కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా దాదాపు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ విధానం ఎంతమేరకు ఫలితాలు ఇచ్చింది, దానివల్ల సహజంగా ఏర్పడాల్సిన సామూహిక రోగనిరోధకత (హెర్డ్ ఇమ్యూనిటీ)కి ఎంతమేర విఘాతం కలిగిందనే అంశాలపై చర్చలు మొదలయ్యాయి. ఉదాహరణకు సందర్శకులను నిషేధించినప్పటికీ స్వీడన్‌లోని వృద్ధుల సంక్షేమ గృహాల్లో 80 ఏళ్ళు పైబడినవారిలో 64 శాతం మరణాలు సంభవించాయి. అక్కడ లాక్‌డౌన్ విధించలేదు. ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. 'ఈ మరణాలను లాక్‌డౌన్ ఏ విధంగా ఆపగలిగేది' అంటూ స్వీడన్‌కు చెందిన అంటువ్యాధుల విజ్ఞాన శాస్త్రవేత్తలు (ఎపిడమియాలజిస్టులు) చేస్తున్న వాదనలోని హేతుబద్ధతను ప్రశ్నించలేం. లాక్‌డౌన్ అమలు చేసిన, అమలు చేయని దేశాల్లోని మరణాల రేటులో వ్యత్యాసం దీర్ఘకాలంలో ఎక్కువగా ఉండదంటూ పలువురు నిపుణులు చేస్తున్న వాదననూ కొట్టివేయజాలం. లాక్‌డౌన్‌ను అమలు చేసిన స్విట్జర్లాండ్ సహా ఐరోపా దేశాలతో పోలిస్తే స్వీడన్‌లో నమోదవుతున్న కోవిడ్ కేసులు చాలా తక్కువగా ఉండటం గమనార్హం.
భారత్‌లో సత్ఫలితాలు
పరిసరాల పరిశుభ్రత తక్కువగా ఉండే, వ్యక్తిగత పరిశుభ్రత పాటించే అలవాటు అంతగా ఉండని భారత్ వంటి దేశాల్లో లాక్‌డౌన్ విధించకపోయినట్లయితే... వైరస్ మరింత ప్రమాదకరంగా పరిణమించి వేగంగా వ్యాప్తి చెంది ఉండేదనే వాదనలు సరైనవే. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో సరైన అవగాహన పెంపొందించడానికి సైతం లాక్‌డౌన్ ఉపయోగపడిందని చెప్పుకోవచ్ఛు అన్ని అంటువ్యాధుల మాదిరిగా ఇది కూడా వస్తుంది, పోతుందనే నిర్లక్ష్యపు ధోరణిని ప్రదర్శిస్తూ, ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోయినట్లయితే, సమస్య తీవ్రత ఊహకందని స్థాయిలో ఉండేది. మరోవైపు, వైరస్ స్వభావరీత్యా విశ్లేషిస్తే లాక్‌డౌన్ వ్యవధిని పెంచుకుంటూ పోవడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం శూన్యమేననేది అనుభవజ్ఞులైన పలువురు అంటువ్యాధి విజ్ఞానశాస్త్ర నిపుణుల అభిప్రాయం. దీనికి కారణమూ లేకపోలేదు.
అంటువ్యాధులు వ్యాప్తి చెందే తీరుతెన్నులను పరిశీలించినట్లయితే సాధారణంగా వ్యాధికారక క్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే కొద్దీ కాలక్రమేణా బాధితుల శరీర ధర్మానికి తగినట్లుగా తమను తాము మలచుకుంటాయి. ఈ క్రమంలో అవి తమ వ్యాధికారకతను పాక్షికంగా కోల్పోతుంటాయి. ఫలితంగా వ్యాధి తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ విధంగా రుగ్మతలు పెరిగే కొద్దీ, వ్యాధి కారకతతో సంబంధం లేకుండా, ఆయా ప్రాంతాల్లోని ప్రజా సమూహాల్లో వ్యాధికారక క్రిముల వ్యాప్తి జరుగుతుంది. తద్వారా నిరోధకత సముపార్జించుకున్న జనాభా వల్ల ఆయా ప్రాంతాల్లో సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) ఏర్పడుతుంది. ఆ తరవాత సామూహిక రోగ నిరోధకత బలహీనంగా ఉండేవారికి కొంతమేర రక్షణ అందించగలదేమోగానీ, రుగ్మతలు వ్యాపించకుండా నిరోధించలేదు. అందువల్ల ‘ఒక సమూహంలోని కొంతమందిలో ఏర్పడిన సామూహిక నిరోధకత వల్ల మిగిలిన జనాభాకూ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందదు’ అనే వాదనలో ఏ మాత్రం హేతుబద్ధత లేదనే అభిప్రాయాలున్నాయి. సామూహిక వ్యాధి నిరోధకత కేవలం వ్యాధికారక క్రిములు సహజసిద్ధంగా సంక్రమించినప్పుడే ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా కృత్రిమ పద్ధతుల్లో ఆటంకం కలిగించినప్పుడు సామూహిక రోగ నిరోధకత ఆలస్యంగా ఏర్పడటమో లేదా లోపభూయిష్ఠంగా మారడమో జరుగుతుంది. తద్వారా, ఈ విధానాల వల్ల కరోనా వైరస్‌లాంటి వ్యాధికారక క్రిములు మరింత ప్రమాదకరంగా పరిణామం చెందే అవకాశం కల్పించినట్లవుతుంది.