తెలంగాణ

telangana

ETV Bharat / opinion

టీకా కోసం నిన్న సంకోచం.. నేడు ఆందోళన! - దేశంలో వ్యాక్సిన్ పంపిణీ

కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశ ప్రజలు విలవిల్లాడుతున్నారు. మహమ్మారి ముప్పు బారినపడకుండా ఉండేందుకు టీకా వేయించుకోడం పెద్ద ప్రయాసలా మారింది. ఈ క్రమంలో మధ్య తరగతి ప్రజల ప్రస్థానం తొలుత టీకా సంకోచం నుంచి చివరికి నిరాశ నిస్పృహల్లోకి వెళుతోంది. దేశంలో సుమారు 30 నుంచి 35 కోట్లదాకా ఉన్న మధ్య తరగతి ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానంపైనా, సమాచారం మార్పిడిపైనా అవగాహన బాగానే ఉన్నా- అకస్మాత్తుగా విరుచుకుపడిన సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో సంసిద్ధత కొరవడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే వ్యాక్సిన్ల సరఫరాను పెంచి పౌరుల్లో స్థైర్యాన్ని పాదుగొల్పాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితి తేటతెల్లం చేస్తోంది.

People, Corona vaccination
ప్రజలు, కరోనా వ్యాక్సినేషన్​, కొవిడ్​ టీకా

By

Published : May 21, 2021, 7:59 AM IST

కొవిడ్‌ రెండో ఉద్ధృతి నుంచి కాపాడుకొనేందుకు టీకాలు వేయించుకోవడం పెద్ద ప్రయాసలా మారింది. ఈ క్రమంలో మధ్యతరగతి ప్రజల ప్రస్థానం మొదట్లో టీకా సంకోచం నుంచి చివరికి నిరాశా నిస్పృహల్లోకి కూరుకుపోయేదాకా సాగింది. కరోనా కొత్త వేరియంట్‌తో దేశవ్యాప్తంగా రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలల్లో మరణాలు తప్పడం లేదు. మనదేశంలో సుమారు 30 నుంచి 35 కోట్లదాకా ఉన్న మధ్యతరగతి ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానంపైనా, సమాచారం మార్పిడిపైనా అవగాహన బాగానే ఉన్నా- అకస్మాత్తుగా విరుచుకుపడిన సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో సంసిద్ధత కొరవడింది. వైరస్‌ వ్యాప్తిని ముందస్తుగా ఊహించి.. తమకు రక్షణ ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. ఫలితంగా.. భారతీయ నగరాలన్నింటినీ చుట్టుముట్టి వేల ప్రాణాలు బలిగొన్న వైరస్‌ ఇప్పుడు గ్రామీణ భారతంపైనా కోర సాచింది.

దేశవ్యాప్తంగా కొరత

దేశంలో టీకాలను మార్చి ఒకటి నుంచి వృద్ధుల కోసం ప్రారంభించినప్పుడు, ఏప్రిల్‌ ఒకటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికోసం మొదలు పెట్టినప్పుడు ఆయా వయసువారు వ్యాక్సిన్‌పై పెద్దగా సుముఖత చూపలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొవిన్‌ పోర్టల్‌లో టీకాల కోసం స్లాట్‌లు బుక్‌ చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. కొంతమంది టీకాలు వేయించుకోవడానికి నేరుగా నిర్దేశిత కేంద్రాలకే వెళ్తున్నారు. టీకా నిల్వలు లేవనే తిరస్కారాలు తప్పటం లేదు. ఫలితంగా అష్టకష్టాలు పడి టీకా కేంద్రాలకు చేరినవారి శ్రమ వృథాప్రయాసగా మారుతోంది. మధ్యతరగతి మహాభారతం ఎదుర్కొంటున్న టీకా తిప్పల్లో ఇలాంటి ఉదంతాలెన్నో ఉన్నాయి.

ప్రజల్లో ఆందోళన..

