తెలంగాణ

telangana

ETV Bharat / opinion

జాతి దుర్విచక్షణతో నల్లకలువల ఆక్రందన

అమెరికాలో జాత్యహంకార పదఘట్టనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల పోలీసుల కర్కశత్వానికి జార్జ్​ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు ప్రాణాలు కోల్పోవడం దీన్ని బలపరుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా నల్ల కలువల దుర్భర స్థితిగతులు మళ్లీ చర్చకు వస్తున్నాయి.

By

Published : Jun 9, 2020, 10:53 AM IST

Black people fighting for rights in America
నల్లకలువల ఆక్రందన

అమెరికాలో అయిదు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. నేడు అక్కడ కరోనా మరణాలు, కట్టలు తెంచుకున్న నిరుద్యోగం, అల్లర్లు-లూటీలతో హోరెత్తుతోంది. కరోనా వైరస్‌ ధాటికి లక్షమందికి పైగా మృతి చెంది, లాక్‌డౌన్‌వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమై కోట్లాది ప్రజలు నిరుద్యోగులయ్యారు. ఈ విషమ సమయంలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్ల జాతీయుడు పోలీసు కిరాతకానికి బలైపోవడంపై నిరసనాగ్రహాలు ఎగసిపడ్డాయి. అల్లర్లకు, పోలీసు దమననీతికి దారితీశాయి. ఫ్లాయిడ్‌ హత్యకు అన్ని జాతుల ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా- నేర స్వభావం కలిగినవారు, నిరుద్యోగంతో నానా అగచాట్లపాలవుతున్నవారు లూటీలకు పాల్పడటంతో... నిరసనకారులకు, ముఖ్యంగా నల్లజాతీయులకు చెడ్డపేరు వస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- లూటీలు జరిగితే కాల్పులు జరపాల్సి వస్తుంది, సైన్యాన్ని దించాల్సి వస్తుందని హెచ్చరించడం ఓటర్లలో జాతిపరమైన చీలికను ప్రేరేపిస్తుందని విమర్శలు వెల్లువెత్తాయి. పైకి ట్రంప్‌- ఫ్లాయిడ్‌ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా ఆయన ట్వీట్లు, చేతలు శ్వేతజాతి ఆధిక్యవాదులకు వత్తాసు పలికేలా ఉన్నాయని వ్యాఖ్యాతల భాష్యం. అమెరికా జనాభాలో శ్వేతజాతీయులు 76.5శాతం; ఆఫ్రికన్‌-అమెరికన్లు 13.4శాతం; మెక్సికో, దక్షిణ అమెరికా దేశాల నుంచి వచ్చిన హిస్పానిక్స్‌ 18.3శాతం ఉన్నారు. చారిత్రకంగానే కాక సమకాలీనంగానూ ఆఫ్రికన్‌ అమెరికన్లు తీవ్రమైన జాతి దుర్విచక్షణకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా నల్ల కలువల దుర్భర స్థితిగతులు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ప్రపంచంలో అతి సంపన్న దేశమైన అమెరికాలో ప్రగతి ఫలాలు నల్లజాతివారికి ఇప్పటికీ అందని మానిపండేనని పలు అధ్యయనాల్లో పదేపదే రూఢి అవుతోంది. ప్రతిష్ఠాత్మక బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ 2016లో జరిపిన అధ్యయనం ఒక సగటు శ్వేతజాతి అమెరికన్‌ కుటుంబ నికర ఆర్థిక విలువ సగటు నల్లజాతి కుటుంబంకన్నా పదిరెట్లు ఎక్కువని తేల్చింది. పేదరికం, విద్యాపరమైన వెనకబాటుతనం, విచ్ఛిన్న కుటుంబాలు- నల్లజాతీయులను మద్యపానం, మాదకద్రవ్య వ్యసనాలు, నేరాలవైపు నెడుతున్నాయి. ఈ సామాజిక రుగ్మతను అమెరికా పాలనా వ్యవస్థ ఆర్థికంగా, రాజకీయంగా సరిదిద్దలేక పోలీసులకు ఆ బాధ్యతను వదిలేసింది.

