ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిశ్రామికీకరణ విధానాలతో దేశంలో అసంఘటిత రంగం విస్తరిస్తోంది. వ్యవసాయాధారితమైన భారత్‌లో అసంఘటిత రంగం సంప్రదాయ వృత్తులను వీడి ఆధునిక రంగాల వైపు మళ్ళుతోంది. దేశంలోని కోట్లాది శ్రామిక జనాభాలో దాదాపు 90శాతం అసంఘటిత రంగంలో ఉన్నట్లు నిపుణుల అంచనా. వీరి సంక్షేమానికి 2008లో అసంఘటిత రంగ (unorganised sector) కార్మిక సామాజిక భద్రతా చట్టాన్ని తెచ్చారు.
నేషనల్ శాంపిల్ సర్వే లెక్కల ప్రకారం కార్మిక శక్తిలో 88శాతానికి (47.29 కోట్ల మందికి) ఎలాంటి బీమా సౌకర్యం లేదు. వృద్ధాప్యంలో వీరికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కేంద్రం దశాబ్దం క్రితం స్వావలంబన పథకాన్ని ప్రవేశపెట్టింది. పలు కారణాల వల్ల అది విజయవంతంగా అమలు కాలేదు. దేశంలోని పేదలు, వెనకబడిన వర్గాల ప్రజలందరికీ సార్వత్రిక సామాజిక భద్రతా పథకాలు ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం 2015-16 బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రజలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు 2015లో అటల్ పింఛన్ పథకాన్ని(atal pension yojana) ప్రారంభించింది. అసంఘటిత రంగ కార్మికులకు, ఉద్యోగులకు వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపడమే దీని లక్ష్యం.
18-40 ఏళ్ల భారత పౌరులు ఏదైనా ప్రభుత్వ రంగ, ప్రైవేటు, ప్రాంతీయ సహకార బ్యాంకులు, తపాలా కార్యాలయాల ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్ విధానంలోనూ సభ్యులుగా చేరే అవకాశం కల్పిస్తున్నాయి. చందాదారుడు చెల్లించిన ప్రీమియం ఆధారంగా అరవైఏళ్లు నిండిన తరవాత నెలకు కనీసం వెయ్యి రూపాయల నుంచి అయిదు వేల రూపాయల వరకు పింఛను లభించే అవకాశం ఉంది. చందాదారుడు మరణిస్తే నామినీకి రూ.1.7లక్షల నుంచి రూ.8.5లక్షల వరకు నగదు లభించే అవకాశం ఉంది.
సమన్వయంతో మెరుగైన ఫలితాలు
అటల్ పింఛన్ పథకంలో ఇప్పటివరకు మూడు కోట్లమంది చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా బ్యాంకుల్లో, ఒకలక్షా 45వేల తపాలా కార్యాలయాల్లో ఈ పథకం అమలవుతోంది. గ్రామాల్లోని కార్మికులు గతంలో పలు సంప్రదాయ వృత్తుల్లో ఉండేవారు. కులవృత్తులు దాదాపు కనుమరుగు కావడంతో చాలామంది పట్టణాలకు వలస వెళ్తున్నారు. గ్రామాల్లో కంటే పట్టణాల్లో అసంఘటిత రంగ కార్మికులు విభిన్నమైన పనులు చేస్తూ వివిధ వర్గాలుగా వేరుపడి ఉన్నారు. చాలా మంది పని దొరికే చోటనే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. వీరిని గుర్తించడం అంత తేలిక కాదు. వీరందరినీ సమీకరించి పథకం ఆవశ్యకతను తెలియజెప్పడానికి ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపట్టాలి. ఇందుకోసం తగిన యంత్రాంగాన్ని రూపొందించాలి.