తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పెరిగిన ధరలు-నిర్మాణ రంగం కుదేలు - cement, steel rates were hiked in india ,constructions facing problems

ప్రపంచవ్యాప్తంగా సిమెంట్ ఉత్పత్తిలో చైనా తరువాత రెండోస్థానంలో భారత్​ ఉంది. 2022-23నాటికి 38కోట్ల టన్నులకు పైగా సిమెంట్​ ఉత్పాదన పెరిగి...గిరాకీ 37.9కోట్లకు చేరుకుంటుందని అంచనా. దేశ గరిష్ఠ సిమెంట్​ ఉత్పాదక సామర్థ్యం 2025నాటికి రమారమి 55కోట్ల టన్నులకు చేరనుందని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. మరి సరఫరాలు కుంగి ధరలు ప్రజ్వలించే పరిస్థితి అసలెందుకు ఉత్పన్నమవుతోంది?

cement, steel rates were hiked in india ,constructions facing problems
ఆకాశాన్నంటిన సిమెంట్, ఉక్కు ధరలు-నిర్మాణ రంగం కుదేలు

By

Published : Jan 12, 2021, 8:22 AM IST

పక్కా నిర్మాణాలకు ఉక్కు, సిమెంటే ప్రాణాధారాలు. కొన్నాళ్లుగా వాటి ధరలకు రెక్కలు మొలుచుకొస్తున్న వైనం దేశవాసులందరికీ తెలుసు. నిరుడీ రోజుల్లో రూ.349 ధర పలికిన యాభై కిలోల సిమెంటు బస్తా రేటు చూస్తుండగానే రూ.420-430 దాకా ఎగబాకింది. అలాగే టన్ను ఉక్కు ధర సంవత్సర కాలంలోనే రూ.40వేలనుంచి రూ.58వేలకు పెరిగిపోయింది. ఇనుప ఖనిజం బాగా ఖరీదైనందువల్లే రేట్లు పెంచాల్సి వస్తున్నదన్న ఉక్కు సంస్థల వాదనను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అడ్డంగా కొట్టిపారేస్తూ- పెంపుదల వెనక అసలు గుట్టును బయటపెట్టేశారు. దేశంలోని ప్రధాన ఉక్కు సంస్థలన్నింటికీ సొంత గనులున్నాయన్న అమాత్యులు- ఇటీవలి కాలంలో విద్యుత్‌ ఛార్జీలు, కార్మికుల వేతనాల్లో ఎటువంటి మార్పూ లేకపోయినా, కంపెనీలు కుమ్మక్కై ధరలు పెంచేశాయని కుండ బద్దలుకొట్టారు.

సిమెంటు సంస్థలదీ అదే బాగోతం. భారీ లాభాలపై కన్నేసిన సిమెంటు సంస్థలు సందు చూసి రేట్లు పెంచేస్తున్నాయని గతంలో తప్పుపట్టిన పార్లమెంటరీ స్థాయీసంఘం, ఆ పెడపోకడల కట్టడికి ప్రత్యేక వ్యవస్థనొకదాన్ని అవతరింపజేయాలనీ సూచించింది. డిసెంబరు 18వ తేదీన ప్రధానమంత్రికి రాసిన లేఖలో భారతీయ స్థిరాస్తి అభివృద్ధి సంఘాల సమాఖ్య (క్రెడాయ్‌) సైతం- ఉక్కు, సిమెంటు ఉత్పత్తిదారులు జట్టుకట్టి అహేతుకంగా ధరల దోపిడికి తెగబడుతున్న పర్యవసానాల్ని విశదీకరించింది. విషయం ప్రధాని మోదీ దృష్టికి వెళ్ళినా అడ్డగోలు పెంపుదల కొనసాగుతుండటాన్ని గర్హించిన కేంద్రమంత్రి గడ్కరీ- నియంత్రణ సంస్థ ఏర్పాటు అత్యావశ్యకమంటున్నారు. కృత్రిమ గిరాకీ సృష్టించి ఎడాపెడా లాభాలు వెనకేసుకునే పోకడల్ని కేంద్రమంత్రి బహిరంగంగా ఉతికి ఆరేసిన దరిమిలా- కంతలు పూడ్చి అవ్యవస్థను చక్కదిద్దే యత్నాల్లో ఇక ఎంతమాత్రం జాప్యం పనికిరాదు!