వీటన్నింటి మధ్య- కేంద్ర ప్రభుత్వం 18 నుంచి 44 సంవత్సరాల వారికీ టీకాలు తీసుకొనేందుకు అర్హత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం మధ్యతరగతి మధ్యవయస్కుల కష్టాలను మరింతగా పెంచింది. చివరికి, రెండో డోసు కాలవ్యవధి ముంచుకొచ్చినా టీకాలు వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఏ టీకా కేంద్రానికి వెళ్లినా.. ఆస్పత్రికి వెళ్లినా చేంతాండంత వరసలు, స్టాకు లేదన్న బోర్డులు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సైతం సరిపడినన్ని టీకా డోసులు లేకపోవడంతో అధికాదాయ, ఉన్నత మధ్యతరగతి వర్గాల ప్రజలకూ నిరాశే మిగులుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బదులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లోనైనా టీకాలు వేయించుకొనేందుకు సిద్ధమైన వారికి ఈ పరిణామం అశనిపాతంలా మారింది.

వేచి చూసే ధోరణితో..

టీకాల విషయంలో మధ్యతరగతిలో తీవ్రస్థాయిలో నిరాశానిస్పృహలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు పలు పరిణామాలు తోడయ్యాయి. మొదట్లో టీకాకు సంబంధించి దాని సామర్థ్యం, పనితీరు, దుష్పరిణామాలపై అపోహలతో చాలామంది వ్యాక్సిన్‌ వేయించుకొనేందుకు ముందడుగు వేయలేదు. మార్చి, ఏప్రిల్‌లో టీకా కేంద్రాల్లో పెద్దగా రద్దీ లేకపోయినా- ఇలాంటి భావనలను విశ్వసించిన చదువుకున్న మధ్యతరగతి ప్రజలు సైతం, వేచి చూసే ధోరణిని అవలంబించారు. వ్యాక్సిన్‌ కారణంగా కొన్ని ఐరోపా దేశాల్లో, కొంతమందిలో కొన్నిచోట్ల అరుదుగా రక్తం గడ్డ కడుతోందంటూ జరిగిన ప్రచారం వారిని వెనకంజ వేసేలా చేశాయని చెప్పవచ్చు.

స్థైర్యం కల్పించాలి

'లోకల్‌ సర్కిల్స్‌' అనే సామాజిక అనుసంధాన వేదిక గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన ఓ సర్వేలో 25 వేల మంది పాల్గొనగా, కేవలం ఎనిమిది శాతం మాత్రమే- టీకాలు అందుబాటులోకి రాగానే వేసుకొనేందుకు మొగ్గుచూపినట్లు తేలింది. దాదాపు అరవై శాతం తాము టీకా కోసం త్వరపడబోమని తేల్చిచెప్పారు. 28శాతం మూడు నుంచి ఆరు నెలలు వేచి చూస్తామని చెప్పగా, ఏడుశాతం తాము 2021లో టీకా వేసుకోబోమని, 2022లోనే తీసుకుంటామని స్పష్టం చేశారు. మరో పదకొండు శాతం తాము టీకా విషయంలో ఏమీ చెప్పలేమని, ఏమీ నిర్ణయించుకోలేదని వెల్లడించడం గమనార్హం. తాము ప్రైవేటు ఆరోగ్య వ్యవస్థలో మాత్రమే టీకాలు వేసుకొంటామని చెప్పినవారి సంఖ్యా తక్కువేమీ లేకపోవడం విశేషం. ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై సరైన విశ్వాసం లేకపోవడాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.

రెండో విడత కరోనా ఉద్ధృతి పెరగడానికి ముందు పరిస్థితి ఇలా ఉండగా- దేశంలోని పలు నగరాల్లో కరోనా కేసుల విజృంభణతో వైద్య మౌలిక సదుపాయాల వ్యవస్థ కుప్పకూలింది. పెద్ద సంఖ్యలో మధ్యతరగతి ప్రజలు తమకు, తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు ఆస్పత్రుల్లో చికిత్స సౌకర్యాల్ని, ఐసీయూ పడకలను పొందలేకపోతున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, ప్రాణాధార ఔషధాలను అధిక ధరలు చెల్లించి నానాతంటాలు పడి, ఎక్కడెక్కడికో వెళ్లి సొంత ప్రయాసలతో సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిణామాలు పలువురిని నిస్పృహకు గురి చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే వ్యాక్సిన్ల సరఫరాను పెంచి పౌరుల్లో స్థైర్యాన్ని పాదుగొల్పాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితి తేటతెల్లం చేస్తోంది.

- కృష్ణానంద్‌ త్రిపాఠి, రచయత

ఇదీ చదవండి:రెండుసార్లు కరోనాను జయించాడు.. కానీ!

ABOUT THE AUTHOR

...view details