ప్రపంచంలో అతిపెద్ద రైల్వేల్లో ఒకటైన భారతీయ రైల్వే(Indian Railways)... 67 వేలకుపైగా కిలోమీటర్ల ట్రాక్‌తో రోజూ వేల సంఖ్యలో ప్రయాణికుల, సరకు రవాణా రైళ్లను నడుపుతోంది. రోజూ కోట్లమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా తరవాత అత్యధికంగా సరకు రవాణా చేస్తోంది. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సిమెంటు ప్రధానంగా గూడ్సు రైళ్లలోనే రవాణా అవుతాయి. ఆహార ధాన్యాల్లో 15.38 శాతం, పెట్రో ఉత్పత్తుల్లో 14.85 శాతం రైళ్లద్వారా తరలుతున్నాయి. ఇంతటి భారీస్థాయిలో నడిచే రైల్వేలు సహజంగానే ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటూ అధిక కర్బన ఉద్గారాలను వెదజల్లుతున్నాయి. 2015లో బొగ్గు పులుసు ఉద్గారాల్లో 13.2 శాతానికి యావత్ రవాణా రంగం కారణమైతే, అందులో 9.6 శాతం ఉద్గారాలు రైల్వేల(Indian Railways) ద్వారానే వెలువడ్డాయి. రవాణా రంగం నుంచి ఇంధనానికి దాదాపు 15 శాతం గిరాకీ వస్తే, అందులో అయిదు శాతానికి రైల్వేలే మూలం. ఈ గిరాకీని ప్రధానంగా శిలాజ ఇంధనాలే తీర్చడం వల్ల కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతున్నాయి. ఇటీవల ఇంధన పొదుపునకు తీసుకున్న చర్యలు ఫలించి ప్రయాణికుల రవాణాకు ఇంధన వినియోగం 36 శాతంపైగానే తగ్గింది. రవాణాపరమైన ఇంధన వినియోగం 17 శాతానికి పైగా తగ్గింది. ఫలితంగా ఈ రెండు రకాల రవాణా వల్ల వెలువడే కర్బన ఉద్గారాలూ ఇంచుమించు అదే స్థాయుల్లో తగ్గాయి.
విద్యుదీకరణ ప్రయోజనాలు
రష్యాలో 80, చైనాలో 73, ఆస్ట్రేలియాలో 68 శాతం ట్రాక్‌లను విద్యుదీకరించారు. భారత్‌లో ప్రయాణికుల రవాణా ట్రాక్‌లను 54 శాతం, సరకుల రవాణా ట్రాక్‌లను 65 శాతం విద్యుదీకరించారు. 2019 నవంబరు వరకు 37 వేల కిలోమీటర్ల ట్రాక్‌లను విద్యుదీకరించిన భారతీయ రైల్వే(Indian Railways) శాఖ 2023-24కల్లా మొత్తం ట్రాక్‌లను విద్యుదీకరించాలని లక్షిస్తోంది. దీనివల్ల ఖరీదైన డీజిల్ వాడకం తగ్గి ఏటా రూ.14వేల కోట్లు ఆదా అవుతాయి. బహిరంగ విపణిలో రేట్లు తగ్గినప్పుడల్లా కరెంటును కొనుగోలుచేస్తే మరింత ఆదా అవుతుంది. మొత్తంగా 2025కల్లా మొత్తం రూ.41వేల కోట్లు ఆదా చేయవచ్చు. డీజిల్ వినియోగం తగ్గితే కాలుష్యమూ భారీగా తగ్గుతుంది. ప్రపంచంలో ప్రధాన రైల్వేలు శిలాజ ఇంధనాలను విడిచి పునరుత్పాదక ఇంధనాలనే(Green Railway) వినియోగించాలని భావిస్తున్నాయి. భారతీయ రైల్వే తన ఇంధన అవసరాల కోసం 10 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని తలపెట్టింది.
1000 మెగావాట్ల సౌర విద్యుత్తుతో..