తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వెట్టి వెతలు తీరేదెన్నడు? - international labor and employment laws

మన చుట్టూ ఉండే సమాజంలో బానిసత్వం వివిధ రూపాల్లో వేళ్లూనుకుపోయింది. గతంలో యుద్ధంలో చిక్కుకున్న సైనికులను బానిసలుగా మార్చి అమ్మినట్లుగా... ఆధునికానికి సరిపడేలా బానిసత్వం మరో రూపు దాల్చింది. లాభార్జన కోసం శ్రమదోపిడీకి పాల్పడటం, లైంగిక దోపిడీ తదితరాలు ఆధునిక బానిసత్వ చర్యలుగా పరిగణించేందుకు ఆవకాశం లేకపోలేదు. ఎన్ని చట్టాలు వచ్చినా.. అవి బానిసత్వాన్ని అడ్డుకోలేకపోతున్నాయి.

bonded labour changed its dimensions in the world by few case studies
రూపం మార్చిన వెట్టి వెతలు తీరేదెన్నడు?

By

Published : Dec 2, 2020, 10:20 AM IST

'ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం... నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం' అన్న శ్రీశ్రీ మాటలు- బానిసత్వం మానవ సమాజంలో అంతర్భాగం అయిందనడానికి మచ్చు తునకలు. పురాతన కాలంలో యుద్ధంలో చిక్కిన సైనికులను బానిసలుగా మార్చి అమ్మేవారు. ఆఫ్రికాలోని నల్లజాతీయులను ఖండాంతరాలకు తరలించి బానిసత్వపు సంకెళ్లు వేసేవారు. ఇప్పటి బానిసత్వం అలాంటిది కాదు. వివిధ రూపాల్లో కొనసాగుతోంది.

'వాక్‌ ఫ్రీ ఫౌండేషన్' ప్రకారం హింస, బలవంతం, మోసాల ద్వారా వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ- వారిని నియంత్రణలో ఉంచుకోవడం; లాభార్జన కోసం శ్రమదోపిడికి పాల్పడటం, లైంగిక దోపిడి తదితరాలు ఆధునిక బానిసత్వం కిందకు వస్తాయి. ఇంకా రుణ బానిసత్వం, బలవంతంగా వ్యభిచారంలోకి దించడం, చిన్నారులను సైన్యంలో ఉపయోగించడం, బలవంతపు పెళ్ళిళ్లు చేయడం, మహిళలను పిల్లలను అక్రమంగా రవాణా చేయడం తదితర దురాగతాలకు గురైన వారందరినీ ఈ ఆధునిక బానిసత్వం కింద గుర్తించవచ్చని తెలిపింది. ఈ వ్యవస్థను ఛత్తీస్‌గఢ్‌లో కమియా-మాలిక్‌ అని, కర్ణాటకలో బిల్డి-చక్రి అని, తెలుగు రాష్ట్రాల్లో వెట్టిచాకిరీ అని వ్యవహరిస్తుంటారు. 'గ్లోబల్‌ స్లేవరీ ఇండెక్స్‌-2013' సర్వే ప్రపంచంలో మూడు కోట్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలో ఉన్నారని తెలిపింది. భావి తరాలను ఈ వ్యవస్థ నుంచి బయట పడేయటానికి ప్రజల మధ్య అవగాహన పెంపొందించేందుకు ఐక్యరాజ్యసమితి 1949లో జరిగిన ఒడంబడిక ప్రకారం ఏటా డిసెంబర్‌ రెండో తేదీన 'అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం'గా నిర్వహించాలని నిర్ణయించింది.

