భారత్‌తో పాటు యావత్ ప్రపంచ ఆర్థికాన్ని కొవిడ్ సంక్షోభం దెబ్బతీసింది. ఈ గడ్డుకాలం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను చేపట్టినా, వాటిని ఉపసంహరించిన తరవాత కొన్నేళ్ల వరకు డబ్బుకు కటకట ఏర్పడి తీరుతుంది. దీన్ని అధిగమించడానికి కేంద్రం, రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని పెంచి ఆర్థిక రంగాన్ని పునరుత్తేజితం చేయాలి.
ఇప్పటికే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఎడాపెడా అప్పులు చేసేసిన రాష్ట్రాల వద్ద పెట్టుబడులు పెట్టడానికి డబ్బు లేదు. అందువల్ల బాధ్యతనంతా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ప్రజారోగ్యం, మౌలిక వసతుల నిర్మాణంపై భారీగా పెట్టుబడులు పెడితే, రాగల కొన్నేళ్లలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే మనల్ని వదిలిపోయేలా లేదు కాబట్టి- ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేయడానికి పెట్టుబడులు పెంచడం అవసరమే కాక అనివార్యంగా భావించాలి. మౌలిక వసతుల కల్పన వ్యయం దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయిస్తుంది. ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టినప్పుడు ప్రైవేటు రంగం సైతం అదనపు విలువ జోడింపునకు పెట్టుబడులతో ముందుకొస్తుంది.
అధ్వానంగా సేవలు
ప్రజలు ఆరోగ్యవంతులైనప్పుడు వారి పని సామర్థ్యం, ఉత్పాదక సత్తా పెరిగి మన ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ విపణిలో పెద్ద వాటా కోసం పోటీ పడగలుగుతుంది. ప్రభుత్వమే తమ ఆరోగ్య సంరక్షణకు భరోసా ఇచ్చినప్పుడు ప్రజలు వస్తుసేవలపై ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు. దానివల్ల గిరాకీ, ఉత్పత్తి పెరిగి ఉపాధి అవకాశాలు విజృంభిస్తాయి. ఆరోగ్య రంగంలో ఖర్చుపెట్టే ప్రతి ఒక్క రూపాయికి నాలుగు రెట్లకు పైగా ప్రయోజనం సిద్ధిస్తుందని ఐరోపాలో జరిగిన అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ప్రజల ఆయుఃప్రమాణం ఒక్క సంవత్సరం పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధి రేటు నాలుగు శాతం మేర పుంజుకొంటుందని ఇతర అధ్యయనాలు వెల్లడించాయి.
అద్భుత ఆరోగ్య సంరక్షణ యంత్రాంగాలను సమకూర్చుకున్న ఐరోపా సమాఖ్య(ఈయూ)లోని దేశాల్లో మొత్తం ఉద్యోగాల్లో 11శాతం ఆరోగ్య, సామాజిక సేవల రంగాల్లోనే లభిస్తున్నాయి. భారత్‌కు వచ్చేసరికి ఈ ఉద్యోగాలు ఒక శాతం కన్నా తక్కువే. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కొంత మెరుగుపడినా, కొవిడ్ దెబ్బకు అందులోని లొసుగులు బయటపడ్డాయి. పెద్ద దేశాల్లో ఆరోగ్యంపై జీడీపీలో అతి తక్కువ (1.25) శాతం ఖర్చు పెడుతున్న దేశం భారత్ ఒక్కటే. ప్రజారోగ్యంపై భారత్ కన్నా భూటాన్ (2.5శాతం), శ్రీలంక (1.6శాతం) ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. 2025కల్లా జీడీపీలో 2.5శాతాన్ని ప్రజారోగ్యంపై వెచ్చించాలని ప్రభుత్వం లక్షిస్తోంది. అంతకన్నా ఎక్కువ పెంచాల్సిన అవసరం ఉందని కొవిడ్ గుర్తుచేస్తోంది. మన గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రులు ఎంత దారుణంగా ఉన్నాయో కొవిడ్ కళ్లకు కట్టింది.
మన జనాభాకు అవసరమైనన్ని ఆస్పత్రులు లేకపోవడమే కాదు, సిబ్బంది కొరతా పీడిస్తోంది. అసలు కొవిడ్ విరుచుకుపడటానికి ముందే, 2019నాటి ప్రభుత్వ గణాంకాలను బట్టి ఉప కేంద్రాల్లో సుశిక్షిత వైద్య సిబ్బంది కొరత 12శాతం; ప్రాథమిక ఆరోగ్య కేందాల్లో 21శాతం, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 18శాతం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం- ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. కానీ, భారత్‌లో ప్రతి 1,511 మంది జనాభాకు ఒక వైద్యుడే ఉన్నారు. ప్రతి 300 మంది జనాభాకు ఒక నర్సు అవసరమైతే, భారత్‌లో 670 మందికి ఒక నర్సు చొప్పున ఉన్నారు. భారత్‌లో మొత్తం 11.6 లక్షల మంది వైద్యులు ఉంటే, వారిలో తొమ్మిది లక్షల మంది మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. కొవిడ్ కాలంలో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంటే, దానికి తగ్గ సంఖ్యలో వైద్యులు, నర్సులు లేకపోవడం మన ఆరోగ్య యంత్రాంగ దుస్థితిని బయట పెడుతోంది. అందరికీ సక్రమంగా ఆరోగ్య సేవలు అందాలంటే వైద్యులు, నర్సుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగాలి.