నిఘానేత్ర సంపన్నుడైన సార్వభౌముడు సుదూర దృశ్యాలనూ దర్శించగలడన్నది చాణక్యుడి హెచ్చరిక! సాంకేతిక శక్తియుక్తుల దన్నుతో ప్రజాస్వామ్య యుగంలో ఆచారచక్షువుల సామర్థ్యమింకా తీక్షణమైందని 'ప్రాజెక్టు పెగాసస్' ప్రకంపనలు రుజువు చేస్తున్నాయి. అత్యున్నత న్యాయస్థానంలోని ప్రస్తుత న్యాయమూర్తితో సహా ప్రముఖ రాజకీయ నాయకులు, అధికారులు, పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తలు, దౌత్యవేత్తలు, వ్యాపారవేత్తల ఫోన్లలోకి పెగాసస్ స్పైవేర్‌ను చడీచప్పుడు లేకుండా చొప్పించారన్న పరిశోధనాత్మక కథనాలు పార్లమెంటు సమావేశాలను పట్టి కుదిపేస్తున్నాయి. నేర, ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి ప్రభుత్వాలకు మాత్రమే ఆ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తున్నామని పెగాసస్ ఇజ్రాయెలీ మాతృసంస్థ ఎన్‌ఎస్‌ఓ ఒకవైపు స్పష్టీకరిస్తోంది.
సంబంధం లేదు..
రేగిన రగడతో తనకేమీ సంబంధం లేదని మరోవైపు కేంద్రం నమ్మబలుకుతోంది. ఈ వాదోపవాదాల నడుమ నిఘా నూటికి నూరుపాళ్లు నిజమేనంటున్న పరిశోధకుల ఫోరెన్సిక్ సాక్ష్యాలు కొట్టిపారేయలేనివి! నాలుగేళ్ల క్రితం ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీ పర్యటించి వచ్చిన కొద్దిరోజుల్లోనే పెగాసస్ గూఢచర్యం ప్రారంభమైందంటున్న ఫ్రాన్స్ పత్రిక లీ మాండె విశ్లేషణ విస్మయపరుస్తోంది! వాట్సాప్ ద్వారా ఫోన్లలో సులువుగా చొరబడుతోందంటూ రెండేళ్ల కిందటే పెగాసస్‌పై గగ్గోలు రేగింది. ఆ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ఏమైనా ఉపయోగిస్తోందా అన్న ఎంపీ దయానిధి మారన్ సూటిప్రశ్నకు అప్పట్లో లోక్‌సభలో స్పష్టమైన సమాచారమివ్వని కేంద్రం- అత్యవసర సందర్భాల్లో అధీకృత సంస్థలు దేనిపైనైనా నిఘా పెట్టవచ్చని బదులిచ్చింది! ఆ తరవాత అదే పెగాసస్‌పై మరో ప్రశ్నకు సమాధానంగా భారతీయుల వ్యక్తిగత గోప్యతా హక్కును సంరక్షించి తీరతామంది.
ఏడేళ్ల క్రితమే వెలుగులోకి..
పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు నిర్వచించిన వ్యక్తిగత గోప్యతకు విలువదక్కని విపరీత పరిణామాలతో దేశం తరచూ నివ్వెరపాటుకు గురవుతూనే ఉంది. నెలకు సగటున తొమ్మిది వేల వరకు ఫోన్ల ట్యాపింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తోందని ఏడేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చింది. మన్మోహన్ ఏలుబడిలో జాతీయ నేతల ఫోన్లకు దొంగ చెవులు మొలిచిన విషయం బయటికొచ్చినప్పుడు సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష హోదాలో భాజపా పట్టుపట్టింది. అంతకు పదింతలు తీవ్రమైన ప్రస్తుత వివాదంపై అత్యున్నత స్థాయి విచారణకు అధికార పక్షం స్వచ్ఛందంగా ఆదేశిస్తేనే నిజానిజాలేమిటో లోకానికి వెల్లడవుతాయి.
సమాచార వ్యవస్థకు రూపకల్పన
దేశ భద్రత పేరిట పౌరులపై నిర్నిరోధ నిఘా అధికారాలను చలాయించడానికి భారతీయ టెలీగ్రాఫ్ చట్టంతో పాటు ఐటీ చట్టంలోని నిబంధనలు పాలకులకు అక్కరకొస్తున్నాయి. వలస పాలనాకాల అవశేషమైన టెలీగ్రాఫ్ చట్టంలో తగిన సవరణలు చేస్తామన్న మూడు దశాబ్దాల నాటి కేంద్రం మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. పౌరుల వ్యక్తిగత గోప్యతా హక్కుకు మన్నన దక్కాలంటే సమాచార సంరక్షణ వ్యవస్థకు సర్కారు రూపకల్పన చేయాల్సి ఉందన్న జస్టిస్ శ్రీకృష్ణ సంఘం మేలిమి సూచనలూ ఆచరణలోకి రాలేదు. వ్యక్తిగత సమాచార సంరక్షణే లక్ష్యంగా 2019లో మోదీ సర్కారు తెచ్చిన బిల్లు ఇంకా చట్టరూపం దాల్చలేదు. ఆ బిల్లులోనూ లోపాలున్నాయంటున్న నిపుణులు- నిబంధనల నుంచి ప్రభుత్వ సంస్థలకు గంపగుత్తగా మినహాయింపులు దఖలుపరచడం దేశవాసులకు శ్రేయస్కరం కాదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతులిచ్చే ప్రక్రియను మొత్తంగా సంస్కరిస్తే తప్ప పౌరుల ఆంతరంగిక స్వేచ్ఛకు రక్షణ లభించదని సూచిస్తున్నారు. గోప్యతా హక్కును హరించే గూఢచర్య ఉపకరణాల వినియోగాన్ని తక్షణం అరికట్టాలని ఐరాస మానవహక్కుల హైకమిషనర్ తాజాగా పిలుపిచ్చారు. ఇండియాలో అక్రమ నిఘాకు అవకాశమే లేదంటున్న కేంద్రం- ప్రాజెక్టు పెగాసస్ లేవనెత్తుతోన్న ప్రశ్నలన్నింటికీ సూటిగా, స్పష్టంగా బదులివ్వాలి. పౌరహక్కులకు మంటపెట్టే పెడపోకడలు సమసిపోయేలా పటిష్ఠ వ్యక్తిగత సమాచార సంరక్షణ చట్టాన్ని సత్వరం పట్టాలెక్కించాలి!