భారత్‌లో పౌల్ట్రీ పరిశ్రమకు బర్డ్ ఫ్లూ వ్యాధి పెనుసవాళ్లు విసరుతోంది. తొలిసారిగా 2006లో ఇండియాలోకి ప్రవేశించిన బర్డ్ ఫ్లూ వైరస్ ఇప్పటివరకు 28 సార్లు కోర సాచింది. అయినా, దేశంలోని పౌల్ట్రీ పరిశ్రమ తట్టుకుని నిలబడగలిగింది. తాజాగా మరోసారి నాలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా ఆకాశంలో ఎగురుతున్న కాకులు, పావురాలు, నెమళ్లు అకస్మాత్తుగా కింద పడిపోయి మృతి చెందడంపై మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఆందోళన వ్యక్తమవుతోంది. చనిపోయిన పక్షుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు అధికార వర్గాలు నిర్ధారించాయి. అనంతరం ఈ వైరస్ మరో రెండు రాష్ట్రాలకు వ్యాపించింది. కేరళలోని కొట్టాయం, అలప్పుజా పరిసరాల్లో వేల సంఖ్యలో బాతులు వైరస్‌తో మృతి చెందాయి. వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కనీసం 36వేల కోళ్లను, 12వేల బాతులను ఉత్పత్తిదారులు వధిస్తున్నారు.
ఓవైపు కరోనా- మరోవైపు బర్డ్ ఫ్లూ..
హిమాచల్ ప్రదేశ్‌లోని పాంగ్ జలాశయం సమీపంలో సుమారు 2,500 వలస పక్షులు మృతి చెందడం కలకలం రేపింది. అక్కడి చిత్తడి నేలల్లో వాటి కళేబరాలను కనుక్కున్నారు. వాటి శరీరాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. చనిపోయినవాటిలో అరుదైన పక్షిజాతులూ ఉన్నట్లు నిపుణులు తేల్చారు. హరియాణాలో ఫారాల్లోని లక్షలాది కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అందుకు బర్డ్‌ఫ్లూ వైరసే కారణమా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కొవిడ్ తీవ్రంగా కలవరపెడుతున్న వేళ- బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఈ ఉదంతాల్లో బర్డ్ ఫ్లూ లోని రెండు స్ట్రెయిన్‌లు (హెచ్5ఎన్1, హెచ్5ఎన్8) ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అదే కాస్త ఉపశమనం..
వైరస్ సోకిన కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. అందువల్ల బర్డ్ ఫ్లూ వెలుగు చూసిన వెంటనే సంబంధిత ప్రాంతాల్లో నివారణ చర్యల ద్వారా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడం తక్షణం జరగాల్సిన ప్రక్రియ. కరోనా వైరస్‌లాగా బర్డ్ ఫ్లూ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకదు. ఇది కాస్త ఊరట కలిగించే విషయం. కోడి మాంసాన్ని తినేముందు బాగా ఉడకబెట్టడం మన దేశంలో ఓ అలవాటు. అధిక ఉష్ణోగ్రతలో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్వీర్యం అవుతుందని, అందువల్ల మన దేశంలో ఇది కోడి మాంసం ద్వారా మనుషులకు సోకే అవకాశం తక్కువేనని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.