వ్యాధి సోకిన తరవాత దాన్ని నిర్ధరించేలోపే- ఏటా వందల మంది చిన్నారులు ఊపిరి వదులుతున్నారు. అరుదైన వ్యాధుల నిర్ధరణ, చికిత్సకు అయ్యే భారీ వ్యయాన్ని భరించే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడం, ప్రభుత్వాల నుంచి సరైన చేయూత అందకపోవడం, వైద్యులు వ్యాధి తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేక పోతుండటం వల్ల పసిప్రాణాలకు రక్షణ కరవైంది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన వ్యాధులకు సరైన నిర్వచనం లేదు. ఒక్కో దేశంలో ప్రాంతాన్ని, వ్యాధి ప్రాబల్యాన్ని, చికిత్స విధానాన్ని బట్టి కొన్నింటిని అరుదైన వ్యాధులుగా గుర్తిస్తున్నారు. పది వేల జనాభాకు అమెరికాలో 6.4 మందికి, ఐరోపా దేశాల్లో అయిదుగురికి, జపాన్‌లో నలుగురికి, కొరియాలో నలుగురికి, ఆస్ట్రేలియా, చైనాల్లో ఒక్కరికి జబ్బున్నా దాన్ని అరుదైన వ్యాధిగా గుర్తించి చికిత్స విధానాల్ని వెతుకుతున్నారు. ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే భారత్‌లో ఇప్పటి వరకు దేన్ని అరుదైన వ్యాధిగా గుర్తించాలనే విషయంలో ఓ నిర్ధరణకు రాలేదు.
భారీ ప్రోత్సాహకాలు
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి ఏడు వేల నుంచి ఎనిమిది వేల దాకా ఇలాంటి వ్యాధులున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. వీటిలో కేవలం అయిదు శాతం రోగాలకు మాత్రమే చికిత్సలు అందుబాటులో ఉండగా, మిగతా 95 శాతానికి ఇప్పటిదాకా నిర్ధరిత చికిత్సా విధానాల్లేవు. వీటిలోనూ అరుదైన వ్యాధులకు గురైన ప్రతి పదిమందిలో ఒక్కరు మాత్రమే చికిత్స పొందగలుగుతున్నారు. ప్రస్తుతం దేశంలో చిన్నారుల్ని కండరాల సంబంధిత వ్యాధులు పీడిస్తున్నాయి. లైసోసోమల్ స్టోరేజ్ డిజార్డర్స్ (ఎల్‌ఎస్‌డీ), ప్రైమరీ ఇమ్యునో డెఫిషియన్సీ డిజార్డర్ (పీఐడీడీ), స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ), మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధులు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి చికిత్స, మందుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించలేక చాలామంది వెనకడుగేస్తున్నారు. మరికొంతమంది నిధుల సమీకరణ ద్వారా ముందడుగు వేస్తుండటం సరికొత్త పరిణామం.
నేరుగా ప్రభుత్వమే..
అరుదైన వ్యాధుల కోసం ఇతర దేశాల్లో అరుదైన ఔషధ చట్టం (ఓడీఏ) కింద పరిశోధన, ఔషధ తయారీ సంస్థలకు అక్కడి ప్రభుత్వాలు భారీ ప్రోత్సాహకాల్ని ఇస్తున్నాయి. అమెరికాలో పరిశోధకులకు ప్రత్యేక ప్రోత్సాహక నిధితోపాటు మందులపై ఎగుమతి సుంకంలో మినహాయింపులు ఇస్తున్నారు. బ్రిటన్‌లో జాతీయ ఆరోగ్య సర్వీసు కింద అరుదైన వ్యాధి బాధితులకు చికిత్సలు అందించడంతోపాటు, ఎస్‌ఎంఏ టైప్-1 దశలో ఉన్న బాధితుల కోసం నేరుగా ప్రభుత్వమే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్ ఎక్స్‌లెన్స్ ద్వారా ఔషధ తయారీ సంస్థ బయోజెన్‌కు నిధుల్ని సమకూరుస్తోంది. సింగపూర్‌లో అరుదైన వ్యాధుల ప్రత్యేక నిధి, మలేసియా, ఆస్ట్రేలియాల్లో చికిత్స రుసుముల్లో మినహాయింపు కల్పిస్తూ మరణాల కట్టడికి కృషి చేస్తున్నారు.
ఎన్‌పీటీఆర్‌డీలోని లోపాలపై..