ఆరు నెలల వ్యవధిలో మూడు రాష్ట్రాల్లో నలుగురు ముఖ్యమంత్రుల మార్పుతో భాజపా రాజకీయాలు కొత్త మలుపు తీసుకొన్నాయి. ఉత్తరాఖండ్, కర్ణాటకల వరసలో తాజాగా గుజరాత్ పరిణామాలు- పార్టీపై పెరిగిన అధిష్ఠానం పట్టుకు అద్దం పడుతున్నాయి. 'ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకొన్నాం. రాబోయే ఎన్నికల్లోనూ గెలిచి రికార్డు సృష్టిస్తా'మని సీఎంగా విజయ్ రూపాణీ ఇటీవలే దీమాగా ప్రకటించారు. అంతలోనే రాష్ట్రాభివృద్ధికి కొత్త నాయకత్వం అవసరమంటూ తన పదవికి రాజీనామా సమర్పించేశారు! ఆయనను తప్పించడం తథ్యమనే కథనాలు కొన్నాళ్లుగా వెలువడుతున్నా- బాధ్యతల బదలాయింపులో వేగమే ఎవరి ఊహలకూ చిక్కలేదు. అంతకు మించి రూపాణీ వారసుడిగా భూపేంద్ర పటేల్ ఎన్నిక- పార్టీవర్గాల అంచనాలకూ అందలేదు! అందరినీ కలుపుకొని పోయే అనుభవజ్ఞుడైన నాయకుడే నూతన సీఎం కావాలన్న నితిన్ పటేల్ వంటి కాకలుతీరిన నేతలను కాదని మరీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన భూపేంద్రకు అధిష్ఠానం పట్టంకట్టింది.
రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాలుగా అధికారాన్ని చలాయిస్తున్న భాజపా- 2017లో బొటాబొటీ ఆధిక్యంతో గట్టెక్కింది. స్థానిక రాజకీయాలను వేడెక్కించిన పాటీదార్ ఉద్యమం దరిమిలా అంతకు ఏడాది మునుపే ఆనందీబెన్ పటేల్ నుంచి సారథ్య బాధ్యతలను రూపాణీ స్వీకరించారు. కొవిడ్ రెండో దశ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఆయన వైఫల్యానికి బలమైన పాటీదార్ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న అధిష్ఠానం ఆలోచనలు తోడై- భూపేంద్ర హఠాత్తుగా తెరపైకి వచ్చారు. శాసనసభ ఎన్నికలకు మరో పదిహేను నెలలే గడువున్న తరుణంలో కొత్త నేతను కొలువుతీర్చిన పార్టీ వ్యూహం పారుతుందా? ప్రజల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి ప్రధాని స్వరాష్ట్రంలో కాషాయ ధ్వజం మళ్ళీ రెపరెపలాడుతుందా?
ముఖ్యమంత్రులను మార్చడంలో గతకాలపు కాంగ్రెస్ దుర్విధానాలను కమలదళమూ అందిపుచ్చుకొందనే విమర్శలు ఇటీవల ముమ్మరించాయి. ఝార్ఖండ్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో అటువంటి కఠిన నిర్ణయాలు అవసరమవుతున్నాయని భాజపా అధిష్ఠానం సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అసమర్థ నాయకుడిగా దుష్కీర్తిని మూటగట్టుకొన్న రఘుబర్‌దాస్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన కమలదళానికి రెండేళ్ల క్రితం అక్కడ పరాజయం తప్పలేదు. మిగిలిన రాష్ట్రాల్లో ఆ పరిస్థితి తలెత్తకూడదన్నదే అధిష్ఠానం అంతరంగంగా పార్టీవర్గాలు అభివర్ణిస్తున్నాయి.