దేశ ఆర్థికానికి జీవనాడిలాంటి రైల్వే వ్యవస్థను విత్త సమస్యలు వెన్నాడుతున్నాయి. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడం, దేశచరిత్రలోనే తొలిసారిగా రైల్వేస్టేషన్లకు తాళాలు వేయడంవంటి చర్యలు రైల్వేను మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో మొదట వేసిన అంచనాకన్నా ఏకంగా 35శాతం(రూ.79,304 కోట్ల) మేర ఆదాయం తగ్గడం రైల్వే చరిత్రలోనే తొలిసారి. మరోవైపు ఖర్చులు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ ఏడాది రూపాయి సంపాదనకు పెట్టాల్సిన ఖర్చు 96.96 పైసలకు చేరింది. ఈ ఖర్చునే రైల్వే నిర్వహణ వ్యయ నిష్పత్తి (ఓఆర్) అని పిలుస్తారు. తాజా బడ్జెట్ కేటాయింపుల్లో రైల్వేలకు చరిత్రలో ఎన్నడూలేని రీతిలో రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చినట్లు కేంద్రం చాటుకుంది. కానీ రైల్వేల అభివృద్ధికి ఈ మొత్తం ఏ మూలకు సరిపోతుందన్నదే చర్చనీయాంశం.
నిధుల్లేక నైరాశ్యం..
రైల్వేల అభివృద్ధికి అప్పులు, ప్రైవేటు పెట్టుబడులే శరణ్యం అనేలా పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో రైల్వేల మూలధన వ్యయం రూ.2.15 లక్షల కోట్లు ఉంటుందని, ఇది దేశ చరిత్రలోనే అత్యధికమని రైల్వేశాఖ తాజాగా ప్రకటించింది. ఇందులో లక్షా ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్‌నుంచి కేటాయించారు. మిగిలిన మొత్తంలో లక్ష కోట్ల రూపాయల వరకు అప్పులు, ప్రైవేటు పెట్టుబడుల ద్వారా సేకరించక తప్పదు. భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు చూపుతున్నా అందులో రైల్వేశాఖ సొంతంగా సమకూర్చేది పది శాతమైనా ఉండదు. రైల్వేల నిర్వహణ వ్యయ నిష్పత్తి 2017-18లో 98.44 శాతానికి చేరింది. అంతకుముందు పదేళ్లకాలంలో అదే అత్యధికమని 'కాగ్' స్పష్టం చేసింది. రవాణాపై ఒక రూపాయి రాబట్టేందుకు 98.44 పైసలు ఖర్చుపెడితే- ఇక రైల్వేశాఖ వద్ద నిధులు మిగిలేదెలా? ఉదాహరణకు 2020-21 బడ్జెట్లో పింఛన్ల నిధికి రూ.53,960 కోట్ల కేటాయింపు చూపారు. కరోనా సంక్షోభంతో ఆదాయం లేదని చేతులెత్తేయడంతో ఆ డబ్బును కేంద్రం సర్దుబాటు చేసింది. చివరికి రైల్వేశాఖ ఆ నిధికి రూ.723కోట్లు మాత్రమే సొంతంగా ఇచ్చింది. ఇంత తక్కువగా ఖర్చుచూపడంతో ఈ ఏడాది 'ఓఆర్' 96.96 శాతం వద్ద నిలిచినట్లు అంచనా.
'రాష్ట్రీయ రైలు సంరక్ష కోశ్' ఏర్పాటు చేసినా..
ఒకవేళ మొత్తం రూ.53,960 కోట్లు రైల్వే చెల్లించాల్సి వస్తే ఈ ఏడాది 'ఓఆర్' 131.49శాతానికి చేరేది. ఇలాగే నిరుడు(2019-20) సైతం పింఛన్ల నిధికి రూ.48,350 కోట్లకు బదులు రూ.21,108 కోట్లే ఇవ్వడంతో 'ఓఆర్' 98.36శాతం వద్ద ఆగింది. అలా కాకుండా మొత్తం డబ్బు ఇచ్చి ఉంటే 'ఓఆర్' కూడా 114.19 శాతం ఉండేది. రాబడి ఎక్కువ, ఖర్చు తక్కువ ఉంటేనే లాభాలు వస్తాయి. ప్రయాణికుల ఛార్జీల రూపంలో రూ.61వేల కోట్ల ఆదాయ లక్ష్యానికిగాను సమకూరింది రూ.15వేల కోట్లే! గూడ్సు రైళ్లు నడపడంతో సరకు రవాణాపై ఆదాయం నిరుటితో పోలిస్తే మరో రూ.11వేల కోట్లు పెరిగి అది రూ.1.24 లక్షల కోట్లకు చేరింది. దేశం మొత్తం సరకు రవాణాలో 1950-51లో రైల్వేల వాటా 89 శాతం; అది ఇప్పుడు 30శాతానికి పడిపోయింది. మౌలిక సౌకర్యాల పునరుద్ధరణకోసం రైల్వేలు కనీసం లక్ష కోట్ల రూపాయలు తక్షణం ఖర్చుపెట్టాలని 'కాగ్' నివేదిక తెలిపింది. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు 2017-18లో 'రాష్ట్రీయ రైలు సంరక్ష కోశ్'(ఆర్‌ఆర్‌ఎస్‌కే) పేరిట నిధిని ఏర్పాటు చేశారు. ఏటా ఇందుకోసం తప్పనిసరిగా అయిదువేల కోట్ల రూపాయలు కేటాయించాలి. 2019-20లో ఈ నిధికి నిర్దేశిత కోటాలో సగం మొత్తాన్ని అంటే రూ.2,500 కోట్లు మాత్రమే ఇచ్చారు.