పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాలు, ప్రాంతాల పరిధిలో అత్యవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఉద్దేశించింది ఎంపీలాడ్ (పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి) పథకం. 1993లో పీవీ నరసింహారావు భారత ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసింది. మొదట్లో ప్రతి సభ్యుడికి ఏటా కోటి రూపాయల చొప్పున కేటాయించేవారు. తరవాత దాన్ని రెండు కోట్ల రూపాయలకు, అనంతరం అయిదు కోట్లకు పెంచారు.
గతేడాది ఏప్రిల్‌లో కొవిడ్ విజృభించిన సమయంలో ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ఎంపీలాడ్స్ నిధులను కేంద్రం రెండేళ్ల పాటు నిలుపుదల చేసింది. వాటిని కేంద్ర ఆర్థిక శాఖకు మళ్లించారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న తరుణంలో ఎంపీలాడ్ పథకాన్ని కేంద్రం పునరుద్ధరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంతో పాటు, 2025-26 వరకు దీన్ని కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
నిబంధనలకు విరుద్ధంగా...
పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాల్లో దీర్ఘకాలిక ఆస్తులు (డ్యూరబుల్ అసెట్స్)ను ఏర్పరచేందుకు ఎంపీలాడ్ పథకాన్ని నిర్దేశించారు. లోక్‌సభ సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో, రాజ్యసభ సభ్యులైతే తాము ఎన్నికైన రాష్ట్రంలోని ఏదైనా జిల్లాలో, నామినేటెడ్ సభ్యులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఈ నిధులను వినియోగించవచ్చు. కేంద్ర స్థాయిలో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర స్థాయిలో కలెక్టర్ కార్యాలయం నోడల్ శాఖగా వ్యవహరిస్తుంది. ఈ పథకం కింద తన నియోజకవర్గంలో నిర్ణీత పనులు చేపట్టాలని కలెక్టర్‌కు ఎంపీలు సూచిస్తారు.
దేశంలోని 790 మంది ఎంపీలకు ఏటా అయిదు కోట్ల రూపాయల చొప్పున రూ.3,950 కోట్ల నిధులు కేటాయిస్తారు. ప్రజలకు అత్యవసరమైన తాగునీరు, విద్య, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, రహదారులు తదితర మౌలిక వసతులను కల్పించి, దీర్ఘకాలం పాటు వాటి ద్వారా ప్రజలు ప్రయోజనం పొందేలా చూడటం ఎంపీలాడ్స్ లక్ష్యం. స్థానిక ప్రభుత్వాలు పెద్దగా దృష్టిసారించని సమస్యలను పరిష్కరించడానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ అభివృద్ధి పనుల వల్ల స్థానికంగా పలువురికి ఉపాధి సైతం దొరుకుతుంది. అందుకే గతేడాది ఎంపీలాడ్స్‌ను నిలిపివేయడాన్ని విపక్షాలు నిరసించాయి. ఇవి ఏటా పూర్తిస్థాయిలో వినియోగం కాకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా వినియోగించడంపై ఎన్నో విమర్శలున్నాయి.