తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వత్తీచమురూ లేని ఉద్దీపన ప్యాకేజీ - ఉద్దీపన ప్యాకేజీ సెకండ్​ వేవ్​

కేంద్ర ప్రభుత్వ నూతన ప్యాకేజీ చూపులకు ఏపుగా ఉన్నప్పటికీ, ఆర్థిక సంవత్సరం పొడుగునా సర్కారీ అదనపు వ్యయం రూ.60వేలకోట్లకు మించే అవకాశం లేనేలేదన్నది నిపుణుల విశ్లేషణ. ఈ ప్యాకేజీ నికర ప్రయోజనం జీడీపీలో కేవలం 0.3శాతానికి పరిమితం కానుండగా- సింహభాగం రుణ హామీలదేనంటే, ఉద్దీపన అరకొరే అని పేర్కొంటున్నారు. ఉపాధికి ఊతమిచ్చేలా సమగ్ర వాస్తవిక ఉద్దీపన ఒక్కటే ప్రస్తుత స్థితిలో సరైనదని సూచిస్తున్నారు.

opinion on stimulus package second wave, second wave stimulus package
వత్తీచమురూ లేని ఉద్దీపన ప్యాకేజీ

By

Published : Jun 30, 2021, 8:27 AM IST

కరోనా మహమ్మారి కర్కశ ముష్టిఘాతాలకు సొమ్మసిల్లిన దేశ ఆర్థిక సామాజిక ఆరోగ్య రంగాలకు ఉపశమనం ప్రసాదించడమే లక్ష్యమంటూ కేంద్రప్రభుత్వం తాజాగా మరో భారీ ప్యాకేజీ ఆవిష్కరించింది. పాత కొత్త పథకాల కదంబమైన సరికొత్త ఉద్దీపన చర్యల విలువ విత్తమంత్రి వివరణలో రూ.6.28 లక్షల కోట్లుగా లెక్కతేలింది. పదిహేను విభాగాల్ని సాంత్వనపరచే పేరిట తలపెట్టిన కసరత్తులో 90 శాతానికి పైగా- రెండు కీలక పద్దులదే. మొదటిది, ప్రభుత్వ గ్యారంటీలుగా ఇవ్వజూపిన రూ.2,67,500కోట్లు. చతికిలపడిన విద్యుత్‌ పంపిణీ రంగాన సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల మేర ప్రతిపాదించిన సంస్కరణల ఖాతా రెండోది. అయిదేళ్ల కాలావధిలో పట్టాలకు ఎక్కిస్తామంటున్న విద్యుత్‌ సంస్కరణల ద్వారా- కొవిడ్‌ సంక్షోభంతో చితికిపోయిన కీలక రంగాలు, కోట్లాది శ్రమజీవుల బతుకులు ఎలా తెప్పరిల్లేదీ అమాత్యులు వివరించలేదు!

కేంద్ర ప్రభుత్వ నూతన ప్యాకేజీ చూపులకు ఏపుగా ఉన్నప్పటికీ, ఆర్థిక సంవత్సరం పొడుగునా సర్కారీ అదనపు వ్యయం రూ.60వేలకోట్లకు మించే అవకాశం లేనేలేదన్నది నిపుణుల విశ్లేషణ. వెరసి, ఈ ప్యాకేజీ నికర ప్రయోజనం జీడీపీలో కేవలం 0.3శాతానికి పరిమితం కానుండగా- సింహభాగం రుణ హామీలదేనంటే, ఉద్దీపన అరకొరేనన్నమాట! నిరుడు మే నెల రెండోవారంలో ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన యోజన రూపేణా అంతిమంగా కలిగిన ప్రయోజనం అంతంతమాత్రమేనని పలు అధ్యయనాలు, విశ్లేషణలు నిగ్గుతేల్చాయి. పోయిన ఏడాదితో పోలిస్తే బ్యాంకు రుణాల్లో పెరుగుదల కేవలం 5.7 శాతమేనని గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. అటువంటిదిప్పుడు అత్యవసర రుణహామీ పథకం కింద నిరుటి మూడు లక్షల కోట్లరూపాయల పరిమితిని ఇంకో లక్షన్నర కోట్ల రూపాయల మేర విస్తరించినా- బ్యాంకుల రుణ వితరణ మెరుగుపడనిదే కరోనా బాధిత వర్గాలు గట్టేక్కేదెలా? అసంఖ్యాక సంక్షుభిత జీవితాలు అంకెల గిమ్మిక్కులతో అమాంతం బాగుపడిపోవు!

నిరాశపరచిన గరీబ్​ కల్యాణ్​..

గత సంవత్సరం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన కొన్నాళ్లకే వెలుగు చూసిన 'పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన'- ప్రభుత్వ ఉదార సాయం కోసం ఆశగా నిరీక్షించిన ఎందరినో నిరాశపరచింది. తదుపరి ఆర్థిక ఉద్దీపన ఏ తీరుగా ఉండాలన్నదానిపై ఫిక్కీ, అసోచామ్‌ వంటి వాణిజ్య సంఘాలతో పాటు ప్రముఖ ఆర్థికవేత్తలూ మేలిమి సూచనలెన్నో చేసినా అదంతా అరణ్యరోదనమైంది. కరోనా కారణంగా దేశంలో వినియోగ గిరాకీ తెగ్గోసుకుపోయిందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహేతుకంగా విశ్లేషించింది. గిరాకీ తిరిగి ఊపందుకుంటేనే ఆర్థిక, పారిశ్రామిక రంగాలు కోలుకుంటాయంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ సైతం ఆ వాదనకే గట్టిగా ఓటేసింది. గిరాకీ పెరగాలంటే ప్రజల చేతుల్లో నగదు ఉండాలి. కనుకనే అర్హులైన పేదలకు ప్రభుత్వ ప్రత్యక్ష నగదు బదిలీపై సిఫార్సులు జోరెత్తాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని, పట్టణ ప్రాంతాలకూ దాన్ని విస్తరింపజేయాలని, కొన్నాళ్లపాటు జీఎస్‌టీ రేట్లు తగ్గించాలని.. సూచనలెన్నో వచ్చాయి.

చిన్న పట్టణాల్లో మౌలిక వసతులూ సేవల మెరుగుదలను లక్షించి జాతీయ స్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని పట్టాలకు ఎక్కిస్తే, కోట్లాది జీవన దీపాలు వెలుగుతాయి. వ్యక్తిగత ఆదాయాలు పెరిగేలా ఉపాధి, ఉద్యోగితల్ని గాడిన పెట్టాల్సింది పోయి- టూరిస్ట్‌ గైడ్లు మొదలు లఘు పరిశ్రమల వరకు రుణ హామీలకు ప్యాకేజీలో విశేష ప్రాముఖ్యమివ్వడం విస్మయపరుస్తోంది. కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న రంగాలకు చేయూత, రైతులకు రెట్టింపు రాబడి, ఎగుమతులకు ప్రోత్సాహం తదితరాల్ని వల్లెవేస్తూ- పుండు ఒకచోట లేపనం ఒకచోట చందంగా మరో ఉద్దీపననూ ముక్తాయించేశారు. ఉపాధికి ఊతమిచ్చేలా సమగ్ర వాస్తవిక ఉద్దీపన ఒక్కటే ప్రస్తుత స్థితిలో సరైన మందు!

ఇదీ చదవండి :మారిన యుద్ధతంత్రం- భారత్​ అందిపుచ్చుకునేనా?

ABOUT THE AUTHOR

...view details