చాలాసార్లు అకడమిక్స్‌లో ఎక్కువ మార్కులు పొందినవారి కంటే తక్కువ మార్కులు వచ్చినవాళ్లే వేగంగా ఉద్యోగం సంపాదించడాన్ని మనం చూస్తూ ఉంటాం. దీంతో ఎంపికలో ఏదో లోపం ఉందని భావించేవారూ లేకపోలేదు. అదృష్టం వల్లే ఇది సాధ్యమైందనేవాళ్లూ ఉంటారు. అయితే ఉద్యోగం రావడానికి కేవలం పర్సంటేజీలొక్కటే సరిపోవు. పనిచేయడానికి అవసరమైన మెలకువలన్నీ సమృద్ధిగా ఉంటేనే జాబ్ సొంతమవుతుంది. అందుకే మీరూ దానికి తగిన లక్షణాలు పెంపొందించుకోవాలి. అవేంటంటే..
* సాధారణ పరిమితులకు మించి భిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవాలి.
* సంబంధిత రంగంలో వస్తున్న మార్పులు, కొత్త పోకడలపై అవగాహన తప్పనిసరి. వాటిని పనికి ఎలా అన్వయించవచ్చో ఆలోచించే నేర్పరితనం ఉండాలి.
* ఇతరులతో చక్కగా మాట్లాడగలగాలి. ఉద్యోగంలో సహచరులతో కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్లడం తప్పనిసరి. కాబట్టి సంభాషణా చాతుర్యాన్ని పెంపొందించుకోవాలి.
* భావవ్యక్తీకరణ శక్తి మెండుగా ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి.. ఇవన్నీ తెలిసి ఉండాలి. ఈ ఎటికెట్స్ తెలియని వాళ్లకి ఉద్యోగం పొందే అవకాశాలు తక్కువ.
* చక్కని దార్శనికత, చొరవ తప్పనిసరి.
* లోకజ్ఞానంతోపాటు తగినంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండాలి.