ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్‌సీ) వేదికపై ప్రధాని మోదీ మాటల్లో 'డిజిటల్ భారత్' మహాస్వప్నం సరికొత్తగా ఆవిష్కృతమైంది. ఆయన చెప్పినట్లు- కోట్లాది ప్రజానీకాన్ని సాధికారత వైపు నడిపించడానికి, భవిష్యత్తులో సాంకేతికంగా అందరికంటే మనం ఒక అడుగు ముందుండటానికి.. దేశంలో అయిదోతరం (5జీ) నెట్‌వర్క్ సేవలు చురుగ్గా సాకారం కావాలి. దేశీయ స్థితిగతులు అందుకు తగ్గట్లు ఉన్నాయా? ప్రస్తుత అంతర్జాల వినియోగదారుల్లో యాభైశాతం గత నాలుగేళ్లలో చేరినవారేనని, ఆ జాబితాలో సగం మంది గ్రామీణులేనన్న గణాంకాలు- ఇంటర్‌నెట్ విస్తృతి వేగాన్ని కళ్లకు కడుతున్న మాట వాస్తవం.
అందరికీ బ్రాడ్‌బ్యాండ్
రాబోయే మూడేళ్లలో దేశంలోని అన్ని గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ అనుసంధానత చేకూరేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు ప్రధానమంత్రి చెబుతున్నారు. వాస్తవానికి, 2022నాటికి అందరికీ బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాల్ని కల్పించడమే లక్ష్యమన్న నినాదం కొన్నేళ్లుగా మార్మోగుతోంది. ఆ గడువును ఇప్పుడు మరో ఏడాది పొడిగించినట్లు బోధపడుతూనే ఉంది! ఒకవైపు 5జీ ఆకాంక్షలు మోతెక్కుతున్నా, ఇండియాలో సుమారు 30కోట్ల మంది ఇంకా 2జీ శకంలోనే ఉన్నారన్నది ‘రిలయన్స్’ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా చెప్పిన లెక్క. అటువంటి కోట్ల మందికి స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తేనే వారంతా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కాగలిగేది. అందుకే టెలికాం ఉత్పత్తుల తయారీకి ముఖ్యకేంద్రంగా భారత్ అవతరించాలంటున్న ప్రధాని, ఇక్కడ డిజిటల్ వ్యవస్థకు ఉన్నన్ని అవకాశాలు మరెక్కడా లేవని స్పష్టీకరిస్తున్నారు. ఆ ధీమా అక్షర సత్యమై పెట్టుబడులు వెల్లువెత్తాలన్నా, 5జీ వైపు ప్రస్థానం వేగం పుంజుకోవాలన్నా- కీలక మౌలికాంశాలైన అంతర్జాల వేగం, భద్రతలకు ప్రభుత్వ అజెండాలో అగ్ర ప్రాధాన్యం దక్కాలి! కరోనా మహమ్మారి నగదు చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసిన దరిమిలా- 2030 సంవత్సరం నాటికి భారత్‌లో కార్డులు, డిజిటల్ లావాదేవీల పరిమాణం సుమారు రూ.65 లక్షల కోట్లకు చేరనుందని ‘యాక్సెంచర్’ నివేదిక ఇటీవలే మదింపు వేసింది. వ్యవస్థాగత సన్నద్ధత అందుకు తగ్గట్లు ఉందా అన్నది గడ్డు ప్రశ్న. పోను పోను డిజిటల్ లావాదేవీల ఉద్ధృతిని వెన్నంటి సైబర్ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను ముందుగానే ఊహించి 18ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్ సకల విధాల సంసిద్ధమైంది.