తెలంగాణ

telangana

ETV Bharat / opinion

రాష్ట్రాలను పెద్ద మనసుతో కేంద్రమే ఆదుకోవాలి! - amphan damage to bengal

ఒడిశా, బెంగాల్‌ గ్రామీణ ప్రాంతాల్లో లక్షలమంది బతుకుల్ని చిందరవందర చేసిన అంపన్‌.. కోల్‌కతా మహానగరం ముఖచిత్రాన్నే మార్చేసింది. వేల సంఖ్యలో వృక్షాల్ని కూకటివేళ్లతో పెకలించివేసిన భీకర తుపాను అనేక చోట్ల రహదారుల్ని, వంతెనల్ని ఛిద్రం చేసింది. కరోనా విజృంభణ, సొంతగూటికి చేరాలని ఆరాటపడుతున్న వలసకూలీలు, అంపన్‌.. ఈ ముప్పేట దాడితో సతమతవుతున్న రాష్ట్రాలపట్ల కేంద్రమే ఉదారంగా స్పందించాలి. పెద్ద మనసుతో ఆదుకోవాలి.

center should help bengal, odisha
పెద్ద మనసుతో కేంద్రమే ఆదుకోవాలి!

By

Published : May 23, 2020, 8:54 AM IST

Updated : May 23, 2020, 9:12 AM IST

ఏడాది క్రితం విలయ లయలతో ఒడిశా తీరంపై విరుచుకుపడిన ఫొని తుపాను.. పశ్చిమ్‌ బంగ, బంగ్లాదేశ్‌లవైపు సాగి ఉపశమించింది. దానితో పోలిస్తే ఎన్నో రెట్ల తీక్షణతతో మహోగ్రరూపం దాల్చిన అంపన్‌ తుపాను ఇప్పుడు పశ్చిమ్‌ బంగ దుఃఖదాయనిగా పరిణమించింది. ఒడిశా, బెంగాల్‌ గ్రామీణ ప్రాంతాల్లో లక్షలమంది బతుకుల్ని చిందరవందర చేసిన అంపన్‌.. కోల్‌కతా మహానగరం ముఖచిత్రాన్నే మార్చేసింది. వేల సంఖ్యలో వృక్షాల్ని కూకటివేళ్లతో పెకలించివేసిన భీకర తుపాను ఎన్నోచోట్ల రహదారుల్ని, వంతెనల్ని ఛిద్రం చేసింది. విద్యుత్‌, టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రోడ్లపైకి పరవళ్లెత్తిన ఉద్ధృత జలప్రవాహాల్లో శవాలు కొట్టుకువచ్చిన భీతావహ దృశ్యాలు బెంగాల్‌ మానవ మహావిషాదానికి అద్దం పట్టాయి. భారత వాతావరణశాఖ ఉత్పాత సమయాన్ని ఇదమిత్థంగా అంచనా కట్టి హెచ్చరించడం తరువాయి.. రెండు రాష్ట్రాలనుంచి దాదాపు ఏడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఎందరి ప్రాణాలనో కాపాడింది. జనావాసాలు, పంటలు, పశుసంపదకు ఏ మేర నష్టం వాటిల్లిందీ ఇప్పట్లో తేలేది కాదు.

నిరుటి 'బుల్‌బుల్' తుపానువల్ల వాటిల్లిన నష్టాన్ని రూ.23వేలకోట్లుగా అప్పట్లో మదింపు వేశారు. ఆ ప్రాతిపదికన కనీసం మూడింతల మేర నష్టమిప్పుడు దాపురించి ఉంటుందన్న ప్రాథమిక అంచనాల వెలుగులో ప్రస్తుత ఉత్పాతాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరడం సహేతుకమే. అత్యవసర నిధిగా పశ్చిమ్‌ బంగకు రూ.1000కోట్లు, ఒడిశాకు రూ.500 కోట్లు ప్రకటించిన ప్రధాని మోదీ.. బాధితుల్ని ఆదుకోవడంలో వెనకాడేది లేదంటున్నారు. కరోనా విజృంభణ, సొంతగూటికి చేరాలని ఆరాటపడుతున్న వలసకూలీలు, అంపన్‌.. ఈ ముప్పేట దాడితో కిందుమీదులవుతున్న రాష్ట్రాలపట్ల కేంద్రమే ఉదారంగా స్పందించాలి. పెద్ద మనసుతో ఆదుకోవాలి!

మేరమీరిన కర్బన ఉద్గారాల కారణంగా భూగోళం అపరిమితంగా వేడెక్కితే వాటిల్లే దుష్పరిణామాలకు తుపానులే సంకేతాలని నోబెల్‌ గ్రహీతలు స్పష్టీకరిస్తున్నారు. అయిదేళ్లుగా అరేబియా సముద్రం, బంగాళాఖాతాల్లో తుపానుల ప్రజ్వలనం 32శాతం మేర పెరిగినట్లు భారత వాతావరణ శాఖ నిగ్గుతేల్చింది. మునుపటితో పోలిస్తే ఉత్పాతాలను ఎదుర్కోవడంలో సన్నద్ధత మెరుగుపడిన మాట వాస్తవం. రెండు దశాబ్దాలక్రితం ఒడిశాను కకావికలం చేసిన సూపర్‌ సైక్లోన్‌ సుమారు పదివేలమంది ప్రాణాల్ని కర్కశంగా తోడేసింది. 2008లో మియన్మార్‌ను శోకాకులం చేసేసిన నర్గీస్‌ జలవిలయం దాదాపు లక్షన్నర మందిని మింగేసింది. దేశీయంగా జాతీయ విపత్తు నిభాయక దళం పనితీరును 'కాగ్‌' నివేదికలు తూర్పారపట్టిన దరిమిలా, ముందస్తు జాగ్రత్తలపరంగా కొంత కుదురుకున్నా.. పునరావాస చర్యల్లో లోటుపాట్లు వెక్కిరిస్తూనే ఉన్నాయి. విపత్తుల శీఘ్రకార్యాచరణ దళాన్ని పరిపుష్టీకరించుకున్న ఒడిశా లాంటివీ సహాయ పునరావాసాల నిమిత్తం కేంద్రాన్ని అర్థించాల్సి వస్తోంది. ఇప్పుడు పశ్చిమ్‌ బంగ సర్కారైతే ఏకకాలంలో వలసకూలీలు, నిర్వాసితుల సంరక్షణను తలకు మించిన భారంగా తలపోయడం రాష్ట్రాల పరిమితుల్ని, ఆర్థిక అగచాట్లను కళ్లకు కడుతోంది. ప్రకృతి ఉత్పాతాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో సంభవించినా వాటిని దేశానికే వచ్చిన కష్టంగా పరిగణించి ప్రభుత్వ యంత్రాంగం మానవీయంగా స్పందించాలి. తుపానులు, వరదలు, కరవుకాటకాల వేళ రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రమే పూర్తి తోడ్పాటు అందించాలి. మౌలిక వ్యవస్థలు, జనజీవన పునర్నిర్మాణాలకు అది సంపూర్ణ బాధ్యత వహించేలా శాసన నిబంధనల్ని సాకల్యంగా ప్రక్షాళించాలి. సమాఖ్య భావనకు, సంక్షేమ స్ఫూర్తికి కేంద్రం అలా గొడుగు పడితేనే ప్రకృతి విపత్తులతో గుండె చెదిరిన రాష్ట్రాలు సత్వరం కోలుకోగలుగుతాయి!

Last Updated : May 23, 2020, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details