తరతరాలుగా తీరని వెతలు

మరోవైపు కరోనా లాక్‌డౌన్లవల్ల పెచ్చరిల్లిన నిరుద్యోగం శ్వేతజాతీయులకన్నా ఆఫ్రికన్‌-అమెరికన్లనే ఎక్కువగా పీడిస్తూ వారిలో నిరసన, నిస్సహాయతలను పెంచుతోంది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణం తరవాత అధోజగత్‌ సహోదరులు ఒక్కపెట్టున వీధులకెక్కడానికి ఈ నిరాశానిస్పృహలే కారణమవుతున్నాయి. ఉదాహరణకు ఫ్లాయిడ్‌ మృతిచెందిన మినియాపోలిస్‌ నగరంలో 2018లో శ్వేతజాతీయుల్లో నిరుద్యోగ రేటు కేవలం 1.9శాతం; నల్లజాతివారిలో ఏకంగా 8శాతం. మిగతా అన్ని నగరాల్లో పరిస్థితి ఇంచుమించు ఇదేమాదిరిగా ఉంది. శ్వేతజాతీయుల్లో 8.1శాతం పేదరికంలో మగ్గుతుంటే, నల్లజాతివారిలో 20.8శాతం నిరుపేదలు. తెల్లజాతివారి సగటు వార్షిక ఆదాయం 71వేల డాలర్లు; ఆఫ్రికన్‌ అమెరికన్లది 41 వేల డాలర్లు మాత్రమే. కొవిడ్‌ వల్ల నల్లజాతీయుల్లో నిరుద్యోగమే కాదు- మరణాలూ పెచ్చుమీరాయి. గత మే 19 వరకు అమెరికాలో కరోనా వైరస్‌ వల్ల 99,000 మంది మరణించగా, వారిలో 89శాతం మృతుల జాతుల గురించి పరిశోధకులు ఆరా తీశారు. ఆ సమాచార విశ్లేషణలో దిగ్భాంతకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. కొవిడ్‌ వల్ల శ్వేతజాతీయులకన్నా 2.4 రెట్లు ఎక్కువగా నల్లజాతీయులు మరణించారు. ఆసియన్‌ అమెరికన్లు, హిస్పానిక్స్‌తో పోలిస్తే 2.2 రెట్లు ఎక్కువ నల్లజాతి మరణాలు సంభవించాయి. అమెరికాలో శ్వేతజాతివారి ఆయుర్దాయంకన్నా నల్లజాతి పురుషుల ఆయుష్షు దాదాపు అయిదేళ్లు తక్కువ. క్యాన్సర్‌, హెచ్‌ఐవీ, హృద్రోగాలు, హత్యలు ఆఫ్రికన్‌ అమెరికన్ల ఆయుర్దాయాన్ని హరిస్తున్నాయి. ముఖ్యంగా 10-24 ఏళ్ల మధ్య వయసు నల్లజాతీయుల మరణాలకు హత్యలే ప్రధాన కారణం.

మళ్లీ గెలిచేందుకేనా?

