దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు కళ్ళెంలేని గుర్రంలా దౌడు తీస్తూ మునుపెన్నడూ ఎరుగని గరిష్ఠ స్థాయికి చేరి హడలెత్తిస్తున్నాయి. యావత్ దేశంలోనే అత్యధికంగా లీటరు డీజిల్ ధర హైదరాబాదులో రూ.83లకు పైబడగా, జైపూర్ ముంబై నగరాల్లో పెట్రోలు రేటు రూ.90లకు మించిపోయి సరికొత్త రికార్డు సృష్టించింది. రాజస్థాన్‌లో ప్రీమియం పెట్రోలు లీటరు రూ.100పైనే! 2018 అక్టోబరులో లీటరు పెట్రోలు సుమారు రూ.80, డీజిల్ రూ.75 వరకు పలికినప్పుడు అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ ముడి చమురు 80 డాలర్లకు చేరువలో ఉంది. ఏడాది క్రితం 70 డాలర్లున్న పీపా ముడిచమురు ధర మూడు నెలల వ్యవధిలోనే సగానికి తెగ్గోసుకుపోయింది. నేడది 55 డాలర్ల వద్ద ఉండగా, రిటైల్ చమురు ధరలేమో గరిష్ఠ స్థాయికి చేరి ఉరుముతున్నాయి. రేటు క్షీణించినప్పుడూ ఉపశమనానికి నోచుకోని కోట్లాది వినియోగదారులకు 'అంతర్జాతీయ విపణికి అనుగుణంగా సర్దుబాటు' పేరిట ఆనవాయితీగా పెట్రో మంటల పెను సెగ తప్పడంలేదు.
సుంకాల పేరుతో..
ప్రస్తుత ధరోల్బణానికి 'ఒపెక్' (పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ) మాట నిలబెట్టుకొనకపోవడమే హేతువని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడ్డూర భాష్యం చెబుతున్నారు. నిరుడు ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా చమురుకు గిరాకీ కుంగి 'ఒపెక్' సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు- దేశీయంగానూ డిమాండు పడిపోయినా దిగుమతుల్ని కొనసాగించి ఆ కూటమిని ఆదుకున్నామని, అదిప్పుడు సహేతుక ధరలకు సరఫరాలు కొనసాగిస్తామన్న హామీని ఉల్లంఘించినందువల్లే చమురు మంటలింతగా భగ్గుమంటున్నాయన్నది మంత్రివర్యుల వివరణ! నెపాన్ని మరొకరిపైకి నెట్టేసి, అంతర్జాతీయ విపణిలో ధరలు పెరిగినప్పుడు తరిగినప్పుడు సైతం ఇక్కడ రేట్లు పెంచేస్తూ, ఆ పెంపుదలపై సుంకాలు దండుకుంటున్న ప్రభుత్వాలది... అడ్డగోలు దోపిడి కాదా?
ఎడాపెడా పన్నులు బాదేస్తూ..