కేంద్ర ప్రభుత్వం సెస్సు విధింపు ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. పన్ను వసూళ్ల ద్వారా కేంద్రం సమీకరించిన ఆదాయ మొత్తాన్ని విభాజ్య నిధిగా వ్యవహరిస్తారు. ఆ నిధిలో రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఏ రాష్ట్రం వాటా ప్రకారం ఆ రాష్ట్రానికి ఈ నిధిని పంచి ఇవ్వాలి. మినహాయింపు ఏమిటంటే, సెస్సుల ద్వారా కేంద్రానికి సమకూరే పన్ను ఆదాయాన్ని ఈ నిధిలో కలపరు. రాజ్యాంగంలోని 270 అధికరణ ప్రకారం సెస్సు ఆదాయం పూర్తిగా కేంద్ర భోజ్యం. కాబట్టి సెస్సు వసూళ్లలో రాష్ట్రాలకు వాటా ఉండదు.
సెస్సు.. విమర్శ..
కొన్ని ప్రత్యేక అవసరాలు, కార్యక్రమాల పేరిట సెస్సును విధిస్తారు. వివిధ రకాల సెస్సుల రూపేణా అదనపు ఆదాయం సంపాదించడం.. కేంద్రానికి ఈ మధ్యకాలంలో పరిపాటైంది. పన్నుల రాబడిలో సెస్సులు, సర్‌ఛార్జీల వాటా గణనీయంగా పెరుగుతోంది. దీంతో, స్థూల పన్నుల రాబడి (గ్రాస్ ట్యాక్స్ రెవిన్యూస్- జీటీఆర్)లో తమ భాగం తరిగిపోతోందని 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్రాలు మొరపెట్టుకున్నాయి. సెస్సులు మరోవిధంగానూ విమర్శల పాలవుతున్నాయి. ఆరోగ్యం, విద్య, రహదారులు వంటి నిర్దేశిత ప్రజా ప్రయోజనాల కోసం వీటిని వెచ్చించడం లేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఎలా ఖర్చవుతున్నాయి?
వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) అమలుతో 17 రకాల సెస్సులు, ఇతర లెవీలు కనుమరుగైనా- మరో 35 లెవీలు ఇంకా కొనసాగుతున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక వెల్లడిస్తోంది. ఇలాంటి లెవీల ద్వారా 2018-19లో భారీ మొత్తంలో రూ.2.7 లక్షల కోట్ల రాబడి పోగుపడగా, నిర్దేశిత ప్రయోజనాలకు ఉద్దేశించిన రిజర్వు ఖాతాల్లోకి బదిలీ అయిన సొమ్ము కేవలం రూ.1.64 లక్షల కోట్లేనని 'కాగ్' గుర్తించింది. మిగిలిన 40శాతం నిధులను భారత ప్రభుత్వ సంచిత నిధికి జమ చేశారు.
ముడి చమురు మీద విధించిన సెస్సు ద్వారా రూ.1.25 లక్షల కోట్లు వసూలు చేసినా, ఒక్క పైసా కూడా చమురు పరిశ్రమ పరిశోధన అభివృద్ధి సంస్థలకు బదిలీ చేయలేదు. ఆరోగ్యం, విద్య పేరిట ఆదాయం పన్నుపై అయిదు శాతం సెస్సు విధించి సమీకరించిన నిధులను విద్య కోసం పాక్షికంగా కేటాయించినా, ఆరోగ్యం కోసం చిల్లిగవ్వ ఇవ్వలేదు. సామాజిక సంక్షేమం పేరిట వాణిజ్య సుంకాలపై విధించిన సర్‌ఛార్జీ సొమ్ముదీ ఇదే కథ. ఇలాంటి తీవ్రమైన లోటుపాట్లు ఏమరుపాటుగా చోటుచేసుకున్నాయంటే నమ్మడం కష్టం.
పుండు మీద కారం..
కేంద్రం ఉద్దేశపూర్వకంగానే సెస్సుల దారిలో ఆదాయం పెంచుకుంటోందనే వాదన ఉంది. పన్ను రాబడుల విభాజ్య నిధిలో రాష్ట్రాల వాటా 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. అయినప్పటికీ కేంద్ర పన్ను వసూళ్లలో రాష్ట్రాలకు వాస్తవంగా దక్కింది 35.7 శాతమే. 2016-17 నుంచి పన్నుల రాబడిలో సెస్సులు, సర్‌ఛార్జీల వాటా పెరగడమే ఇందుకు కారణం. 2013-14లో కేవలం ఆరు శాతం ఉన్న వీటి వాటా 2019-20 నాటికి 13శాతానికి చేరింది.
బడ్జెట్లో కొత్త సుంకాలు- ఏ వస్తువుపై ఎంత?
గ్రాంట్ ఇన్ ఎయిడ్..
జీఎస్‌టీ అమలు వల్ల రాష్ట్రాలు గణనీయంగా ఆదాయం నష్టపోతే దాన్ని భర్తీ చేయడానికి వసూలు చేసిన జీఎస్‌టీ సెస్సును దీనిలో కలపకుండానే- సెస్సుల రూపేణా ఇంతటి అదనపు రాబడి నమోదైంది. జీఎస్‌టీ సెస్సును సైతం కలిపి లెక్కకడితే- కేంద్ర పన్నుల ఆదాయంలో సెస్సులు, సర్‌ఛార్జీల వాటా 17.8శాతం అవుతుంది. ఇదంతా విభాజ్య నిధిలో చేరదు కనుక రాష్ట్రాలు తమకు దక్కాల్సినదానిలో ఎనిమిది శాతం వాటా కోల్పోయాయి. కేంద్రం అవలంబిస్తున్న ఈ వైఖరి రాష్ట్రాల నిత్య అసంతృప్తికి కారణమవుతోంది. దీనికితోడు, రూ.47,272 కోట్ల జీఎస్‌టీ పరిహార సెస్సు నిధులను 'గ్రాంట్ ఇన్ ఎయిడ్' కింద ఇవ్వడం రాష్ట్రాలకు పుండు మీద కారం చల్లినట్లయింది. జీఎస్‌టీ వచ్చిన తొలి రెండేళ్లకు ఈ సెస్సు నిధుల్లో వాటా పొందడం వాటి న్యాయబద్ధమైన హక్కు. దాన్ని కూడా కేంద్రం గుర్తించలేదు. ఇలాంటి ధోరణితో కేంద్రం- రాష్ట్రాల ఆర్థిక సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.