ఫలానా సంస్థలు సహకరించడం లేదని దేశ సర్వోన్నత న్యాయాధీశులే వాపోవడం కన్నా వైపరీత్యం ఇంకేముంటుంది? న్యాయమూర్తులపై భౌతిక దాడులు, మానసిక వేధింపులు, దుర్భాషలు పెచ్చరిల్లుతున్నా కట్టడి చేసే నాథుడు కొరవడ్డాడని సుప్రీంకోర్టు సారథే ఆవేదనాభరితంగా స్పందించాల్సిన దుస్థితి దాపురిస్తే- సామాన్య పౌరులకిక దిక్కేమిటి? ఒక జడ్జి ప్రాణాల్ని తోడేసిన పాశవిక దాడితోపాటు దేశవ్యాప్తంగా న్యాయాధికారులు ఎదుర్కొంటున్న బెదిరింపులపై విచారణలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ వ్యాఖ్యలు ఆలోచనాపరులందర్నీ పట్టి కుదిపేస్తాయి. ఆ వైనమేమిటో మీరే పరికించండి..
'అంతటితో అయిపోయిందా?'
పది రోజులక్రితం ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో రోడ్డుపై ఒక పక్కగా జాగింగ్ చేసుకుంటూ వెళ్తున్న అదనపు సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ మీదకు దుండగులు ఆటో తోలి బహిరంగంగా కడతేర్చిన కిరాతక ఘటన దేశమంతటా ప్రకంపనలు పుట్టించింది. ఎందరినో తీవ్రంగా కలచివేసింది. ఆ అమానుష హత్యాకాండ లోతుపాతులు వెలికితీసేందుకంటూ ఝార్ఖండ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒకదాన్ని నెలకొల్పింది. దానిపై ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రాజీవ్‌రంజన్ వివరణ ప్రకారం- ప్రభుత్వ సిఫార్సు మేరకు కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (కేదస- సీబీఐ) చేపట్టింది. 'అంతటితో ఝార్ఖండ్ సర్కారు చేతులు దులిపేసుకుందన్న మాట!' అన్న సీజేఐ రమణ వ్యాఖ్యల్లో సీబీఐ పనితనం, కార్యసరళి పట్ల అపనమ్మకం ప్రస్ఫుటం కావడంలో వింతేమీ లేదు. ఏ కేసులోనైనా అనుకూల ఉత్తర్వులు వెలువడకపోతే న్యాయమూర్తులపై బురదజల్లే కొత్త పోకడలు పుట్టుకొస్తున్న దేశంలో- సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు, చరవాణుల్లో సంక్షిప్త సందేశాలు, వాట్సాప్‌లో బెదిరింపులు సైతం జోరెత్తుతున్నాయి. ఒకటి రెండు సందర్భాల్లో కేదస దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించి ఏడాది దాటినా ఎక్కడా కదులూ మెదులూ లేదన్న గౌరవ న్యాయమూర్తి సూటి ఆక్షేపణ- సీబీఐ వక్రరీతి పని పోకడలకు నిలువెత్తు దాఖలా.
ఆల్ ఫూల్స్ డే (ఏప్రిల్ 1)నాడు 1963లో కన్నుతెరిచిన కేదస- పరిశ్రమ, నిష్పక్షపాతం, నిజాయతీలే స్వీయ మార్గదర్శక సూత్రాలని ఘనంగా చాటుకుంటుంది. వాస్తవంలో అది కేంద్ర పాలక పక్షం పంజరంలో చిలుకలా మారిందని పాతికేళ్ల క్రితమే జైన్ హవాలా కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గట్టిగా తలంటేసింది. దానికి కార్యనిర్వాహక స్వేచ్ఛ కల్పిస్తూనే జవాబుదారీతనం మప్పే కీలక ఆదేశాల్నీ అప్పట్లో వెలువరించింది. రాజకీయ జోక్యానికి తావన్నదే లేని పటిష్ఠ దర్యాప్తు సంస్థగా కేదస నిలదొక్కుకోవాలన్న 'సుప్రీం' స్ఫూర్తికి ఇన్నేళ్లుగా తూట్లు పడుతూనే ఉన్నాయి. 'సీబీఐ నడతలో మార్పు రాలేదు.. ఏమీ చేయడంలేదు' అన్న సీజేఐ ఘాటు వ్యాఖ్యల అంతరార్థమదే!
ఒత్తిళ్లు దర్యాప్తు
అత్యున్నత స్థాయి రాజకీయ ఒత్తిళ్లు దర్యాప్తు సంస్థల వ్యవహారశైలిని ప్రభావితం చేసిన ఉదంతాలెన్నో లోగడ వెలుగుచూశాయి. ఆ వరస, ఒరవడి మారనే లేదని అడపాదడపా రుజువవుతూనే ఉంది. దర్యాప్తులో ఎవరి ఒత్తిళ్లకూ లొంగవద్దని, ఏ పరిస్థితిలోనైనా విధిద్రోహానికి పాల్పడవద్దని సుప్రీంకోర్టే నేరుగా కేదస సంచాలకులకు ఉద్బోధించిన సందర్భాలున్నాయి. ఆ హితవాక్యం అరణ్యరోదనమై- చెవిటివాడి ముందు శంఖం ఊదిన సామెతనే స్ఫురింపజేస్తోంది. వివిధ కేసుల విచారణలో నేర పరిశోధక సంస్థపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవనడం మూర్ఖత్వమేనని కేదస మాజీ సారథి విజయరామారావు ప్రభృతులు చెప్పింది నికార్సయిన నిజమేనని లెక్కకు మిక్కిలి సార్లు నిరూపితమవుతూనే ఉంది. కేంద్రంలో చక్రం తిప్పుతున్నవారి పెంపుడు జాగిలంగా భ్రష్టుపట్టిన సీబీఐ, న్యాయమూర్తులపై దాడుల అంశాన్ని కొన్నాళ్లుగా పెడచెవిన పెట్టడంలోని అంతరార్థమేమిటి? అదిలిస్తే తప్ప కదలని మందకొడితనమే స్వాభావిక లక్షణంగా స్థిరపడితే- 'ప్రతిష్ఠాత్మక సంస్థ' సమూల ప్రక్షాళనే శరణ్యం.