట్ల డాలర్లను భారత్‌ వెచ్చించాలి. దాంతోపాటు రేవు కంటైనర్‌ ట్రాక్‌ల నిర్మాణానికి నిధులు వెచ్చించేందుకూ ఇండియా అంగీకరించింది. ఈ రేవు నుంచి సరకు రవాణా ద్వారా లభించే ఆదాయాన్ని నిర్ణీత నిష్పత్తి ప్రకారం భారత్‌, ఇరాన్‌ పంచుకోవాలి.

లావాదేవీలపై వెనకడుగు

అమెరికా అనుసరించే అంతర్జాతీయ రాజనీతిలో 'వ్యూహాత్మక గందరగోళం' సృష్టించడం కీలకమైన విధానం. తైవాన్‌కు మద్దతు ఇచ్చే విషయంపై పొంతన లేని ప్రకటనలు చేయడం ఈ వ్యూహంలో భాగమే. ఒకవేళ యుద్ధంలాంటి పరిస్థితి తలెత్తితే అమెరికా మద్దతు తైవాన్‌కు లభిస్తుందో లేదో కచ్చితంగా అర్థంకాక డ్రాగన్‌ అడుగు ముందుకేసే విషయంలో ఆలోచనలో పడింది. అగ్రరాజ్యం ఉద్దేశపూర్వకంగానే ఈ గందరగోళాన్ని ముగించే ప్రయత్నం చేయడం లేదని అర్థమవుతోంది.

చాబహార్‌ పోర్టు విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తోంది. అఫ్గాన్‌ను దృష్టిలో ఉంచుకొని అధికారికంగా చాబహార్‌ పోర్టుకు 'కాట్సా' ఆంక్షల నుంచి అగ్రరాజ్యం మినహాయింపు ఇచ్చింది. ఇరాన్‌ చమురు రంగంపై ఆంక్షలను కొనసాగిస్తోంది. దాంతో చాలా బ్యాంకులు చాబహార్‌ రేవుకు సంబంధించిన లావాదేవీల విషయంలో వెనకడుగు వేస్తున్నాయి. షహీద్‌ బెహెస్తీ టర్మినళ్లలో నాలుగు క్రేన్ల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు సైతం నాలుగేళ్లుగా ముందుకు సాగడం లేదు. 2017లో చైనాకు చెందిన 'షాంఘై జెన్హూవా హెవీ ఇండస్ట్రీస్‌ కంపెనీ' ఈ ప్రాజెక్టును దక్కించుకొంది. గల్వాన్‌ ఘటన తరవాత వాస్తవాధీన రేఖ వద్ద మారిన పరిస్థితులు ఈ కాంట్రాక్టుపై ప్రభావం చూపాయి. దానికితోడు జెన్హూవా సంస్థ పనుల్లో జాప్యం చేయడంతోపాటు, అమెరికా ఆంక్షల కారణంగా భవిష్యత్తులో ఏదైనా నష్టం వాటిల్లితే భారత్‌ పరిహారం చెల్లించేలా హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. చైనా సంస్థ గొంతెమ్మ కోర్కెలతో విసుగెత్తిన భారత్‌ గత సెప్టెంబర్‌లో ఈ కాంట్రాక్టును రద్దు చేసుకొంది.

ఫిన్లాండ్‌ సంస్థ 'కార్గోటెక్‌' కూడా రబ్బర్‌ టైర్లపై నడిచే క్రేన్లను సరఫరా చేసేందుకు ముందుకొచ్చి, ఆ తరవాత చేతులెత్తేసింది. అదే సమయంలో ఐపీజీ ఎండీ అరుణ్‌ కుమార్‌గుప్తా పదవీకాలం ముగియడంతో భారత షిప్పింగ్‌ సంస్థ ఎండీ హర్‌జీత్‌ కౌర్‌జోషీకి అదనపు బాధ్యతలు అప్పజెప్పి ఏడాదిపాటు నడిపించారు. భారత్‌ 2021లో ఇప్పటికే పలు విడతలుగా కొన్ని క్రేన్లను అక్కడకు తరలించింది. ఈ ఏడాది సెప్టెంబరులో కెప్టెన్‌ అలోక్‌ మిశ్రాకు ఐపీజీ ఎండీగా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినప్పటికీ, వాటిని స్వీకరించడానికి విముఖత వ్యక్తం చేసినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఇక నాలుగు క్రేన్ల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ గత సెప్టెంబరులో విడుదల చేసిన టెండర్ల తుది గడువును ఏడాది కాలంలో దాదాపు 20 సార్లు పొడిగించారు. తాజాగా ఆ గడువు నవంబరు 18తో మరోసారి ముగిసింది. ఇప్పుడు ఓడరేవు పనులు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నాయి. సరిపడా క్రేన్లు లేకపోవడంతో పదేళ్ల లీజు నిర్వహణ ఒప్పందం ఇంకా అమలులోకి రాలేదు. ప్రస్తుతానికి స్వల్పకాలిక ఒప్పందాలతో భారత్‌, ఇరాన్‌ పోర్టు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

భవిష్యత్తు అగమ్యగోచరం

అఫ్గానిస్థాన్‌ను అమెరికా వీడటంతో తాలిబన్లు అక్కడ అధికారం చేపట్టారు. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌లో అమెరికా ప్రయోజనాలు ఏమీలేవు. అంటే ఇప్పుడు 'చాబహార్‌ ప్రాజెక్టు' అమెరికాకు పెద్దగా ఉపయోగపడదు. ఈ పరిస్థితి చాబహార్‌ క్రేన్ల కాంట్రాక్టు టెండర్లలో పాల్గొనాలని భావించే కంపెనీలను ఆలోచనలో పడేస్తోంది. ఇరాన్‌లోని రైసీ సర్కారు వియన్నాలో అణు ఒప్పందం పునరుద్ధరణకు చర్చలు మొదలుపెట్టింది. ఇవి విఫలమైతే అమెరికా, మిత్రదేశాలు ఇరాన్‌పై మరింత ఒత్తిడిని పెంచే మార్గాలను అన్వేషిస్తాయి. మరోపక్క ఇరాన్‌ అణు కార్యక్రమం పురోగతి సాధించకుండా సైనిక చర్యకు సైతం దిగేందుకు ఇజ్రాయెల్‌ సన్నాహాలు చేసుకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వియన్నా చర్చల ఫలితాలపైనే చాబహార్‌ ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడిందన్నది కాదనలేని సత్యం.

రచయిత- ఫణికిరణ్‌

ఇదీ చూడండి:Cryptocurrency in India: క్రిప్టో కరెన్సీతో దేశార్థికానికి మేలెంత?

ABOUT THE AUTHOR

...view details