కొవిడ్‌ మహా సంక్షోభం నేపథ్యంలో స్థిరాస్తి రంగం అనేముంది, దేశార్థికమే చతికిలపడినప్పుడు సిమెంటు ధరలు ఇంతగా పెంచడమేమిటన్న నిర్మాణదారుల సంఘం అభ్యంతరాలు పూర్తిగా హేతుబద్ధమైనవి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చైనా తరవాత ఇండియాయే అతిపెద్ద సిమెంటు ఉత్పత్తిదారు. 2019-20లో 32.9కోట్ల టన్నులకు చేరిన దేశీయ సిమెంటు ఉత్పాదన 2022-23నాటికి 38కోట్ల టన్నులకు పైబడుతుందని, అప్పటికి గిరాకీ 37.9కోట్లకు చేరుకుంటుందని అంచనా. వాస్తవానికి దేశ గరిష్ఠ సిమెంటు ఉత్పాదక సామర్థ్యం 2025నాటికి రమారమి 55కోట్ల టన్నులకు చేరనుందని గణాంకాలు ధ్రువీకరిస్తుండగా- సరఫరాలు కుంగి ధరలు ప్రజ్వలించే పరిస్థితి అసలెందుకు ఉత్పన్నమవుతుంది? కంపెనీలు ఇలా కూటమి కట్టి ఉక్కు, సిమెంటు రేట్ల మాటున దండుకోవడం- అయిదేళ్లలో రూ.111లక్షల కోట్ల వ్యయంతో తలపెట్టిన మౌలిక ప్రాజెక్టులకు, అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరణకు గొడ్డలిపెట్టుగా గడ్కరీ చెబుతున్నారు. ఉక్కు, సిమెంటు ధరలు పట్టపగ్గాల్లేకుండా భగ్గుమనడం మధ్యతరగతి జీవుల సొంతింటి కలల్నీ ఎండమావిగా మిగిల్చేదే. అనైతిక వ్యాపార పోకడలతో జట్టు కట్టి ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశాయంటూ 2016లో సీసీఐ (కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా) పది సిమెంటు కంపెనీలపై సుమారు రూ.6,000 కోట్ల జరిమానా విధించగా- 10శాతం చెల్లింపులే జరిగాయి. దానిపై వివాదం కోర్టుకెక్కింది. పకడ్బందీ నియంత్రణ వ్యవస్థేమీ లేని వాతావరణంలో ధరల లూటీ పునరావృతమవుతోంది. నెలల వ్యవధిలోనే ఉక్కు, సిమెంటు, ఇతర సామగ్రి ధరలు పెరగడం మూలాన నిర్మాణ వ్యయం ఒక్కో చదరపు అడుగుకు రూ. 200 దాకా అధికమై- సాధారణ వినియోగదారుల గుండెలు అవిసిపోతున్నాయి. ప్రాణాధార ఔషధాల ప్రాముఖ్యాన్ని గుర్తించి వాటి ధరవరల కట్టడికి నిర్దిష్ట విధి నిషేధాలు అమలుపరుస్తున్నట్లే- నిర్మాణ రంగానికి, దేశార్థికానికి ఊపిరులూదగల పటిష్ఠ చర్యలకు ప్రభుత్వం సత్వరం పూనుకోవాలి. గుత్తాధిపత్య వ్యాపార ధోరణులపై ఉక్కుపాదం మోపాలి!

ABOUT THE AUTHOR

...view details