తెలంగాణ

telangana

ETV Bharat / opinion

రక్షణ రంగానికి సౌరశక్తి.. సర్వ విధాలుగా ఉపయుక్తం

రక్షణ విభాగంలోని కంటోన్మెంట్‌ ప్రాంతాలు, వైమానిక స్థావరాలు, నేవీలో సౌర విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని సంకల్పించింది కేంద్రం. ఇప్పటికే గ్రీన్​లదాఖ్​ లక్ష్యంగా సౌర పార్కును ప్రకటించారు ప్రధాని మోదీ. 7500 మెగావాట్ల సామర్థ్యంతో 2023 నాటికి ఏర్పాటు చేస్తామని చెప్పారు. సర్వవిధాలుగా ఉపయుక్తంగా ఉండేలా.. సౌరశక్తి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

By

Published : Feb 1, 2021, 8:41 AM IST

solar power projects in the defense sector
రక్షణ రంగానికి సౌరశక్తి

భారత రక్షణ రంగం సౌర విద్యుత్తు వినియోగం వైపు వేగంగా కదులుతోంది. రక్షణ విభాగంలోని కంటోన్మెంట్‌ ప్రాంతాలు, వైమానిక స్థావరాలు, నేవీలో సౌర విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. భారత్‌ ఇప్పటికే సౌర విద్యుత్తు రంగంలో ప్రపంచంలో మూడో అతి పెద్ద మార్కెట్‌గా, వ్యవస్థాపక సామర్థ్యంలో అయిదో స్థానంలో ఉంది. 2022 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుత్తు వ్యవస్థాపక సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళుతోంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ సౌర విద్యుత్తు ఉత్పత్తి ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తోంది. ఇంధన, పారిశ్రామిక, తయారీ, ఆరోగ్య రంగాలు ఇప్పటికే దాన్ని అందిపుచ్చుకున్నాయి. అదే బాటలో ఇప్పుడు రక్షణ రంగం చేరింది. రానున్న రోజుల్లో ఇక్కడ పునరుత్పాదక ఇంధనం కీలక పాత్ర పోషించనుంది.

గ్రీన్​లదాఖ్​ లక్ష్యంగా..

ప్రధాని మోదీ ఇప్పటికే 'గ్రీన్‌లదాఖ్' లక్ష్యంగా సౌర పార్కును ప్రకటించారు. 7500 మెగావాట్ల సామర్థ్యంతో 2023 నాటికి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది సైనిక సిబ్బంది ప్రయోజనాలనూ నెరవేరుస్తుంది. దేశంలోని సైనిక, నావిక, వైమానిక దళాలకు చెందిన కేంద్రాల్లో 150 మెగావాట్ల వ్యవస్థాపక సామర్థ్యంతో విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. నౌకాదళం ఇప్పటికే భారత నావికా పర్యావరణ సంరక్షణ మార్గసూచీని సిద్ధం చేసింది. కొత్తగా చేపట్టే పనుల్లో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి 1.5శాతాన్ని వెచ్చించాలని నిర్ణయించింది. ఐఎన్‌ఏలో ఏర్పాటు చేసిన మూడు మెగావాట్ల సౌరకేంద్రం నావికాదళం చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు. కేరళ రాష్ట్ర ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఈ ప్రాజెక్టును చేపట్టింది. కర్బన ఉద్గారాలు తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మిలిటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ఎంఈఎస్‌) సంస్థ ప్రతిష్ఠాత్మకంగా భటిండా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు..

ఇవికాకుండా, పదాతి దళం విభాగంలో 'గన్‌ అండ్‌ షెల్‌ ఫ్యాక్టరీ (జీఎస్‌ఎఫ్‌)'లో 350 కిలోవాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టును చేపట్టారు. దీనివల్ల 430 మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. అంబాలా కంటోన్మెంట్‌లో ఒక మెగావాట్‌ సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సైన్యం అవసరాల నిమిత్తం 1.3కిలోవాట్ల బ్యాటరీ హ½స్‌ నిర్మాణం సాగుతోంది. పశ్చిమ నావికా దళంలో రెండు మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రం, భారత నావికా అకాడమీలో మూడు మెగావాట్ల కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్‌ కళింగ తూర్పు నౌకాదళంలో రెండు మెగావాట్ల సౌర ఫొటోవోల్టాయిక్‌ విద్యుత్తు కేంద్రం, ఐఎన్‌ఎస్‌ సర్వేక్షక్‌లో అయిదు కిలోవాట్ల వ్యవస్థాపక సామర్థ్యంతో 18 సౌర ప్యానళ్లు ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ ముందడుగు. నాగ్‌పూర్‌లోని భారత వైమానిక దళంలోని అన్ని ప్రధాన భవనాలపైనా సౌరవిద్యుత్తుకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టారు. భిసియానా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల ఆగ్రా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ 1.5 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. ఈ పరిణామాలన్నీ రక్షణ రంగం సౌర విద్యుత్తు వైపు వేగంగా సాగిస్తున్న ప్రస్థానానికి తార్కాణాలుగా నిలుస్తున్నాయి.

విభిన్న పరిస్థితుల్లో ఉపయోగం..

రక్షణ బలగాలు వివిధ వాతావరణ పరిస్థితుల మధ్య పని చేస్తుంటాయి. ఎప్పుడూ ఒకేచోట స్థిరంగా ఉండకుండా తరచూ విభిన్న ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో తరలించడానికి వీలుగా ఉండే సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు వారికి ఎంతగానో ఉపకరిస్తాయి. సౌర ప్యానళ్లు, నిల్వ ఉపకరణాలు, సౌరదీపాలు, సౌరహీటర్లు వంటివి వారి విద్యుత్తు అవసరాలను సమర్థంగా నెరవేరుస్తాయి. విద్యుత్తు సమస్య తలెత్తకుండా 'బ్యాకప్‌' సౌలభ్యమూ లభిస్తుంది. లదాఖ్‌ వంటి కొన్ని ప్రాంతాలల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి మైనస్‌ 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌, అంతకంటే తక్కువకు చేరుతుంది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మైనస్‌ అయిదు డిగ్రీల సెంటీగ్రేడ్‌కూ చేరుతుంది. అలాంటి సమయంలో సైనిక శిబిరాల్లో ఉండేవారికి శీతల వాతావరణం నుంచి రక్షణ అవసరమవుతుంది. అలాంటి సందర్భాల్లో సౌరవిద్యుత్తు ఉపకరణాలు ఎంతగానో ప్రయోజనం కలిగిస్తాయి. సౌరవిద్యుత్తు వాడకం వల్ల విద్యుత్తు కోతలు, గ్రిడ్‌ వైఫల్యాలు, సైబర్‌ దాడుల వంటి సమస్యలకు ఆస్కారం ఉండదు. రక్షణ వ్యవస్థలకు ఆఫ్‌గ్రిడ్‌ పద్ధతితో నిరంతరం విద్యుత్తు సరఫరా జరిగే విద్యుత్తు కేంద్రాల్లో వృథాకు ఆస్కారం ఉండదు. విద్యుత్తు రుసుముల భారమూ తగ్గుతుంది. రాబోయే రోజుల్లో సౌర వెలుగులతో రక్షణ వ్యవస్థ మరింతగా వెలుగులీనుతుందనడంలో సందేహం లేదు.

- పార్థసారథి చిరువోలు

ABOUT THE AUTHOR

...view details