ప్రపంచం మొత్తమ్మీద 15.20 కోట్ల మంది పిల్లలు వెట్టి చాకిరీలో ఉన్నారని అంచనా. అంటే ప్రతి పదిమందిలో ఒక బాలుడు కార్మికుడిగా జీవనం వెళ్లదీస్తున్నాడు. 'ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 2009-10' గణాంకాల ప్రకారం భారతదేశంలో 2.30 కోట్ల మంది ఇటుక బట్టీల్లో పనిచేస్తుండగా- వారిలో బాల కార్మికులు కోటిమందికి పైగా ఉన్నారని గుర్తించింది. ఈ నిర్బంధ, బాల కార్మికులు ఎక్కువగా క్వారీలు, అగ్గిపెట్టెల తయారీ, మందుగుండు సామగ్రి తయారీ, పట్టు పరిశ్రమ, గనులు, వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నట్లు వెల్లడించింది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఇతర ప్రాంతాలనుంచి సమూహాలుగా కూలీలను రప్పించి- వారికి ఒప్పంద పద్ధతిలో తక్కువ కూలి ఇస్తున్నారు. వారికి సరైన భోజన, వసతి సదుపాయాలూ ఉండటంలేదు. రోజుకు 16గంటలకు పైనే పని చేయించుకొంటున్నారు. ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాలు ఈ విషవలయంలోకి జారిపోతున్నాయి. దారిద్య్రంతో పాటు, నిరక్షరాస్యత, వ్యసనాలకు బానిసలు కావడం వంటివీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. కరోనా విజృంభణతో ఉపాధి కోల్పోయిన పేదలు సైతం బానిసత్వ కోరల్లో చిక్కుకునే అవకాశం లేకపోలేదు. ఈ దుస్థితిని అదుపు చేయడానికి జాతీయ, అంతర్జాతీయ చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాల సమన్వయలోపం వల్ల బానిసత్వాన్ని నియంత్రించడం పకడ్బందీగా జరగడం లేదు.

'మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌)' ప్రకారం బానిసత్వం చట్ట విరుద్ధం. భారతదేశం అంతర్జాతీయ కార్మిక వ్యవస్థ కన్వెన్షన్‌లో నిర్బంధ శ్రమకు వ్యతిరేకంగా ఓటు వేసినా- అత్యంత గర్హనీయమైన బాలకార్మిక వ్యవస్థకు సంబంధించిన 182వ ప్రకరణకు ఇంకా ఒప్పుకోవాల్సి ఉంది. భారత రాజ్యాంగంలోని 23వ అధికరణ బానిసత్వాన్ని పూర్తిగా నిషేధిస్తూ మనుషుల అక్రమ రవాణాను, నిర్బంధ శ్రమను నేరపరమైన చర్యలుగా పేర్కొంది. వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం-1976, బాలకార్మికుల జాతీయ విధానం-1987, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం-1988, అంతర్రాష్ట్ర వలస విధానం, కనీస వేతన చట్టం, పారిశ్రామిక చట్టాలు ఉన్నప్పటికీ అవినీతి, అధికారుల అలసత్వం, రాజకీయ పలుకుబడితో నిర్బంధ, బాల కార్మిక వ్యవస్థను సక్రమంగా నిరోధించలేకపోతున్నాయి. ఈ లోపాల కారణంగా 1985లో సుప్రీంకోర్టు ఈ చట్టాల అమలును పర్యవేక్షించే బాధ్యతను జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు అప్పగించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

బానిస వ్యవస్థను అదుపు చేయడంకోసం కఠిన చట్టాలను అమలు చేయడం తప్పనిసరి. దాంతోపాటు పేదరికం, అసమానతలను దూరం చేస్తూ పౌరులందరికీ సమాన విద్య వైద్య సదుపాయాలు కల్పించాలి. ముఖ్యంగా పౌర హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు, సంఘసంస్కర్తలు, స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు తదితరులు బాధితులకు బాసటగా నిలవాలి. వారికి సహాయ సహకారాలు అందించడం, పునరావాస కేంద్రాల్లో ఆసరా కల్పించడం ద్వారా భావి పౌరులను ఈ అమానవీయ దుస్థితి నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది.

- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌

ఇదీ చూడండి: 11న వైద్య విధులు బహిష్కరించండి: ఐఎంఏ

ABOUT THE AUTHOR

...view details