గాలి, నేల, నీరు.. వీటి నాణ్యతా పరిరక్షణకు, తద్వారా ప్రజారోగ్యాన్ని పర్యావరణాన్ని సంరక్షించడానికే రాష్ట్రాల స్థాయిలో చట్టబద్ధంగా కాలుష్య నియంత్రణ మండళ్లు (పీసీబీలు) అవతరించాయి. వాటికి పైయెత్తున పర్యవేక్షణ బాధ్యతల్ని భుజాలకెత్తుకున్నామంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సైతం కొలువు తీరింది. దశాబ్దాలక్రితమే దేశంలో అలా కాలుష్య నియంత్రణ వ్యవస్థ ఏర్పాటైనా ఒరిగిందేముందని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక లోగడే ఈసడించింది. పీసీబీ ఒక పనికిమాలిన విభాగమని తెలంగాణ హైకోర్టు గతంలో పడతిట్టిపోసింది. అయినా నేటికీ వాటి పనితీరు మెరుగుపడకపోవడం విస్మయపరుస్తోంది. రసాయన, బల్క్‌డ్రగ్ పరిశ్రమలు వెదజల్లుతున్న విషవాయువులతో అల్లాడిపోతున్నామని భాగ్యనగర శివారు ప్రాంతాల ప్రజానీకం నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తీరిగ్గా మేలుకున్న పీసీబీ అధికారులు కాలుష్యకారక పరిశ్రమలపై దృష్టిసారించి ప్రాథమిక పరిశీలన చేపట్టారన్న కథనాలు నివ్వెరపరుస్తున్నాయి.
అవినీతి మత్తులో పీసీబీలు
చీకటి మాటున ఘాటువాయువుల్ని ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నారంటూ ప్రజానీకం గగ్గోలు పెట్టేదాకా పీసీబీ ఏం చేస్తున్నట్లు? నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా పలు పరిశ్రమలు నిబంధనల్ని తుంగలో తొక్కడం- తరతమ భేదాలతో దేశవ్యాప్తంగా కళ్లకు కడుతున్న అవ్యవస్థ. నిఘా పెట్టి నియంత్రణ బాధ్యతలు నిష్ఠగా నిర్వర్తించాల్సిన పీసీబీలు అవినీతి మత్తులో జోగుతున్నాయి. పర్యవసానంగా- జలవనరులు విష కశ్మలమయమవుతున్నాయి. పంటల దిగుబడి కుంగడంతోపాటు ఆయా సేద్య ఉత్పత్తుల వల్ల ఆరోగ్య సమస్యలూ ముమ్మరిస్తున్నాయి. పీల్చేగాలీ గరళమై జనజీవనం కృశిస్తోంది. ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టడానికి, మొక్కుబడి పనితీరుకు మారుపేరుగా దిగజారిన కాలుష్య నియంత్రణ వ్యవస్థే- ఈ దారుణ నేరంలో తొలిముద్దాయి. వ్యర్థాల శుద్ధి కేంద్రాల్ని నెలకొల్పని పరిశ్రమలకు కరెంటు కోత విధించాల్సిందేనన్న సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల్నీ లెక్కచేయని స్థాయిలో పేరుకున్న అవ్యవస్థ- ప్రజలకు ఊపిరాడనివ్వడంలేదు!