అమెరికాలో నల్లజాతివారు, ముఖ్యంగా పురుషులు ప్రతిరోజూ జాతిపరమైన దుర్విచక్షణకు గురికావడం వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. 66 శాతం నల్లజాతివారు ప్రతిరోజూ జాతి విచక్షణను ఎదుర్కొంటున్నామని ఒక అధ్యయనంలో చెప్పారు. నల్లజాతివారనే కారణంపై ఉద్యోగాలు దొరక్కపోవడం, ఒకవేళ దొరికినా పని స్థలాల్లో దుర్విచక్షణకు గురికావడం వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఉన్నత విద్యావంతులైన ఆఫ్రికన్‌ అమెరికన్లు సైతం జాతి విచక్షణకు అతీతులు కారు. ఎంతో కష్టపడి చదువుకొని, ఎన్నో ఆశలతో జీవితంలోకి అడుగుపెట్టిన నల్లజాతి విద్యావంతులు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానాలను అందుకోలేక, ఒకవేళ అందుకున్నా తగిన ప్రోత్సాహం లభించక మానసికంగా కుంగిపోతున్నారు. వ్యాధుల పాలబడుతున్నారు. నల్లజాతివారు శ్వేతజాతీయులతో సమానంగా వైద్యసేవలూ పొందలేకపోతున్నారు. ఇంతటి దారుణ దుర్విచక్షణవల్ల ఆఫ్రికన్‌ అమెరికన్లలో గూడుకట్టిన ఆగ్రహం జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణంతో అగ్నిపర్వతంలా బద్దలయింది. సమస్య ఇంత లోతైనది అయినా- అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుత నిరసనలు, అల్లర్లను కేవలం శాంతిభద్రతల సమస్యగా చిత్రించడం జాతుల మధ్య విభజనను మరింత ఎగదోస్తుందని విమర్శలు హోరెత్తుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి ట్రంప్‌ ఈ ఎత్తు వేశారని విశ్లేషణలు జోరందుకున్నాయి. గతంలో రిచర్డ్‌ నిక్సన్‌, రొనాల్డ్‌ రీగన్‌, జార్జ్‌ హెచ్‌.డబ్ల్యు.బుష్‌లు సామాజిక, ఆర్థిక కల్లోలాన్ని శాంతిభద్రతల సమస్యగా చిత్రించి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించారు. ట్రంప్‌ ఈ పూర్వ అధ్యక్షులను ఆదర్శంగా తీసుకొంటున్నట్లుంది. శాంతిభద్రతల విచ్ఛిన్నానికి నల్లజాతివారు, హిస్పానిక్స్‌ మాత్రమే కారకులని శ్వేతజాతి ఆధిక్యవాదుల్లో పాతుకుపోయిన దురభిప్రాయాన్ని సొమ్ము చేసుకొందామని ఆయన ఆరాటపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నల్లజాతివారు, హిస్పానిక్స్‌, ఆసియన్‌ అమెరికన్లు ప్రధానంగా ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి మద్దతు తెలుపుతుంటారు. ఈ ఉక్రోషంతో శ్వేతజాతి వ్యక్తి ఒకరు 'డెమోక్రాట్లలో పోయినవాళ్లే మంచివాళ్లు' (ది ఓన్లీ గుడ్‌ డెమోక్రాట్స్‌ ఆర్‌ డెడ్‌ డెమోక్రాట్స్‌) అంటూ చేసిన ట్వీట్‌ను ట్రంప్‌ రీట్వీట్‌ చేయడం- ఆయన మనోభావాలకు అద్దంపడుతోంది!

పౌరులపై అమానుషం

అమెరికన్‌ పట్టణ పోలీసు సిబ్బందిలో మెజారిటీ- శ్వేతజాతీయులే కావడం, అమెరికన్‌ పోలీసు బలగంలో 20శాతం మాజీ సైనికులు కావడం సమస్యను జటిలం చేస్తోంది. ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌లలో ఉగ్రవాదుల అణచివేతలో తలమునకలై మానసిక సమస్యలతో బాధపడుతున్న మాజీ సైనికులు పోలీసు శాఖలో గణనీయంగానే ఉన్నారు. ఈ మానసిక ప్రవృత్తి స్వదేశీ పౌరులను కూడా ఉగ్రవాదుల్లా పరిగణించి వారిపై అతిగా బలప్రయోగానికి దిగేట్లు చేస్తోంది. బోస్టన్‌లో 2010-15 మధ్య సైనికానుభవం కలిగిన ప్రతి 100 మంది పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి పాల్పడినట్లు 28 ఫిర్యాదులు వస్తే- అటువంటి రికార్డు లేని పోలీసులపై 17 ఫిర్యాదులే వచ్చాయి. జార్జ్‌ ఫ్లాయిడ్‌ పీక మీద మోకాలు పెట్టి అతడి మరణానికి కారకుడైన డెరెక్‌ చావిన్‌ సైతం అమెరికా సైన్యంలో పోలీసు అధికారిగా పనిచేసినవాడే. అతడి తీరుపై గతంలోనే 18 ఫిర్యాదులు వచ్చినా ఎటువంటి చర్యలూ తీసుకొనకపోవడం అమెరికా పోలీసు వ్యవస్థ లోపాలను బయటపెడుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ ధోరణి ఈ లోపాలను సరిదిద్దకపోగా, మరింత ఎగదోసేట్లు ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- కైజర్‌ అడపా (రచయిత)

ఇదీ చూడండి:పోలీసువ్యవస్థ రద్దు డిమాండ్‌లను తోసిపుచ్చిన ట్రంప్

ABOUT THE AUTHOR

...view details