యావత్ ప్రపంచం కరోనాతో యుద్ధం చేస్తూ ఉంటే గల్వాన్‌లో భారత సైనికులపై దాడి, సరిహద్దుల ఆక్రమణ వంటి చిల్లర చేష్టలతో భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతోంది డ్రాగన్. ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికకు పథక రచన చేసింది. అసోంలో బ్రహ్మపుత్ర నది కింద సొరంగ మార్గం అనే ఊహించ సాధ్యం కాని ప్రణాళిక రూపొందించింది. దీని ద్వారా చైనా సరిహద్దులకు సమీపంలో అత్యాధునిక ఆయుధాల తరలింపును సులభ సాధ్యం చేయడం సహా... యావత్ చైనాను భారత అణ్వస్త్ర పరిధిలోకి తీసుకురావడం కేంద్రం వ్యూహం.
సూత్రప్రాయ అంగీకారం
చైనాకు దగ్గరగా ఉండే అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలో బ్రహ్మపుత్ర నది కింద 15 కిలోమీటర్ల పొడవునా ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలనేది కేంద్రం ప్రణాళిక. అసోంలోని నుమాలీగర్ వద్ద ఉన్న బ్రహ్మపుత్ర దక్షిణ తీరం నుంచి అదే రాష్ట్రంలోని గోహ్‌పుర్ వద్ద ఉన్న ఉత్తర తీరం వరకు ఈ సొరంగ మార్గం ఉంటుంది. నాలుగు లైన్లు ఉండే ఈ సొరంగ మార్గాన్ని 2028లోపు నిర్మించాలని కేంద్రం వ్యూహం రచిస్తోంది. ఇందుకు సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపింది. 2019 అక్టోబర్‌లో అంతర్జాతీయ టెండర్ల కోసం రిక్వెస్ట్‌ఫర్ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపింది. గత ఏడాది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కూడా పార్లమెంటరీ ప్యానెల్‌కు ఈ సొరంగ మార్గంపై పవర్ పాయింట్ ద్వారా వివరించింది. ఈ ప్రాజక్టుపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకున్నా అసోం ప్రసార మాధ్యమాలు అనేక వివరాలు వెల్లడించాయి.
అలా జరిగితే కష్టం
బ్రహ్మపుత్ర నదిపై ఇప్పటికే పలు వంతెనలు ఉన్నాయి. ఒక వేళ చైనాతో యుద్ధం వంటి పరిస్ధితులు తలెత్తితే చైనా ఈ వంతెనలను మొదటగా లక్ష్యంగా చేసుకుని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అప్పుడు వాస్తవాధీన రేఖ వద్దకు ఆయుధ సంపత్తిని తరలించడం సాధ్యం కాదు. అసోంలో భారత్‌కు పలు సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇక్కడ అగ్ని-2, అగ్ని-3, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను నిర్వహిస్తున్నారు. అగ్ని-2 పరిధి 3,500 కిలోమీటర్లు కాగా, అగ్ని-3 క్షిపణి 5 వేల కిలోమీటర్ల పరిధి కలిగి ఉంది. ఇక బ్రహ్మోస్ పరిధి 300 కిలోమీటర్లు. వీటన్నింటినీ రోడ్డు, రైలుపై నుంచి కూడా ప్రయోగించవచ్చు.
చైనా లక్ష్యాన్ని దెబ్బకొట్టేందుకు