కొవిడ్ ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఆర్థిక రాజకీయ ముఖచిత్రాలను మార్చేసింది. పలు అగ్రదేశాలు సైతం అతలాకుతలమయ్యాయి. కరోనా వైరస్ మన దేశంలో ప్రతి ఒక్కరినీ ఏదో విధంగా ప్రభావితం చేసింది. ఇప్పటికీ అనేక కుటుంబాల్లో కొవిడ్ మిగిల్చిన విషాదం మరవలేనిది. ఇంతలోనే, కొవిడ్ రెండోసారి కూడా రావచ్చన్న వార్త అందరికీ అశనిపాతంలా మారింది. కరోనా వైరస్ సోకి పూర్తిగా నయమయ్యాక తొంబై రోజుల తరవాత మళ్ళీ కొవిడ్‌గా నిర్ధారణకు రావడాన్ని 'రీఇన్‌ఫెక్షన్'గా వ్యవహరిస్తారు. సాధారణంగా అన్ని వైరస్ ఇన్‌ఫెక్షన్లు మనిషికి ఒకసారి సోకిన తరవాత, జీవిత కాలానికి సరిపడా రోగనిరోధక శక్తిని అందిస్తాయి. కొన్నిసార్లు ఇతరత్రా కారణాలతో తాత్కాలికంగా అలాంటి రోగనిరోధక శక్తి తగ్గితే, వైరస్ ఇన్‌ఫెక్షన్ మరోసారి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు, వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు ఆయా వైరస్‌లు పెద్దమొత్తంలో ప్రతిరక్షకా(యాంటీబాడీ)లను తయారు చేయడంతో జీవితకాలం రక్షణ కవచం ఏర్పడుతుంది. అదే వైరస్ మరోసారి శరీరంలోకి ప్రవేశిస్తే, సత్వరమే ప్రమాదాన్ని గుర్తించి, తీవ్రంగా ప్రతిఘటించి వ్యాధిగా మారకుండా కాపాడుతుంది.
ప్రతిరక్షకాలే కీలకం
ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో కొన్ని ప్రతిరక్షకాలు అయిదారు రోజుల్లోనే తయారవుతాయి. తాత్కాలికంగా ఉత్పత్తయి శరీరానికి 'తక్షణ రక్షణ' కల్పిస్తాయి. దీర్ఘకాలికంగా ఏర్పడే ప్రతిరక్షకాలు కొంత ఆలస్యంగా రెండు మూడు వారాల్లో రూపొంది, శరీరంలో సుదీర్ఘంగా ఉంటూ అదే రకమైన ఇన్‌ఫెక్షన్ మళ్ళీ రాకుండా రక్షణగా నిలుస్తాయి. ప్రతి మనిషిలోనూ పుట్టుకతోనే ఈ రకమైన వ్యవస్థ అద్భుతంగా నిర్మితమై ఉంటుంది. కాకపోతే, యాంటీబాడీల తయారీ కాలం, నిలిచి ఉండే తత్వం మొదలైనవి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇదంతా- జన్యుపరమైన అంశాలతోపాటు, వైరస్ సంక్రమించిన పద్ధతి, వ్యక్తి ఆహార పోషణ స్థాయులపై ఆధారపడుతుంది. దీర్ఘకాలికంగా నిలిచిఉండే ప్రతిరక్షకాలు తయారవ్వాలంటే వైరస్ పదార్థం శరీరంలోకి యాభైరెట్లు అధికంగా చేరిఉండాలి. ఈ కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకిన ప్రతి వ్యక్తిలో ఒకే రకమైన ప్రతిస్పందన కనిపించదు. కొంతమందిలో దీర్ఘకాలిక ప్రతిరక్షకాలు సైతం చాలా రోజుల వరకూ సరిపడా ఏర్పడవు. అందువల్లే జీవిత కాలానికి సరిపడా ఏర్పడాల్సిన యాంటీబాడీలు కొంతమందిలో త్వరితగతిన నిష్క్రమిస్తాయి. ఇలాంటి వారికి మరోసారి ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది.
వీడని అనిశ్చితి..
ఇన్‌ఫెక్షన్ కారణంగా సహజ రూపంలో ఏర్పడిన ప్రతిరక్షకాలు టీకా ద్వారా కృత్రిమంగా ఏర్పడిన వాటికన్నా ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. ఇప్పటిదాకా ఎంతమందికి రెండోసారి సోకిందనేదీ నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. ప్రతిరక్షకాలను లెక్కించి చెప్పే పరీక్షల్లో తేడాలు, ఏవీ పూర్తిస్థాయిలో సరైన విధానాలుగా గుర్తించకపోవడం ఇందుకు కారణం. కోట్ల మందికి వైరస్ సోకినా లక్షల్లో కూడా పరీక్షలు జరగకపోవడంతో ఎంతమందికి కరోనా సోకిందన్న విషయంలో సమగ్ర సమాచారం లేదు. అనేకమంది అత్యంత తక్కువ స్థాయిలో వ్యాధి లక్షణాలు కలిగి ఉండటం, ఇన్‌ఫెక్షన్ సోకినా లక్షణాలు కనిపించకుండా ఉండటం పరిస్థితిని జటిలం చేస్తోంది. మనదేశంలో ఇన్‌ఫెక్షన్ సోకినవారిలో ఎంతమందికి యాంటీబాడీలు ఏ స్థాయిలో, ఎప్పుడు ఏర్పడి, ఎంతకాలం స్థిరంగా ఉన్నాయి, ఏ అంశాలు వాటి తయారీ, నిల్వ కాలాన్ని నిర్ధాస్తున్నాయనే పరిశోధనలు జరగకపోవడం సైతం అనిశ్చితికి కారణమవుతోంది.
టీకా పైనే అందరి దృష్టి