తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనా దెబ్బతో.. 'ఆర్థిక చికిత్స' అసమగ్రం - వ్యాపార రంగంపై కొవిడ్​ ఎఫెక్ట్​

రెండో దశ కరోనా విజృంభణతో కొత్త కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. మహమ్మారి ధాటికి భిన్నరంగాలు అస్తవ్యస్తమవుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చతిలికిలపడి ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసంఖ్యాకుల ఆకలిమంటలు చల్లారాలన్నా, జీవన దీపాలు మలిగిపోరాదన్నా- శాయశక్తులా నిరుద్యోగితను నియంత్రించి, ఉపాధి అవకాశాలు విస్తరింపజేయడమే లక్ష్యంగా సర్కారీ కార్యాచరణ పదును తేలాలి!

Corona, Covid, Unemployment
కొవిడ్​, నిరుద్యోగం

By

Published : May 7, 2021, 7:33 AM IST

కొవిడ్‌ మలి దఫా విజృంభణతో రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య నాలుగు లక్షలకు మించి ఎగబాకుతున్న దేశంలో, మహమ్మారి వైరస్‌ ధాటికి భిన్న రంగాలు ఛిన్నాభిన్నమై కునారిల్లుతున్నాయి. వివిధ వృత్తి ఉద్యోగ వ్యాపారాలూ చతికిలపడి అసంఖ్యాక కుటుంబాలు తీవ్ర దురవస్థల పాలవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు వేరే వృత్తి వ్యాపకాల్లో ఉన్నవారెందరో గత్యంతరం లేక చిన్నా చితకా పనుల్లో కుదురుకుంటున్న ఉదంతాలు, ఆకలి మంటల్ని ప్రజ్వరిల్లజేస్తున్న మహా సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి. నిరుటి లాక్‌డౌన్లతో లావాదేవీలు చతికిలపడి, 'ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ'పై పెట్టుకున్న గంపెడాశలు కొల్లబోయిన స్థితిలో మూడోవంతు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లు మూసివేతే శరణ్యమని తలపోస్తున్నాయి.

తగ్గుతున్న ఉపాధి అవకాశాలు..

ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోతున్న కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో 7.13 శాతానికి, పట్టణాల్లో 9.78 శాతానికి నిరుద్యోగిత పెచ్చరిల్లినట్లు సీఎమ్‌ఐఈ(భారత ఆర్థిక పర్యవేక్షక కేంద్రం) గణాంక నివేదిక స్పష్టీకరిస్తోంది. సుమారు అయిదు కోట్లమందికి జీవనాధారమైన చిల్లర వర్తక రంగమూ కురుక్షేత్రంలో కర్ణుడి రథచక్రం కుంగిన దృశ్యాన్ని తలపిస్తోంది. ఇంతగా ఒడుదొడుకులకు లోనవుతున్న వ్యక్తులకు, చిన్న వ్యాపారులకు, లఘు పరిశ్రమలకు ఉపశమనం కలిగించేందుకంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించిన తాజా ఆర్థిక చికిత్స విస్మయపరుస్తోంది. గిరాకీ మరీ ఎక్కువగా క్షీణించకపోవచ్చునని మదింపు వేసిన ఆర్‌బీఐ- రుణాల చెల్లింపు గడువు పొడిగింపే మహోపకారమన్నట్లు భావిస్తోంది. నిర్వహణ నిధులకు కొరత, పాత అప్పులపై పేరుకుపోతున్న వడ్డీ భారం, ప్రభుత్వ సంస్థలనుంచి రావాల్సిన బకాయిలపై కదులూ మెదులూ లేకపోవడం- 12 కోట్ల దాకా ఉపాధి అవకాశాలు కల్పించగల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలను చెండుకు తింటున్నాయి. ఈ సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించగలిగితేనే, చిన్న పరిశ్రమలు తేరుకోగలిగేది.

రోడ్డునపడిన కూలీ..

నిరుడు ఫిబ్రవరి నాటికి దొరికిన పనేదో చేస్తూ బతుకుబండి నెట్టుకొచ్చిన నిత్య శ్రామికుల్లో మూడొంతుల మంది లాక్‌డౌన్ల విధింపుతో నడివీధి పాలయ్యారు. అందులో కొంతమంది తక్కువ వేతనాలకు తిరిగి కుదురుకున్నప్పటికీ, మరెందరో పస్తులతో గడిపే దురవస్థలో కుమిలిపోతున్నారు. లఘు పరిశ్రమలు, చిరు వ్యాపారాలు కుదేలై- ఆ జాబితా ఇంకా విస్తరిస్తూ పోతోంది. ఉన్నంతలో అన్నార్తులకు ఎంతో కొంత ఉపశమనం కలిగించే నిమిత్తం పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం ప్రారంభించాలన్న సూచనల్ని మొన్నటి కేంద్ర బడ్జెట్లో ఏమాత్రం పట్టించుకోలేదు. వాస్తవానికి చిరకాలంగా ప్రతిపాదనల దశలోనే మగ్గుతున్న పట్టణ ఉపాధి హామీ పథకాన్ని రెండేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌ ప్రవేశపెట్టింది. విద్యావంతులైన యువతకు తగిన శిక్షణ దరిమిలా రూ.13 వేల నెలవారీ భత్యం అందిస్తే అయిదు కోట్ల మేర ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అధ్యయనం ఆనాడు లెక్కకట్టింది.

జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

చిన్న పట్టణాల్లో మౌలిక వసతులూ సేవల మెరుగుదలకు, స్థానిక యువత నైపుణ్యాల పెంపుదలకు అక్కరకొచ్చేలా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని జాతీయస్థాయిలో పట్టాలకు ఎక్కించడం బహుళ ప్రయోజనదాయకమవుతుంది. సరైన జీవనాధారం లేనివారికి బాసటగా- ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దాదాపు 80 కోట్లమంది లబ్ధిదారులకు అయిదు కిలోల ఆహారధాన్యాల పంపిణీ నిర్ణయం ఎన్నదగిందే. వాస్తవిక సమీక్షలో నికర లబ్ధిదారుల సంఖ్య కుదించుకుపోయిన అనుభవాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సిందే. అసంఖ్యాకుల ఆకలిమంటలు చల్లారాలన్నా, జీవన దీపాలు మలిగిపోరాదన్నా- శాయశక్తులా నిరుద్యోగితను నియంత్రించి, ఉపాధి అవకాశాలు విస్తరింపజేయడమే లక్ష్యంగా సర్కారీ కార్యాచరణ పదును తేలాలి!

ఇదీ చదవండి:'ప్రధాని వైఫల్యంతోనే దేశంలో లాక్​డౌన్​ పరిస్థితులు'

ABOUT THE AUTHOR

...view details