తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఈశాన్య రాష్ట్రాల్లో బలపడుతున్న భాజపా.. మణిపుర్​లో తొలిసారి అలా! - భాజపా వార్తలు

BJP News: ఈశాన్య రాష్ట్రాల్లో భాజపా బలపడుతోంది. మణిపుర్​లో రెండోసారి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా మణిపుర్‌లోని పర్వత ప్రాంతాలకు, లోయ ప్రాంతానికి మధ్య తీవ్రమైన అంతరం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, చివరకు నిత్యావసరాల సరఫరాల విషయంలోనూ తమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్న భావన పర్వతప్రాంతవాసుల్లో ఉండేది. వీటిని తొలగించడంలో భాజపా చాలావరకు విజయం సాధించింది.

BJP strengthens in Eastern states forms govt alone
ఈశాన్య రాష్ట్రాల్లో బలపడుతున్న భాజపా

By

Published : Mar 16, 2022, 7:35 AM IST

Updated : Mar 16, 2022, 7:45 AM IST

BJP eastern states: భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో బలంగా వేళ్లూనుకొంటోంది. మణిపుర్‌లో పాత్రికేయుడిగా ప్రస్థానం ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రి అయిన ఎన్‌.బీరేన్‌సింగ్‌ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలాన్ని సొంతంగానే సంపాదించగలిగింది. మొత్తం 60 స్థానాలున్న మణిపుర్‌ అసెంబ్లీలో 2017 ఎన్నికల్లో 28 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో వెనకబడింది. నాడు 21 సీట్లు మాత్రమే వచ్చిన భాజపా, మిత్రపక్షాల సాయంతో అధికారాన్ని చేపట్టింది. ఈసారి భాజపా 32 స్థానాలు సంపాదించింది. ఆ పార్టీకి దాదాపు 38శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి 16.8శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌పార్టీ అయిదు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) సైతం అయిదు స్థానాలే సాధించడం గమనార్హం. ఎన్నికలకు ముందే ఎన్‌పీఎఫ్‌ పార్టీతో భాజపా పొత్తు పెట్టుకున్నందువల్ల, సంకీర్ణ ధర్మాన్ని గౌరవిస్తూ ఆ పార్టీనీ ప్రభుత్వంలో భాగస్వామిగా చేర్చుకోబోతోంది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) ఈసారి భాజపాతో పొత్తు ఉండదని ఇప్పటికే ప్రకటించింది.

దశాబ్దాలుగా మణిపుర్‌లోని పర్వత ప్రాంతాలకు, లోయ ప్రాంతానికి మధ్య తీవ్రమైన అంతరం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, చివరకు నిత్యావసరాల సరఫరాల విషయంలోనూ తమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్న భావన పర్వతప్రాంతవాసుల్లో ఉండేది. రాజకీయంగా సైతం రెండు ప్రాంతాల నేతల మధ్య తీవ్ర వైరుధ్యాలుండేవి. పర్వతప్రాంత వాసులకు అందాల్సిన సదుపాయాలేవీ అందేవి కావు. ఈ అంతరాలను తొలగించడంలో భాజపా చాలావరకు విజయం సాధించింది.

బీరేన్​ సింగ్​ మరోసారి

అయిదేళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన బీరేన్‌సింగ్‌ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నా, ఈసారి మరికొందరూ పోటీపడుతున్నారు. గత సంవత్సరం వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి, ఆ పదవితో పాటు తన శాసనసభ్యత్వాన్నీ వదులుకుని భాజపాలో చేరిన బిష్నుపుర్‌ ఎమ్మెల్యే గోవిందాస్‌ కొంతౌజమ్‌ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆయన ఏడుసార్లు బిష్నుపుర్‌ నుంచి గెలిచారు. గత ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా పనిచేసిన బిశ్వజిత్‌సింగ్‌ కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గత శాసనసభలో స్పీకర్‌గా వ్యవహరించిన యుమ్‌నమ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ సైతం ముఖ్యమంత్రి పదవి రేసులోనే ఉన్నారు. హైరొక్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన తొక్చొమ్‌ రాధేశ్యామ్‌ సింగ్‌ తానూ పోటీలోనే ఉన్నానంటున్నారు. అస్సామ్‌లో రెండోసారి గెలిచినప్పుడు అనుసరించిన వ్యూహాన్నే మణిపుర్‌లోనూ భాజపా అనుసరిస్తుందా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు సర్బానంద సోనోవాల్‌ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలు జరిగాయి. భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కానీ, ఆయనను కాదని హిమంత బిశ్వశర్మను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు.

తొలిసారిగా మణిపుర్‌ శాసనసభకు అయిదుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. భాజపా తరఫున గత ఎన్నికల్లో విజయం సాధించిన నిమ్చా కిప్గెన్‌ మంత్రివర్గంలోనూ స్థానం పొందారు. ఈసారీ ఆమె విజయం సాధించారు. ఆమెతో పాటు ఎస్‌ఎస్‌ ఓలిష్‌, కిమ్నియో హోకిప్‌ హాంగ్షింగ్‌, ఇరెంగ్బం నళినీ దేవి, సగోల్షెమ్‌ కెబీ దేవి గెలిచారు. వీరిలో ఇద్దరు గిరిజన తెగల నుంచి తొలిసారి గెలిచినవారు; మరో ఇద్దరు మణిపుర్‌లోని ప్రభావవంతమైన మైటై వర్గానికి చెందినవారు. నాగా వర్గం నుంచి వారి సొంత రాష్ట్రమైన నాగాలాండ్‌లో ఒక్కరూ ఇంతవరకూ ఎమ్మెల్యేగా గెలవలేదు గానీ, మణిపుర్‌లో మాత్రం భాజపా తరఫున పోటీ చేసిన నాగా మహిళ ఒలిష్‌ విజయం సాధించారు. 2017తో పోలిస్తే ఈసారి బరిలో నిలిచిన మహిళా అభ్యర్థుల సంఖ్య కూడా కొంత పెరిగింది. అప్పట్లో 11 మందికే అవకాశమివ్వగా, ఈసారి 17 మంది పోటీపడ్డారు .

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అన్ని పార్టీలూ యథేచ్ఛగా ప్రలోభాల పర్వానికి పాల్పడ్డాయి. 2017లో ఎన్నికల అధికారులు అయిదు కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారం, మాదకద్రవ్యాలు, మద్యం స్వాధీనం చేసుకొన్నారు. ఈసారి రూ.170 కోట్ల విలువైన నగదు, మద్యం తదితరాలు స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులకు చిక్కకుండా పంపిణీ చేసినవి ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయని అంచనా. ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లను భయపెట్టడం, పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ లాంటి ఆరోపణలూ వచ్చాయి. -కామేశ్‌

ఇదీ చదవండి:భూరికార్డుల ఆధునికీకరణ కోసం ఒకే దేశం- ఒకే రిజిస్ట్రేషన్‌

Last Updated : Mar 16, 2022, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details